ఆదివారం కూకట్‌పల్లిలో జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఢిల్లీ నుంచి ఆశించడం కాదు.., శాసించే స్థాయికి ఎదగాలన్న ప్రొఫెసర్ జయశంకర్ సారు కలను సాకారం చేసే అవకాశం ఇప్పుడు వచ్చిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. 16 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని ఢిల్లీకి పంపడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునే దిశగా ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో జరిగిన పద్మారావుగౌడ్, మాధవరం కృష్ణారావుల విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అపూర్వ విజయానికి కారణమైన సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అశేషంగా ఆదరించిన ప్రజలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ 150, యూపీఏ 100 సీట్లు దాటే పరిస్థితిలేదన్నారు.
టీఆర్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు రెట్టింపు మెజార్టీలు సాధించేలా కృషిచేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేసి.. 103 స్థానాల్లో డిపాజిట్‌లు కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి పేరిట వచ్చి ఓటమిని చవిచూసిందన్నారు. గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. అధికారంలోకి రావాలన్న తపనతో భావసారూప్యత లేని పార్టీలు మహాకూటమి పేరిట ఏకమైనా... ఇంటి కిరాయిల చెల్లింపుతో పాటు లెక్కకుమించిన హామీలు ఇచ్చినా ఓటర్లు ఆ పార్టీలను తిరస్కరించారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు దేశవ్యాప్త ప్రచారం పొందుతున్నాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో దేశానికి ఆదర్శవంతమైన సీఎంగా కేసీఆర్‌కు ప్రాముఖ్యత లభించిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం గరీబోళ్లకు అన్నివిధాలా న్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత రాజకీయాలకు ఆదర్శంగా, దిక్సూచిగా కేసీఆర్ నిలుస్తున్నారన్నారు.
ఓటరు నమోదుపై దృష్టి పెట్టండి....
గడిచిన ఎన్నికలలో ఓట్లువేయలేకపోయిన లక్షలాది మంది ఆశీర్వాదాన్ని టీఆర్‌ఎస్ పార్టీ అందుకోలేకపోయిందని, అందరూ ఓటువేసి ఉంటే మెజార్టీ మరింతగా పెరిగేదన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపు నిలిచి నగరంలోనే అత్యధిక ఓటింగ్‌శాతాన్ని అందించారని తెలిపారు. ఓటరు నమోదులోను కూకట్‌పల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ముందంజలో నిలవాలని కోరారు. ప్రతీ పోలింగ్‌బూత్ స్థాయిలోనూ నమోదు చేపట్టి అందరికీ ఓట్లు వచ్చేలా చూడాల్సిన బాధ్యతను డివిజన్ స్థాయి నాయకులు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment