
సాక్షి, హైదరాబాద్ : ‘మేం గులాబీ జెండా ఓనర్లం’అంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమయ్యాయి.ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన.. మీడియాతో ముచ్చటించారు.ఇటీవల మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘గులాబీ జెండా ఓనర్ కేసీఆర్.. పార్టీ జెండాను రూపొందించింది ఆయనే కదా’అని వ్యాఖ్యానించారు. మంత్రివర్గం నుంచి ఈటలను తొలగిస్తారనే వార్తలు నిజమేనా అని ప్రశ్నించగా.. ఈటల అంశం సమసిపోయింది. ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదన్నారు. మీరు టీఆర్‌ఎస్‌లోకి ఆలస్యంగా వచ్చారు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. తెలుగుదేశంలో ఉన్నా మేమూ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ నుంచి లేఖ ఇప్పించాం కదా. అందులో నేను చేసిన కృషి ఏంటో అందరికీ తెలుసు’అంటూ మంత్రి తన సంభాషణను ముగించారు.
పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ..
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు శనివారం తెలంగాణ భవన్‌లో పలువురు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్.. సాయంత్రం ఐదు గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, రెడ్యా నాయక్, బాల్క సుమన్, గాందీ, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు.