సాక్షి, హైదరాబాద్: రుణాలు, ఫండింగ్ విషయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు బ్యాంకులు అండగా ఉండాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల నుంచి మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు రుణాల వసూళ్ల విషయంలో కొంత ఉదారతతో వ్యవహరించాలని, పరిశ్రమలు తిరిగి గాడినపడేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఎస్‌ఎంఈల కోసం ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ‘ప్రేరణ’కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈలకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలతోపాటు రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందని, దీన్ని సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఖాయిలా పడిన ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు కృషి చేస్తున్న ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌తో ఇండియన్ బ్యాంక్ భాగస్వామిగా మారి సహాయం చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని స్వయం సహాయక సంఘాలు రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీపేమెంట్ రేటును కలిగి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కలిగి ఉందని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ డెవలప్‌మెంట్ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని బ్యాంక్ సీఈఓ, ఎండీ పద్మజా చుండూరును మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రారంభించిన టీ–హబ్, వీ–హబ్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి అండగా దేశవ్యాప్తంగా ‘ప్రేరణ’కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇందులోభాగంగా అత్యంత సులువుగా రుణాలివ్వడంతోపాటు పరిశ్రమల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని పద్మజా చెప్పారు. రాష్ట్రంలో తమ బ్యాంకు ఇప్పటికే పలు కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఎంఎస్‌ఎంఈలకు అండగా ఉండాలి
Published Wed, Jul 7 2021 2:10 AM | Last Updated on Wed, Jul 7 2021 2:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment