
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు గెలుస్తామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు గత నాలుగేళ్లలో చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతాయని చెప్పారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు బదులిచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులిస్తామని మొదట చెప్పి, ఇప్పుడు రుణం ఇస్తామని కాంగ్రెస్ మాట మార్చిందని చెప్పారు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల తర్వాత అమలు చేస్తుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం ఉనికి లేదని చెప్పారు. బీజేపీ ఒక్క సీటు గెలవడం కూడా అనుమానమేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఉద్ఘాటించారు. ప్రజాకూటమికి డబ్బుల సంచులు అందుతున్నాయని, అందుకే పత్రికలకు రోజూ ప్రకటనలు జారీ చేస్తోందన్నారు.
నల్లగొండలో అన్ని సీట్లు మావే..
ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ సర్వే జోక్ లాంటిదన్నారు. ఆయన కుప్పిగంతులు పార్లమెంట్‌లో తెలంగాణను అడ్డుకోలేకపోయాయని, ఆయన సర్వేలు టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేవని పేర్కొన్నారు. 67 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణను నిర్వీర్యం చేయడం వల్లే ప్రత్యేక రాష్ట్రం అవసరమైందని, మళ్లీ ఆ పార్టీలు అదే పని చేసేందుకు ఉబలాటపడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌లో చాలా మంది సీఎం అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామన్నారు. సిద్దిపేటలో హరీశ్‌రావుకు లక్ష ఓట్ల మెజారిటీ రావాలని ఆశించారు. ఓటుకు కోట్లు కేసు తార్కిక ముగింపునకు చేరుతుందన్నారు. వయసు రీత్యా తనలో ఇంకా మార్పు రాదని, భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటానని పేర్కొన్నారు.
వచ్చే సారికి మూసీ ప్రక్షాళన
యువకులకు నిరుద్యోగ భృతితో పాటు శిక్షణ కూడా అందిస్తామని చెప్పారు. 1.09లక్షల ఉద్యోగాల భర్తీని ఆమోదించామని, 87 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేసి, ఇప్పటివరకు 38 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. వచ్చేసారి ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు. మళ్లీ అధికారం చేపట్టాక మూసీ ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పారు. మీడియాకు సైతం జవాబుదారీతనం ఉండాలని సూచించారు. హైటెక్ సిటీ ప్రాంతానికి మెట్రో రైలు ట్రయల్ రన్ ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలో సేవలు అందిస్తామన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఎంఐఎం పోటీ చేస్తున్న రాజేంద్రనగర్ స్థానాన్ని టీఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తుందన్నారు. నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా కఠినమైన చట్టాలు అవసరమన్నారు. హైదరాబాద్‌లోని నాలాల దుస్థితిపై ఒకరు ప్రశ్నించగా, రూ.541 కోట్లతో 40 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. హైదరాబాద్‌లోని రోడ్ల పరిస్థితిపై తాను ఆనందంగా లేనని చెప్పారు.
పోల్ మేనేజ్‌మెంట్ అంటే?
పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారా.. అని ప్రశ్నించగా, అదేంటని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు. ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల వైపు ప్రజలు మొగ్గు చూపకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టపర్చాల్సిన అవసరముందని అంగీకరించారు. ఉప్పల్‌లో త్వరలో ఐటీరంగ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో కాలుష్యానికి కారణమవుతున్న 3,800 సిటీ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామన్నారు. వెయ్యి ఎంఎల్‌డీల సామర్థ్యంతో మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు.
50 వేల మెజార్టీతో గెలుస్తా
సిరిసిల్లలో 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా కేటీఆర్ మీడియా ఇష్టాగోష్టిలో ముచ్చటించారు. ఈసారి కూడా సిరిసిల్లలో గెలుపు తథ్యమన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, మధిర లో భట్టి విక్రమార్క ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే రేవంత్‌రెడ్డి డ్రామాలు మొదలు పెట్టాడని, కొడంగల్‌లో గెలవలేక ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పారు. మహిళలు, ముస్లిం లు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, సెటిలర్లు కూడా మావైపే ఉన్నారని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ జెండా ఎగరటం ఖాయమని చెప్పారు. కేసీఆర్ స్థాయి నేత కాంగ్రెస్‌లో లేడని, రానున్న రోజుల్లో ఏపీలో కూడా తాను తిరుగుతానని చెప్పారు. చివరి రోజు 5న ఎవరి నియోజకవర్గాల్లో వారే ప్రచారం చేసుకుంటారని చెప్పారు.