హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సీఐడీ నిగ్గు తేల్చింది. ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో వాస్తవికత ఎంత? అన్న అంశంపై సీఐడీ చేపట్టిన దర్యాప్తు దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించిన.. దరఖాస్తుదారులకు వైద్య సేవలు అసలు అందాయా..? ఆయా దరఖాస్తుదారులకు అందిన వైద్య సేవలకు తగ్గట్లు వైద్య బిల్లులున్నాయా..? జరిగిన వైద్యానికి మించి అడ్డగోలుగా వైద్య ఖర్చులు చూపి బిల్లులు పెంచేశారా..? వైద్యం జరగకపోయినా నిధులను స్వాహా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారా..? తదితర అంశాలను సీఐడీ ఆరా తీసింది. సచివాలయంలోని సీఎంఆర్‌ఎఫ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న దరఖాస్తులు, ఇతర రికార్డుల్లోని వివరాలతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను విచారణ అధికారులు పోల్చి చూశారు.
ఈ క్రమంలో సీఐడీ బృందాలు సంబంధిత ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులతోపాటు దరఖాస్తుదారుల నుంచి కావాల్సిన వివరాలను రాబట్టాయి. ఈ కుంభకోణంలోని మధ్యవర్తులు, సహకరిస్తున్న ఆస్పత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పెండింగ్ బిల్లులపై దర్యాప్తు పూర్తై నేపథ్యంలో..సీఎంఆర్‌ఎఫ్‌లో చోటుచేసుకున్న పలు అక్రమాలకు సంబంధించిన రహస్యాలు ప్రస్తుతం సీఐడీ గుప్పిట్లో ఉన్నాయి. ఈ దర్యాప్తులో తేలిన అంశాలపై సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని సీఐడీ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నివేదిక అందాకే ప్రభుత్వం ఆస్పత్రులకు వాస్తవంగా చెల్లించిన బకాయిలను నిర్ధారించుకుని విడుదల చేయనుంది. అక్రమాలకు పాల్పడిన దరఖాస్తుదారులు, అందుకు సహకరించిన ఆస్పత్రులు, సీఎంఆర్‌ఎఫ్ కార్యాలయ వర్గాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ కేసులు నమోదు చేసే అవకాశముంది.
బిల్లుల చెల్లింపులపై తదుపరి దర్యాప్తు...
సీఎంఆర్‌ఎఫ్ చెల్లింపుల్లో అక్రమాలపై కేసీఆర్ నెల కింద ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐడీ విభాగం.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి సీఎంఆర్‌ఎఫ్ కింద సహాయం కోసం వచ్చిన 9200కుపైగా దరఖాస్తులపై దర్యాప్తు చేపట్టింది. అందులో దాదాపు 95 శాతం దరఖాస్తులకు చెల్లింపులు పూర్తికాగా, ఇంకా 1,251 దరఖాస్తుదారులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఆస్పత్రులకు విడుదల చేయాల్సి ఉంది. దర్యాప్తు ప్రభావంతో బకాయిల చెల్లింపు నిలిచిపోకుండా తొలుత పెండింగ్ బిల్లులపైనే సీఐడీ దర్యాప్తు పూర్తి చేసింది. తదుపరి దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చెల్లింపులు జరిగిన 7,200 దరఖాస్తులపై దృష్టిసారించనున్నారు. సీఐడీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సీఐడీ ఏకంగా ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
సీఐడీ గుప్పిట్లో 'సీఎంఆర్‌ఎఫ్' అక్రమాలు!
Published Fri, Mar 6 2015 3:06 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
Advertisement