grip
-
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రిప్ ఇన్వెస్ట్ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్) మిలీనియల్స్ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్ ఇన్వెస్ట్ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్ తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి. జెన్ ఎక్స్ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్‌ఫామ్‌లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్–యువర్సెల్ఫ్ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్‌లోని మిలీనియల్స్ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు’ అని గ్రిప్ ఇన్వెస్ట్ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్‌గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్ ఎక్స్‌గా పరిగణిస్తారు. -
అభివృద్ధికి ‘రోడ్’మ్యాప్‌లు
ఎటైనా వెళ్లాలంటే.. బండి తీశామా, రోడ్డెక్కామా అంతే. వేరే పట్టణానికో, రాష్ట్రానికో వెళ్లాలంటే.. కారులోనో, బస్సులోనో హైవే ఎక్కాల్సిందే. కొన్ని హైవేలు అయితే వందలు, వేల కిలోమీటర్ల మేర సాగుతూనే ఉంటాయి. మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎంత పొడవున రోడ్లు ఉన్నాయో తెలుసా? మన దేశంలో ఉన్న రోడ్ల లెక్క ఏమిటో తెలుసా? దీనిపై తాజాగా ‘విజువల్ క్యాపిటలిస్ట్’సంస్థ ఓ అధ్యయనం చేయించి ‘రోడ్ల’లెక్కలు తేల్చింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ మొత్తంగా కోట్ల కిలోమీటర్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద హైవేల నుంచి గ్రామీణ రోడ్ల దాకా.. మొత్తం రహదారుల పొడవు సుమారు 2.1 కోట్ల కిలోమీటర్లపైనే. చంద్రుడికి, భూమికి మధ్య దూరం సుమారు 3 లక్షల కిలోమీటర్లు. ఈ లెక్కన భూమ్మీద రోడ్ల పొడవు.. 35 సార్లు చంద్రుడి వద్దకు వెళ్లి వచ్చినంత అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 200కుపైగా దేశాలు ఉంటే.. మొత్తం రోడ్ల విస్తీర్ణంలో ఒక్క అమెరికాలోనే 14 శాతానికిపైగా ఉండటం గమనార్హం. విజువల్ క్యాపిటలిస్ట్ సంస్థ కోరిన మేరకు పైథాన్ మ్యాప్స్ సంస్థ ఈ అధ్యయనం చేసింది. ‘గ్లోబల్ రోడ్స్ ఇన్వెంటరీ ప్రాజెక్ట్ (జీఆర్‌ఐపీ)’లోని రోడ్ల డేటాను సేకరించి.. వివిధ దేశాలు, ప్రాంతాల వారీగా క్రోడీకరించింది. ఏ దేశంలో.. ఎంత పొడవుతో.. ప్రపంచవ్యాప్తంగా 222 దేశాల్లో కలిపి మొత్తం రోడ్ల విస్తీర్ణం 2,16,00,760 కిలోమీటర్లు. ఇందులో 30 లక్షల కిలోమీటర్లకుపైగా పొడవైన రోడ్లతో యూఎస్ఏ టాప్‌లో నిలిచింది. 17 లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో చైనా, పది లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో భారత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోని మొత్తం రహదారుల విస్తీర్ణంలో కేవలం ఈ మూడు దేశాల్లోనే 25 శాతానికిపైగా ఉండటం గమనార్హం. ఇక ఆండోరా, జీబ్రాల్టర్, వాలిస్ అండ్ ఫ్యుచురా ఐలాండ్స్, లీచెన్‌స్టీన్, పలౌ, అమెరికన్ సమోవా, ఫ్రెంచ్ సదరన్–అంటార్కిటిక్ ఐలాండ్స్, బెర్ముడా, క్రిస్మస్ ఐలాండ్స్, నార్ఫ్లోక్ ఐలాండ్ తదితర దేశాల్లో రోడ్ల విస్తీర్ణం 30 కిలోమీటర్లలోపే కావడం విశేషం. రోడ్ల విస్తీర్ణంలో మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 27వ (1,83,317 కి.మీ), పాకిస్తాన్ 38వ (1,06,183 కి.మీ), శ్రీలంక 43వ (96,023 కి.మీ) స్థానాల్లో ఉన్నాయి. హైవేలలో చైనా.. స్థానిక రోడ్లలో అర్జెంటీనా.. ♦ భారీ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు వంటి వాటిని పరిశీలిస్తే.. ప్రపంచంలో చైనా (6,83,248 కి.మీ) టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో అమెరికా (3,66,800), మెక్సికో (1,05,822), జపాన్ (94,451), కెనడా (91,173), బ్రెజిల్ (86,772), ఫ్రాన్స్ (74,956), ఇండియా (69,748), అర్జెంటినా (69,188), ఆ్రస్టేలియా (69,138) నిలిచాయి. ♦ మధ్య స్థాయి హైవేల పొడవులో.. ప్రపంచంలో అమెరికా (8,98,873 కి.మీ) టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా (5,12,386 కి.మీ), ఇండియా (4,13,790 కి.మీ), చైనా (3,06,176 కి.మీ), బ్రెజిల్ (2,23,662 కి.మీ), మెక్సికో (1,81,088కి.మీ), ఫ్రాన్స్ (1,14,433కి.మీ) తదితర దేశాలు నిలిచాయి. ♦ జిల్లా, మండల స్థాయి రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే.. అర్జెంటీనా (534,876 కి.మీ) ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో ఇండియా (526,130 కి.మీ), ఆ్రస్టేలియా (426,346 కి.మీ), చైనా (373,831 కి.మీ), ఇండోనేషియా (334,164 కి.మీ), కొలంబియా (309,725 కి.మీ), బ్రెజిల్ (283,933 కి.మీ) తదితర దేశాలు ఉన్నాయి. ♦ పూర్తిగా స్థానిక, గ్రామీణ స్థాయి రోడ్లు అమెరికా (17,89,534 కి.మీ), చైనా (3,46,742 కి.మీ), జర్మనీ (3,01,853 కి.మీ) ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి రోడ్లు ఉంటే ఏమిటి? విజువల్ క్యాపిటలిస్ట్ విశ్లేషణ ప్రకారం.. ఎక్స్‌ప్రెస్ వేలు, భారీ హైవేలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, పట్టణీకరణకు సంకేతాలు. ఎక్కువ ఖర్చు పెట్టగల దేశాలు మాత్రమే వీటిని నిర్మించగలుగుతాయి. ♦ మధ్యస్థాయి హైవేలు అభివృద్ధి చెందుతున్న, పట్టణీకరణ పెరుగుతున్న ప్రాంతాలకు సూచికలు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని నిర్మిస్తున్నాయి. ♦ జిల్లా, మండల, స్థానిక రోడ్లు.. స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తాయి. ♦మొత్తంగా రహదారుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం సుస్థిర అభివృద్ధికి సూచిక అని.. మౌలిక సదుపాయాల వల్ల అభివృద్ధి వేగం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. -
సీఐడీ గుప్పిట్లో 'సీఎంఆర్ఎఫ్' అక్రమాలు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సీఐడీ నిగ్గు తేల్చింది. ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో వాస్తవికత ఎంత? అన్న అంశంపై సీఐడీ చేపట్టిన దర్యాప్తు దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించిన.. దరఖాస్తుదారులకు వైద్య సేవలు అసలు అందాయా..? ఆయా దరఖాస్తుదారులకు అందిన వైద్య సేవలకు తగ్గట్లు వైద్య బిల్లులున్నాయా..? జరిగిన వైద్యానికి మించి అడ్డగోలుగా వైద్య ఖర్చులు చూపి బిల్లులు పెంచేశారా..? వైద్యం జరగకపోయినా నిధులను స్వాహా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారా..? తదితర అంశాలను సీఐడీ ఆరా తీసింది. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న దరఖాస్తులు, ఇతర రికార్డుల్లోని వివరాలతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను విచారణ అధికారులు పోల్చి చూశారు. ఈ క్రమంలో సీఐడీ బృందాలు సంబంధిత ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులతోపాటు దరఖాస్తుదారుల నుంచి కావాల్సిన వివరాలను రాబట్టాయి. ఈ కుంభకోణంలోని మధ్యవర్తులు, సహకరిస్తున్న ఆస్పత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పెండింగ్ బిల్లులపై దర్యాప్తు పూర్తై నేపథ్యంలో..సీఎంఆర్ఎఫ్లో చోటుచేసుకున్న పలు అక్రమాలకు సంబంధించిన రహస్యాలు ప్రస్తుతం సీఐడీ గుప్పిట్లో ఉన్నాయి. ఈ దర్యాప్తులో తేలిన అంశాలపై సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని సీఐడీ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నివేదిక అందాకే ప్రభుత్వం ఆస్పత్రులకు వాస్తవంగా చెల్లించిన బకాయిలను నిర్ధారించుకుని విడుదల చేయనుంది. అక్రమాలకు పాల్పడిన దరఖాస్తుదారులు, అందుకు సహకరించిన ఆస్పత్రులు, సీఎంఆర్ఎఫ్ కార్యాలయ వర్గాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ కేసులు నమోదు చేసే అవకాశముంది. బిల్లుల చెల్లింపులపై తదుపరి దర్యాప్తు... సీఎంఆర్ఎఫ్ చెల్లింపుల్లో అక్రమాలపై కేసీఆర్ నెల కింద ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐడీ విభాగం.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి సీఎంఆర్ఎఫ్ కింద సహాయం కోసం వచ్చిన 9200కుపైగా దరఖాస్తులపై దర్యాప్తు చేపట్టింది. అందులో దాదాపు 95 శాతం దరఖాస్తులకు చెల్లింపులు పూర్తికాగా, ఇంకా 1,251 దరఖాస్తుదారులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఆస్పత్రులకు విడుదల చేయాల్సి ఉంది. దర్యాప్తు ప్రభావంతో బకాయిల చెల్లింపు నిలిచిపోకుండా తొలుత పెండింగ్ బిల్లులపైనే సీఐడీ దర్యాప్తు పూర్తి చేసింది. తదుపరి దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చెల్లింపులు జరిగిన 7,200 దరఖాస్తులపై దృష్టిసారించనున్నారు. సీఐడీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సీఐడీ ఏకంగా ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.