- పెండింగ్‌లో 4 వేల పాత దరఖాస్తులు
- మళ్లీ అర్జీ పెట్టుకోవాలంటూ తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)కి దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు తల్లడిల్లుతున్నారు. రాష్ర్టం విడిపోవడానికి ముందు అర్జీ పెట్టుకున్న వారందరూ తమకు సాయమెప్పుడందుతుందా.. అని ఏడాదిగా సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్ కోసం అర్జీ పెట్టుకున్న వారందరిదీ అదే దీనస్థితి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత పది వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించి సాయం అందించిన సర్కారు... పాత అర్జీల విషయాన్ని మాత్రం పక్కన పెట్టింది. దాదాపు 4 వేల దరఖాస్తులను మూలకు పడేసింది. అసలు వీటికి సాయం అందించాలా.. వద్దా అనే మీమాంసతోనే కాలయాపన చేస్తోంది.
అర్జీదారులు పలుమార్లు సచివాలయంలో సంబంధిత సెక్షన్ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఇదిలాఉండగా, పాత దరఖాస్తులన్నింటినీ వెనక్కి పంపించాలని ప్రభుత్వం ఇటీవలే కొత్త నిర్ణయం తీసుకుంది. అప్పటి అర్జీ దారులందరూ మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని.. తమ శాసనసభ్యుడు సిఫారసు లేఖలతో మళ్లీ అర్జీ పెట్టుకోవాలని వీటిని వెనక్కి పంపించే పని పెట్టుకుంది. దరఖాస్తు చేసుకొని ఏడాది దాటిపోయిందని.. అప్పుడున్న ఎమ్మెల్యేల సిఫారసుతోనే బిల్లులన్నీ జత చేసి సీఎం సాయం కోరుతూ అర్జీ పెట్టుకున్నామని... ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే లేఖలతో దరఖాస్తు చేయమనటంతో దిక్కుతోచడం లేదని బాధ పడుతున్నారు.
ఇప్పటికే ఏడాదికిపైగా సీఎంఆర్‌ఎఫ్ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎంఆర్‌ఎఫ్ నిధుల దుర్వినియోగమైన ఆరోపణలతో చాలా ఫైళ్లు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన అధికారులు పాత వాటి జోలికెళ్లలేదు. రాష్ట్ర విభజన సమయానికి తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన తొమ్మిది వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయిదు వేల ఫైళ్లకు సీఎం ఆమోదం లభించడంతో పాటు చెక్కులు కూడా సిద్ధమయ్యాయి. చెక్కులు సిద్ధమైన మేరకు ఫైళ్లు క్లియర్ చేసిన తెలంగాణ సర్కారు.. అప్పుడు పరిశీలనకు నోచుకోని నాలుగు వేల ఫైళ్లను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడిప్పుడే సెక్షన్ అధికారులు వాటిని దుమ్ము దులిపే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను తిరస్కరించి.. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సెలవివ్వటంతో బాధితులు గొల్లుమంటున్నారు.
సీఎంఆర్‌ఎఫ్ కోసం ఎదురుచూపులు
Published Mon, May 25 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement