
అమరుల కుటుంబాలకు చేయూత
* సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు
* ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
* త్వరలో కుటుంబ సభ్యులకు అందజేత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు ఆర్థికసాయానికి సంబంధించిన ఫైలుపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 459 మంది ఆత్మబలిదానం చేసుకోగా.. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాల్సిందిగా కేసీఆర్ గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) నుంచి ఇచ్చేందుకు నిర్ణయించారు. సోమవారం ప్రభుత్వ ప్రిన్స్‌పల్ కార్యదర్శి బీఆర్ మీనా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి చెక్కులను త్వరలో అమరుల కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.