సాక్షి, అమరావతి/ తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)ని కొల్లగొట్టాలనే పెద్ద కుట్రతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ బాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించారు. ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠా పాత్రధారులతోపాటు దీని వెనుక సూత్రధారులను కూడా పట్టుకోవాలన్నారు. (బెడిసికొట్టిన బడా మోసం)
దీంతో ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి దోషులను పట్టుకోవాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు ఆదివారం లేఖ రాశారు. మరోవైపు.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)లోని సీఎంఆర్‌ఎఫ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం ఉన్నందున దీని నుంచి చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆమె బ్యాంకు మేనేజరుకు లేఖ రాశారు. అలాగే, బ్యాంకు అధికారుల అప్రమత్తతవల్ల నిధులు విడుదల కాలేదని.. కుట్ర చాలా పెద్దదైనందున విచారణ లోతుగా జరిపి దోషులను తేల్చాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు.
మూడు రాష్ట్రాలల్లో వేర్వేరు పేర్లతో..
ఏపీకి చెందిన సీఎంఆర్‌ఎఫ్ నిధులను కొల్లగొట్టేందుకు ఒకేసారి న్యూఢిల్లీ, కోల్‌కత, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్‌ఎఫ్ విభాగాల్లోని వారు ఎవరైనా సహకరించారా? అనేది కూడా తేల్చనున్నారు. అద్వైతా వీకే హాలో బ్లాక్స్ అండ్ ఇంటర్‌లాక్స్, మల్లాబ్‌పూర్ పీపుల్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ, శర్మ ఫోర్జింగ్ పేర్లతో ఈ నకిలీ చెక్కులు జారీ అయ్యాయి.
పక్కా స్కెచ్‌తోనే..
- సీఎంఆర్‌ఎఫ్ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా స్కెచ్‌తోనే యత్నించిందని ఉన్నతాధికారులు అంటున్నారు.
- వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
- దర్యాప్తులో భాగంగా ఏసీబీ బృందాలు మూడుచోట్లకు వెళ్లి విచారణ చేయనున్నాయి.
తుళ్లూరులో కేసు నమోదు
కాగా, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పేరిట భారీగా నగదు విత్‌డ్రా చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సచివాలయం రెవెన్యూ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తుళ్ళూరు–1 సీఐ ధర్మేంద్రబాబు కేసు నమోదు చేశారు. కాగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.16 వేలు, రూ.45 వేలు, రూ.45 వేలు చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీచేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment