CMRF Scam
-
సీఎం సహాయ నిధినీ కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: పేద రోగులను ఆదుకునేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి సైతం టీడీపీ ప్రభుత్వంలో అవినీతి రోగాన్ని అంటించారు. నకిలీ క్లెయిమ్‌లతో దర్జాగా నిధులను కొల్లగొట్టారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత సీఎంఆర్ఎఫ్ ప్రత్యేక అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ తీగ లాగితే.. టీడీపీ హయాంలో సాగిన అవినీతి డొంకంతా కదులుతోంది. ఇప్పటికే రూ.1.80 కోట్ల విలువైన 88 నకిలీ క్లెయిమ్‌లను గుర్తించారు. వాటిలో 35 క్లెయిమ్‌లతో రూ.61.68 లక్షలు కొల్లగొట్టినట్టు నిర్ధారించారు. 2014 నుంచి సీఎంఆర్ఎఫ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అప్పట్లో వెలుగులోకి వచ్చినా.. కప్పెట్టేశారు 2014 నుంచి సీఎంఆర్ఎఫ్ నిధులను ఓ ముఠా పక్కా పథకంతో దారి మళ్లిస్తోందన్న విషయం 2017లో తొలిసారిగా అధికారుల దృష్టికి వచ్చింది. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురానికి చెందిన దేవిరెడ్డి మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి ఈ మేరకు అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. కేశిగాని లక్ష్మయ్య యాదవ్ అనే వ్యక్తి బ్యాంకు రుణం ఇప్పిస్తానని చెప్పి ఆయన బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఆయన సంతకాలతో విత్‌డ్రా ఫారాలు తీసుకువెళ్లాడు. తరువాత అసలు విషయం తెలిసింది. అప్పటికే మల్లికార్జునరెడ్డి బ్యాంకు ఖాతాలో సీఎంఆర్ఎఫ్ నుంచి జయ అయిన రూ.3 లక్షలను లక్ష్మయ్య యాదవ్ విత్‌డ్రా చేసుకున్నాడు. ఆయన ఫిర్యాదు చేయడంతో సింహాద్రిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విషయాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సీఎంఆర్ఎఫ్ అధికారుల దృష్టికి తెచ్చారు. కానీ.. విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చారు. ప్రక్షాళనకు సీఎం జగన్ ఆదేశం సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో పెండింగ్‌లో ఉన్న ఆ కేసు విషయాన్ని అక్కడ ఎస్సై 2020లో సీఎంఆర్ఎఫ్ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని సీఎంఆర్ఎఫ్ ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. పేద రోగులను ఆదుకునేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ఎఫ్లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని... ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దాంతో సీఎంఆర్ఎఫ్ అధికారులు 2014 నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి చెల్లింపుల రికార్డులను తనిఖీ చేపట్టారు. కాగా 2014 నుంచి 2019 వరకు చెల్లించిన బిల్లుల రికార్డులు అప్పటికే గల్లంతయ్యాయని గుర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికే అంతకుముందు ఐదేళ్లపాటు సీఎంఆర్ఎఫ్ నుంచి చెల్లింపుల రికార్డులేవీ అందుబాటులో లేకుండా చేయడం గమనార్హం. దాంతో 2014 నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి చెల్లింపుల లావాదేవీలను సాఫ్ట్వేర్ డేటా ఆధారంగా విశ్లేషించగా భారీగా సాగిన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. 88 క్లెయిములు.. రూ.1.81 కోట్ల బిల్లులు ఫైళ్లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్ డేటా ఆధారంగా సీఎంఆర్ఎఫ్ అధికారులు 88 తప్పుడు క్లెయిమ్‌లను గుర్తించారు. వాటికి రూ. 1,81,78,000 బిల్లులు మంజూరు చేసినట్టు తెలుసుకున్నారు. అప్పటికే వాటిలో 35 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.61.68 లక్షలు చెల్లించేశారు. దాంతో సీఎంఆర్ఎఫ్ అధికారులు స్పందించి బ్యాంకు అధికారులకు చెప్పి మిగిలిన క్లెయిమ్‌లకు సంబంధించి రూ.1.20 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. ఏసీబీ చర్యలు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఎంఆర్ఎఫ్ ప్రస్తుత ప్రత్యేక అధికారి హరికృష్ణ ఈ నెల 21న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు నకిలీ క్లెయిమ్‌ల బిల్లులతో ఇప్పటివరకు రూ.61.68 లక్షల చెల్లింపులలో పాత్రధారులైన నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. వారిలో సీఎంఆర్ఎఫ్ ఆఫీస్ సబార్డినేట్ సీహెచ్.సుబ్రహ్మణ్యం, సెక్రటేరియట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్ సోకా రమేశ్‌తోపాటు ప్రైవేటు వ్యక్తులు చదలవాడ మురళీకృష్ణ, కొండేపూడి జగదీశ్ ధన్‌రాజ్ (నాని) ఉన్నారు. సుబ్రహ్మణ్యం, సోకా రమేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2015 మధ్య ఆఫీసు సబార్డినేట్లుగా అవుట్ సోర్సింగ్ విధానంలో నియమితులయ్యారు. చదలవాడ మురళీకృష్ణ ఆఫీస్ సబార్డినేట్ సుబ్రహ్మణ్యంకు అనుచరుడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండేపూడి జగదీశ్ ధన్‌రాజ్ 2014 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులకు ప్రైవేట్ పీఏగా చెప్పుకుంటున్నారు. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. -
సీఎంఆర్ఎఫ్లో అక్రమాలు: నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: 2014 నుంచి సీఎం రిలీఫ్ ఫండ్‌లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాధమిక దర్యాప్తులో గుర్తించారు. తప్పుడు పేర్లు, పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులను దిగమింగినట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్లో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ చేపట్టింది. నలుగురు నిందితులని ఏసీబీ అరెస్ట్ చేసింది. సీఎంఆర్ఎఫ్లో సబార్డినేట్లగా పని చేస్తున్న చదలవాడ సుబ్రమణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేట్ పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకి చెందిన మురళీకృష్ణలను అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడి, పాస్ వర్డులని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్‌తో నిధులు దిగమింగినట్లు ఏసీబీ గుర్తించింది. 2014 నుంచి ప్రజాప్రతినిధులకి ప్రైవేట్ పీఏగా పనిచేస్తూ ధనరాజు అలియాస్ నాని అక్రమాలకి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకు 88 ఫైళ్లలో అక్రమాలని గుర్తించిన ఏసీబీ రూ. కోటి పైనే అక్రమ లావాదేవీలు బ్యాంకు అకౌంట్ల ద్వారా జరిగినట్లు గుర్తించారు. ఏడెనిమిదేళ్లుగా సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ ప్రాధమిక దర్యాప్తులో నిర్ధారించింది. -
ఒరిజినల్ 45 వేలు.. నకిలీ రూ.39.85 కోట్లు
సాక్షి, అమరావతి: మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) బాధితులకు అందచేసే చెక్కులను ఫోర్జరీ చేసి నకిలీ చెక్కులతో ఘరానా మోసాలకు పాల్పడిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అంచనాలకు మించి మోసం తీవ్రత ఉన్నట్లు ఏసీబీ, సీఐడీ సంయుక్త దర్యాప్తులో గుర్తించారు. మోసగాళ్లు మూడు నకిలీ చెక్కులు రూపొందించారని తొలుత భావించినా విచారణలో అంతకుమించి బయటపడుతున్నాయి. స్టేట్‌బ్యాంక్‌తోపాటు మరికొన్ని బ్యాంకు చెక్కులతో ఈ మోసాలకు తెర తీశారు. సచివాలయంలోని కొందరు అధికారులు సూత్రధారులుగా ఉండటంతో ఇంత పక్కాగా పథకం వేసినట్లు ఏసీబీ, సీఐడీ అధికారులు గుర్తించారు. లబ్ధిదారుల చెక్కులు ఫోర్జరీ చేసి... ►సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం పొందిన లబ్ధిదారుల పేరుతోనే , వారికి జారీ చేసిన అసలు చెక్ నంబర్లతోనే వాటికి నకిలీ చెక్కులు సృష్టించారు. రికార్డుల్లో, లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఒకే మాదిరిగా ఉంటాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాదని ఎత్తుగడ వేశారు. ►లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి జారీ అయిన చెక్కులకు నిందితులు అవే నంబర్లతో నకిలీ చెక్కులు భారీ మొత్తానికి సృష్టించి ఇతర రాష్ట్రాల బ్యాంకుల నుంచి కాజేసేందుకు ప్రయత్నించారు. రెవెన్యూ శాఖ రికార్డుల ఆధారంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి విచారిస్తుండటంతో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ►సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల జాబితాను సేకరించి ఫోర్జరీలు చేసినట్లు తేలడంతో ఇటీవల బ్యాంకులు ఆమోదించిన ఈ చెక్కుల వివరాలను పరిశీలిస్తున్నారు. రూ.కోట్ల మొత్తానికి ఫోర్జరీ చెక్కులు.. ►కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దులపర్వ గ్రామానికి చెందిన పొన్నం హైమావతికి? సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.45 వేలు ఆర్థికసహాయం (చెక్కు నెం. 792896 ) అందింది. కొందరు కేటుగాళ్లు అదే నంబరుతో నకిలీ చెక్కును సృష్టించి ఢిల్లీ నుంచి ఏకంగా రూ.39.85 కోట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నించారు. ►అనారోగ్యానికి గురైన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన పాతూరి రమ్య అనే మహిళకు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.45 వేలు (చెక్కు నంబర్ 792893) ఆరి్థకసాయం అందింది. మోసగాళ్లు అదే నంబర్‌తో నకిలీ చెక్కు సృష్టించి కోల్‌కోతాలోని బ్యాంకు నుంచి ఏకంగా రూ.24.65 కోట్లు కాజేసేందుకు పథకం వేశారు. నిందితుడు ‘నారాయణ’ ఉద్యోగి ప్రొద్దుటూరు క్రైం: సీఎం సహాయనిధి చెక్కులను ఫోర్జరీ చేసి పెద్ద మొత్తంలో నగదు కాజేసిన çఘటనలో నిందితుడు భాస్కర్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. చాపాడు మండలం వెంగన్నగారిపల్లెకు చెందిన నిందితుడు పట్టణంలోని నారాయణ స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఫోర్జరీ చేసి మూడు బ్యాంకుల నుంచి రూ. 9,95,000 కాజేయడం తెలిసిందే. తమిళనాడులోని తన స్నేహితుడు సుబ్బరామిరెడ్డి సాయంతో ఫోర్జరీకి పాల్పడినట్లు నిందితుడు మీడియాకు వెల్లడించాడు. పరారీలో ఉన్న నిందితులు వారాధి విజయ్‌కుమార్, మద్దిగారి శ్రీకాంత్, మహమ్మద్ రెహమాన్ కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ లోసారి సుధాకర్ తెలిపారు. (సచివాలయ అధికారుల పాత్ర) -
CMRF నకిలీ చెక్కుల కేసు విచారణ ప్రారంభించిన ఏపీ సీఐడీ
-
నకిలీ చెక్కులపై సీఎం జగన్ సీరియస్
-
‘నకిలీ చెక్కుల’పై ఏసీబీ విచారణ
సాక్షి, అమరావతి/ తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాలనే పెద్ద కుట్రతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ బాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించారు. ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠా పాత్రధారులతోపాటు దీని వెనుక సూత్రధారులను కూడా పట్టుకోవాలన్నారు. (బెడిసికొట్టిన బడా మోసం) దీంతో ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి దోషులను పట్టుకోవాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఆదివారం లేఖ రాశారు. మరోవైపు.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)లోని సీఎంఆర్ఎఫ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం ఉన్నందున దీని నుంచి చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆమె బ్యాంకు మేనేజరుకు లేఖ రాశారు. అలాగే, బ్యాంకు అధికారుల అప్రమత్తతవల్ల నిధులు విడుదల కాలేదని.. కుట్ర చాలా పెద్దదైనందున విచారణ లోతుగా జరిపి దోషులను తేల్చాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు రాష్ట్రాలల్లో వేర్వేరు పేర్లతో.. ఏపీకి చెందిన సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టేందుకు ఒకేసారి న్యూఢిల్లీ, కోల్‌కత, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్ఎఫ్ విభాగాల్లోని వారు ఎవరైనా సహకరించారా? అనేది కూడా తేల్చనున్నారు. అద్వైతా వీకే హాలో బ్లాక్స్ అండ్ ఇంటర్‌లాక్స్, మల్లాబ్‌పూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, శర్మ ఫోర్జింగ్ పేర్లతో ఈ నకిలీ చెక్కులు జారీ అయ్యాయి. పక్కా స్కెచ్‌తోనే.. సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా స్కెచ్‌తోనే యత్నించిందని ఉన్నతాధికారులు అంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ బృందాలు మూడుచోట్లకు వెళ్లి విచారణ చేయనున్నాయి. తుళ్లూరులో కేసు నమోదు కాగా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరిట భారీగా నగదు విత్‌డ్రా చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సచివాలయం రెవెన్యూ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తుళ్ళూరు–1 సీఐ ధర్మేంద్రబాబు కేసు నమోదు చేశారు. కాగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.16 వేలు, రూ.45 వేలు, రూ.45 వేలు చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీచేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించారు. -
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్
-
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నకిలీ చెక్కుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టే కుట్ర వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కర్ణాటక, ఢిల్లీ, కోల్‌కతాలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధి నుంచి డబ్బులు కొట్టేసేందుకు కుట్రలు పన్నగా.. బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో విషయం వెలుగు చూసింది. కాగా, సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఏసీబీ డైరెక్టర్‌కు లేఖ రాశారు. మరోవైపు ఫాబ్రికేటెడ్ చెక్కులపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. రెవిన్యూ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడ్‌బద్రి శాఖకు రూ.52.65 కోట్ల చెక్కు, ఢిల్లీలోని సీసీపీసీఐకి రూ.39,85,95,540 చెక్కు, కోల్‌కతా సర్కిల్లోని మోగ్రాహత్ శాఖకు రూ.24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఆయా బ్యాంకుల్లో సమర్పించారు. వాటిపై సీఎంఆర్ఎఫ్, రెవెన్యూశాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్ స్టాంపులు కూడా ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా సర్కిళ్లకు చెందిన.. బ్యాంకు అధికారులు వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచికి ఫోన్ చేయడంతో కుంభకోణం బట్టబయలైంది. (చదవండి: బెడిసికొట్టిన బడా మోసం) -
బెడిసికొట్టిన బడా మోసం
-
బెడిసికొట్టిన బడా మోసం
సాక్షి, అమరావతి: నకిలీ బ్యాంకు చెక్కులతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మూడు బ్యాంకుల ద్వారా ఏకంగా రూ.117.15 కోట్లు కొల్లగొట్టాలన్న కొందరి ఘరానా మోసం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో ఆయా బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో భారీ మోసానికి అడ్డుకట్ట పడింది. ఒకేసారి మూడు రాష్ట్రాల నుంచి సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టడానికి పకడ్బందీ పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ముఠాతోపాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అటు ఎస్బీఐ ఉన్నతాధికారులను ఇటు సీఎంఆర్ఎఫ్ అధికారులను విస్మయానికి గురిచేసిన ఈ పన్నాగం వివరాలిలా ఉన్నాయి.. మూడు చెక్‌లు.. రూ.117.15 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచిలో బ్యాంకు ఖాతా ఉంది. సీఎంఆర్ఎఫ్ విభాగం జారీచేసిన రూ.52,65,00,000 విలువైన ఎస్బీఐ చెక్‌ను కర్ణాటకలోని మంగుళూరు బ్రాంచిలో డ్రా చేసేందుకు శుక్రవారం ఓ వ్యక్తి సమర్పించాడు. అంత పెద్ద మొత్తం కావడంతో ఆ చెక్‌ను పాస్ చేస్తున్న మిగతా బ్యాంకు అధికారికి చివరి నిమిషంలో సందేహం వచ్చింది. దాంతో ఆయన వెంటనే వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచ్ అధికారులను.. వారు సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను వాకబు చేశారు. అంత మొత్తంతో తాము ఎవరికీ చెక్ ఇవ్వలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ చెక్‌ను పాస్ చేయొద్దని మంగుళూరులోని బ్రాంచి అధికారులను ఆదేశించారు. దాంతో ఎస్బీఐ అధికారులు తమ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రాంతీయ కార్యాలయాలనూ అప్రమత్తం చేశారు. ఇదే తరహాలో ఢిల్లీలోని ఎస్బీఐ సీసీపీసీ–1 బ్రాంచ్‌లో శనివారం రూ.39,85,95,540 విలువైన సీఎంఆర్ఎఫ్ ఖాతా నుంచి ఎస్బీఐ చెక్‌ను డ్రా చేసేందుకు సమర్పించారు. ఆ బ్యాంకు అధికారులు కూడా ఆ చెక్‌ను నిర్ధారించుకునేందుకు వెలగపూడి ఎస్బీఐ శాఖను వాకబు చేశారు. ఆ చెక్ కూడా తాము జారీచేయలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పారు. దాంతో ఆ చెక్‌ను కూడా పాస్ చేయకుండా బ్యాంకు అధికారులు నిలుపుదల చేశారు. ఇక కోల్‌కతలోని మోగ్రాహట్ ఎస్బీఐ బ్రాంచిలో కూడా రూ.24,65,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్‌ను డ్రా చేసేందుకు శనివారం సమర్పించారు. దానిపై ఆరా తీయగా అది కూడా నకిలీ చెక్ అనే నిర్ధారణ అయ్యింది. దాంతో మూడు వేర్వేరు చెక్‌ల ద్వారా రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వేసిన పన్నాగాన్ని బ్యాంకు అధికారులు సమర్థంగా నిలువరించగలిగారు. ప్రొఫెషనల్ ముఠా పనే? కేవలం రెండ్రోజుల్లో మూడు వేర్వురు రాష్ట్రాల నుంచి మూడు నకిలీ చెక్‌లతో ఏకంగా రూ.117కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు యత్నించడం ఎస్బీఐ, సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను కలవరపరుస్తోంది. ఇంత పకడ్బందీగా పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ప్రొఫెషనల్ ముఠానే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆ చెక్‌లు వారికి ఎలా వచ్చాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా ఉద్యోగులు ఇందుకు సహకరించి ఉంటారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తే ఈ ఘరానా మోసం గుట్టు వీడుతుంది. అందుకే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. -
సీఎంఆర్ఎఫ్లో చీటింగ్
-
సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో మరో ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్: సీఎంఆర్ఎఫ్ మెడికల్ బిల్లుల కుంభకోణం(స్కామ్) లో తాజాగా మరో ఐదుగురిని సీఐడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. సీఎంఆర్ఎఫ్ మెడికల్ బిల్లుల కుంభకోణంలో రూ. 73 లక్షలు మేర అవకతవకలు చోటు చేసుకున్నట్లు సీఐడీ అధికారులు గతంలో నిర్థారించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా సీఎంఆర్ఎఫ్కి వచ్చిన 11,600 దరఖాస్తులను సీఐడీ అధికారులు పరిశీలించారు. 50 ఆసుపత్రుల నుంచి 112 మంది రోగుల పేర్లతో బిల్లులు సృష్టించినట్లు సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. అలాగే నిందితుల్లో 20 మంది బ్రోకర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో గతంలో 10 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.