సాక్షి, అమరావతి: పేద రోగులను ఆదుకునేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)కి సైతం టీడీపీ ప్రభుత్వంలో అవినీతి రోగాన్ని అంటించారు. నకిలీ క్లెయిమ్‌లతో దర్జాగా నిధులను కొల్లగొట్టారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత సీఎంఆర్‌ఎఫ్ ప్రత్యేక అధికారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ తీగ లాగితే.. టీడీపీ హయాంలో సాగిన అవినీతి డొంకంతా కదులుతోంది. ఇప్పటికే రూ.1.80 కోట్ల విలువైన 88 నకిలీ క్లెయిమ్‌లను గుర్తించారు. వాటిలో 35 క్లెయిమ్‌లతో రూ.61.68 లక్షలు కొల్లగొట్టినట్టు నిర్ధారించారు. 2014 నుంచి సీఎంఆర్‌ఎఫ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అప్పట్లో వెలుగులోకి వచ్చినా.. కప్పెట్టేశారు
2014 నుంచి సీఎంఆర్‌ఎఫ్ నిధులను ఓ ముఠా పక్కా పథకంతో దారి మళ్లిస్తోందన్న విషయం 2017లో తొలిసారిగా అధికారుల దృష్టికి వచ్చింది. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురానికి చెందిన దేవిరెడ్డి మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి ఈ మేరకు అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. కేశిగాని లక్ష్మయ్య యాదవ్ అనే వ్యక్తి బ్యాంకు రుణం ఇప్పిస్తానని చెప్పి ఆయన బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఆయన సంతకాలతో విత్‌డ్రా ఫారాలు తీసుకువెళ్లాడు. తరువాత అసలు విషయం తెలిసింది. అప్పటికే మల్లికార్జునరెడ్డి బ్యాంకు ఖాతాలో సీఎంఆర్‌ఎఫ్ నుంచి జయ అయిన రూ.3 లక్షలను లక్ష్మయ్య యాదవ్ విత్‌డ్రా చేసుకున్నాడు. ఆయన ఫిర్యాదు చేయడంతో సింహాద్రిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విషయాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సీఎంఆర్‌ఎఫ్ అధికారుల దృష్టికి తెచ్చారు. కానీ.. విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చారు.
ప్రక్షాళనకు సీఎం జగన్ ఆదేశం
సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న ఆ కేసు విషయాన్ని అక్కడ ఎస్సై 2020లో సీఎంఆర్‌ఎఫ్ అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని సీఎంఆర్‌ఎఫ్ ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. పేద రోగులను ఆదుకునేందుకు ఉద్దేశించిన సీఎంఆర్‌ఎఫ్‌లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని... ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దాంతో సీఎంఆర్‌ఎఫ్ అధికారులు 2014 నుంచి సీఎంఆర్‌ఎఫ్ నుంచి చెల్లింపుల రికార్డులను తనిఖీ చేపట్టారు. కాగా 2014 నుంచి 2019 వరకు చెల్లించిన బిల్లుల రికార్డులు అప్పటికే గల్లంతయ్యాయని గుర్తించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికే అంతకుముందు ఐదేళ్లపాటు సీఎంఆర్‌ఎఫ్ నుంచి చెల్లింపుల రికార్డులేవీ అందుబాటులో లేకుండా చేయడం గమనార్హం. దాంతో 2014 నుంచి సీఎంఆర్‌ఎఫ్ నుంచి చెల్లింపుల లావాదేవీలను సాఫ్ట్‌వేర్ డేటా ఆధారంగా విశ్లేషించగా భారీగా సాగిన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.
88 క్లెయిములు.. రూ.1.81 కోట్ల బిల్లులు
ఫైళ్లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ డేటా ఆధారంగా సీఎంఆర్‌ఎఫ్ అధికారులు 88 తప్పుడు క్లెయిమ్‌లను గుర్తించారు. వాటికి రూ. 1,81,78,000 బిల్లులు మంజూరు చేసినట్టు తెలుసుకున్నారు. అప్పటికే వాటిలో 35 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.61.68 లక్షలు చెల్లించేశారు. దాంతో సీఎంఆర్‌ఎఫ్ అధికారులు స్పందించి బ్యాంకు అధికారులకు చెప్పి మిగిలిన క్లెయిమ్‌లకు సంబంధించి రూ.1.20 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు.
ఏసీబీ చర్యలు..
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఎంఆర్‌ఎఫ్ ప్రస్తుత ప్రత్యేక అధికారి హరికృష్ణ ఈ నెల 21న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు నకిలీ క్లెయిమ్‌ల బిల్లులతో ఇప్పటివరకు రూ.61.68 లక్షల చెల్లింపులలో పాత్రధారులైన నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. వారిలో సీఎంఆర్‌ఎఫ్ ఆఫీస్ సబార్డినేట్ సీహెచ్.సుబ్రహ్మణ్యం, సెక్రటేరియట్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీస్ సబార్డినేట్ సోకా రమేశ్‌తోపాటు ప్రైవేటు వ్యక్తులు చదలవాడ మురళీకృష్ణ, కొండేపూడి జగదీశ్ ధన్‌రాజ్ (నాని) ఉన్నారు. సుబ్రహ్మణ్యం, సోకా రమేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2015 మధ్య ఆఫీసు సబార్డినేట్లుగా అవుట్ సోర్సింగ్ విధానంలో నియమితులయ్యారు. చదలవాడ మురళీకృష్ణ ఆఫీస్ సబార్డినేట్ సుబ్రహ్మణ్యంకు అనుచరుడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండేపూడి జగదీశ్ ధన్‌రాజ్ 2014 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులకు ప్రైవేట్ పీఏగా చెప్పుకుంటున్నారు. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment