నిందితుడు భాస్కర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్) బాధితులకు అందచేసే చెక్కులను ఫోర్జరీ చేసి నకిలీ చెక్కులతో ఘరానా మోసాలకు పాల్పడిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అంచనాలకు మించి మోసం తీవ్రత ఉన్నట్లు ఏసీబీ, సీఐడీ సంయుక్త దర్యాప్తులో గుర్తించారు. మోసగాళ్లు మూడు నకిలీ చెక్కులు రూపొందించారని తొలుత భావించినా విచారణలో అంతకుమించి బయటపడుతున్నాయి. స్టేట్‌బ్యాంక్‌తోపాటు మరికొన్ని బ్యాంకు చెక్కులతో ఈ మోసాలకు తెర తీశారు. సచివాలయంలోని కొందరు అధికారులు సూత్రధారులుగా ఉండటంతో ఇంత పక్కాగా పథకం వేసినట్లు ఏసీబీ, సీఐడీ అధికారులు గుర్తించారు.
లబ్ధిదారుల చెక్కులు ఫోర్జరీ చేసి...
►సీఎంఆర్‌ఎఫ్ నుంచి సాయం పొందిన లబ్ధిదారుల పేరుతోనే , వారికి జారీ చేసిన అసలు చెక్ నంబర్లతోనే వాటికి నకిలీ చెక్కులు సృష్టించారు. రికార్డుల్లో, లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఒకే మాదిరిగా ఉంటాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాదని ఎత్తుగడ వేశారు.
►లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి జారీ అయిన చెక్కులకు నిందితులు అవే నంబర్లతో నకిలీ చెక్కులు భారీ మొత్తానికి సృష్టించి ఇతర రాష్ట్రాల బ్యాంకుల నుంచి కాజేసేందుకు ప్రయత్నించారు. రెవెన్యూ శాఖ రికార్డుల ఆధారంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి విచారిస్తుండటంతో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
►సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారుల జాబితాను సేకరించి ఫోర్జరీలు చేసినట్లు తేలడంతో ఇటీవల బ్యాంకులు ఆమోదించిన ఈ చెక్కుల వివరాలను పరిశీలిస్తున్నారు.
రూ.కోట్ల మొత్తానికి ఫోర్జరీ చెక్కులు..
►కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దులపర్వ గ్రామానికి చెందిన పొన్నం హైమావతికి? సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.45 వేలు ఆర్థికసహాయం (చెక్కు నెం. 792896 ) అందింది. కొందరు కేటుగాళ్లు అదే నంబరుతో నకిలీ చెక్కును సృష్టించి ఢిల్లీ నుంచి ఏకంగా రూ.39.85 కోట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నించారు.
►అనారోగ్యానికి గురైన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన పాతూరి రమ్య అనే మహిళకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.45 వేలు (చెక్కు నంబర్ 792893) ఆరి్థకసాయం అందింది. మోసగాళ్లు అదే నంబర్‌తో నకిలీ చెక్కు సృష్టించి కోల్‌కోతాలోని బ్యాంకు నుంచి ఏకంగా రూ.24.65 కోట్లు కాజేసేందుకు పథకం వేశారు.
నిందితుడు ‘నారాయణ’ ఉద్యోగి
ప్రొద్దుటూరు క్రైం: సీఎం సహాయనిధి చెక్కులను ఫోర్జరీ చేసి పెద్ద మొత్తంలో నగదు కాజేసిన çఘటనలో నిందితుడు భాస్కర్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. చాపాడు మండలం వెంగన్నగారిపల్లెకు చెందిన నిందితుడు పట్టణంలోని నారాయణ స్కూల్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఫోర్జరీ చేసి మూడు బ్యాంకుల నుంచి రూ. 9,95,000 కాజేయడం తెలిసిందే. తమిళనాడులోని తన స్నేహితుడు సుబ్బరామిరెడ్డి సాయంతో ఫోర్జరీకి పాల్పడినట్లు నిందితుడు మీడియాకు వెల్లడించాడు. పరారీలో ఉన్న నిందితులు వారాధి విజయ్‌కుమార్, మద్దిగారి శ్రీకాంత్, మహమ్మద్ రెహమాన్ కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ లోసారి సుధాకర్ తెలిపారు. (సచివాలయ అధికారుల పాత్ర)
Comments
Please login to add a commentAdd a comment