
మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందిస్తున్న వరుణిక
సాక్షి, హైదరాబాద్: చిన్నపిల్లలకు ఏవి సంబరంగా ఉంటాయి? మంచి బొమ్మలు కొనుక్కోవడం, వాటితో ఆడుకోవడం అంటే ఇష్టం. అదే స్నేహితులందరిని పిలిచి బర్త్‌డే పార్టీ జరిపితే మరీ ఇష్టం. అయితే పదేళ్ల వరుణిక మాత్రం వేడుకలా జరిపే తన బర్త్‌డే పార్టీకయ్యే డబ్బును పది మందికి ఉపయోగపడేలా చేద్దామనుకుంది. తన తండ్రి రవీందర్‌రెడ్డి బర్త్‌డే పార్టీకి ఖర్చు చేయాలనుకున్న లక్ష రూపాయలను మంత్రి కేటీఆర్‌కు అందించాలని కోరింది. కేటీఆర్ చేస్తున్న మంచి పనులను మీడియాలో వచ్చే వార్తలను రెగ్యులర్‌గా చూస్తూ తాను కూడా చేతనైన సహాయం చేయాలనుకుంది.
చిన్నవయసులోనే తన కూతురు పెద్ద మనసు అర్థం చేసుకున్న రవీందర్‌రెడ్డి, వరుణికను మనస్ఫూర్తిగా అభినందించారు. బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో వరుణిక, రవీందర్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వరుణిక లక్ష రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్(సీఎంఆర్‌ఎఫ్)కు అందించింది. ఇక నుంచి తన ప్రతీ పుట్టినరోజు నాడు పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తానని కేటీఆర్‌కు చెప్పింది. చిన్న వయసులోనే వరుణిక అలవరుచుకున్న సామాజిక స్పృహను కేటీఆర్ ప్రశంసించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఒక చిన్న మొక్కను తనకు బహుమతిగా అందించారు.
Comments
Please login to add a commentAdd a comment