సాక్షి, అమరావతి: ‘ఫైబర్ గ్రిడ్ల టెండర్లలో టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వాన్నే కాదు కన్సార్టియం ఒప్పందాన్ని ఉల్లంఘించి మా కంపెనీని కూడా మోసం చేసింది’ అని హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కె.జైన్ పేర్కొన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. టెండర్లు దక్కించుకోవడం కోసం తమను కన్సార్టియంలో భాగస్వామిని చేసుకుని అనంతరం మోసం చేశారని ఆయన చెప్పారు. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై సీఐడీ అధికారులు టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు ఆ కంపెనీ కన్సార్టియంలో భాగస్వామి అయిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీతోపాటు అందుకు సహకరించిన అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా.. టెరాసాఫ్ట్ కంపెనీ తమ కంపెనీని ఎలా మోసం చేసిందనేది అనిల్ కె.జైన్ మాటల్లోనే..
టెండర్ల కోసమే కన్సార్టియంలో భాగస్వామ్యం
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైబర్ గ్రిడ్ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం మూడు కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడాలి. వాటిలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు కోసం ఆప్టికల్ ఫైబర్లు సరఫరా చేసే కంపెనీ కూడా ఉండాలి. ఆ రంగంలో టెరాసాఫ్ట్ కు అనుభవం లేదు. కాబట్టి మమ్మల్ని సంప్రదించి కన్సార్టియంలో భాగస్వామిగా చేర్చుకుని, టెరాసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనుల కోసం పిలిచిన రూ.330 కోట్ల టెండర్లలో మా కంపెనీ రూ.134 కోట్ల విలువైన పనులు చేస్తుందని ఒప్పందంలో ఉంది. కానీ.. కేవలం బిడ్ దాఖలు చేయడానికి అర్హత సాధించేందుకే మాకు అవకాశం కల్పించారని ఆ తరువాత మేం గుర్తించాం.
20 శాతం పనులే ఇచ్చారు
టెండర్లు దక్కిన తరువాత మమ్మల్ని పక్కనపెట్టేశారు. కన్సార్టియం ఒప్పందం ప్రకారం మేం రూ.134 కోట్ల విలువైన ఆప్టికల్ కేబుల్స్ వేయాల్సి ఉంది. కానీ మాతో కేవలం రూ.27 కోట్ల విలువైన పనులే చేయించారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రంగంలో మా కంపెనీకి మంచి పేరుంది. మేం నాణ్యమైన పరికరాలు సరఫరా చేస్తాం. కేంద్ర టెలికాం శాఖ ప్రమాణాల మేరకు ఉండే మా పరికరాల ధర కూడా కాస్త ఎక్కువే. టెండర్ల కోసం వేసిన బిడ్‌లో మా కంపెనీ సరఫరా చేసే పరికరాలనే వేస్తామని చెప్పిన టెరాసాఫ్ట్ కంపెనీ ఆ తరువాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. చిన్నచిన్న కంపెనీలు ఉత్పత్తి చేసే నాసిరకం కేబుళ్లు, ఇతర పరికరాలతో పనులు చేశారు. ఆ పరికరాలు చాలా తక్కువ ధరకు మార్కెట్‌లో లభిస్తాయి. అడ్డదారిలో లాభాలు ఆర్జించడానికే టెరాసాఫ్ట్ కంపెనీ ఇలా చేసింది. అందుకే మమ్మల్ని తప్పించింది. టెరాసాఫ్ట్ కంపెనీ సరఫరా చేసిన నాసిరకం పరికరాలతో మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కన్సార్టియం ఒప్పందం ప్రకారం సరఫరా చేస్తామన్న పరికరాలకు మేం బాధ్యత వహిస్తాం. కానీ ఆ పరికరాలు కాకుండా టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీల నుంచి నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి పనులు చేసింది. వాటితో మాకెలాంటి సంబంధం లేదు.
అప్పటి ప్రభుత్వ పెద్దలకు భయపడే మౌనంగా ఉన్నాం
కన్సార్టియం ఒప్పందం మేరకు మా వాటా పని మాకు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా టెరాసాఫ్ట్ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. అందుకోసం మేం పంపిన ఈ–మెయిల్స్ మా వద్ద ఉన్నాయి. కన్సార్టియం ఏర్పాటు చేసిన స్ఫూర్తికి విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీ వ్యవహరించింది. దీనిపై అప్పట్లోనే గట్టిగా నిలదీయాలని భావించాం. కానీ.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలు టెరాసాఫ్ట్ కంపెనీకి ఉన్నాయని మాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఆ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. అందుకే భయపడి ఏమీ చేయలేక మాకు అన్యాయం జరిగినా మౌనంగా ఉండిపోయాం. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై సీఐడీ కేసు పెట్టడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు రావాలి.
Comments
Please login to add a commentAdd a comment