ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం! | No Letter From Chandrababu it is TDP campaign | Sakshi
Sakshi News home page

ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం!

Published Mon, Oct 23 2023 4:02 AM | Last Updated on Mon, Oct 23 2023 12:12 PM

No Letter From Chandrababu it is TDP campaign - Sakshi

సాక్షి, అమరావతి: ‘స్కిల్‌’ స్కామ్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసి, ఏసీబీ కోర్టు రిమాండ్‌పై జైలుకు పంపి నెలన్నర అవుతోంది. ఆయన నుంచి రూ.వందల కోట్ల ఫీజులు తీసుకుంటున్న లాయర్లు మాత్రం చంద్రబాబు తప్పు చేయ­లేదని అప్పటి నుంచి ఇప్పటిదాకా న్యాయ­స్థానాల్లో వాదించలేదు. కేవలం సీఆర్‌పీసీ సెక్షన్‌–17(ఏ) ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును అరెస్టు చేశారంటూ సాంకేతిక అంశాల సాకుతో కేసును కొట్టి వేయాలని మాత్రమే వాదిస్తున్నారు.

ఈ కేసులోనూ తనకు అలవాటైన రీతిలోనే న్యాయ పరీక్షను ఎదుర్కోకుండా సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తూ మరోవైపు న్యాయం ఆలస్యం కావచ్చుగానీ అంతిమంగా గెలుస్తుందంటూ ఆదివారం ఓ బహిరంగ లేఖలో చంద్రబాబు అడ్డగోలుగా దబాయించారు.

అయితే జైలు నుంచి అలాంటి లేఖ ఏదీ తాము జారీ చేయలేదని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్‌.రాహుల్‌ స్పష్టం చేశారు. అంటే.. ఆ లేఖే నకిలీదని తేటతెల్లమవుతోంది. జైలు నుంచి ప్రజలకు తన తండ్రి రాశారని పేరుతో లోకేష్‌ బహిరంగ లేఖను విడుదల చేసి నాటకమాడినట్లు స్పష్టమవుతోంది. ఇక ఆ లేఖలో రాసినవన్ని పచ్చి అబద్ధాలే. అంతా కల్పితాలతో దాని విడుల చేశారు.

శ్రేణుల నుంచి కనీస స్పందన లేకపోవడంతో..
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముసుగులో ప్రభుత్వ ఖజానా నుంచి అడ్డంగా దోచేసి దొరికిపోయిన కేసులో చంద్రబాబును ఏసీబీ కోర్టు రిమాండ్‌పై జైలుకు పంపింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ అధినేతను అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు ఎంతగా దుష్ఫ్రచారం చేస్తున్నా ప్రజల నుంచి సానుభూతి కాదు కదా కనీస స్పందన కూడా లభించడం లేదు.

చివరకు టీడీపీ కార్యకర్తలు కూడా మొహం చాటేయడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు శనివారం ములాఖత్‌లో చంద్రబాబు సూచనల మేరకు పండుగ పూట పచ్చి అసత్యాలు వల్లె వేస్తూ బహిరంగ లేఖను లోకేష్‌ విడుదల చేసి  డ్రామా ఆడినట్లు స్పష్టమవుతోంది. తన సామాజిక వర్గంలో కొందరు మినహా ఎవరూ స్పందించకపోయినా ఉవ్వెతున్న ప్రజా చైతన్యం ఎగిసిపడుతున్నట్లు ఆ లేఖలో చిత్రీకరించడం గమనార్హం. 

అభివృద్ధి ఎక్కడ.. అంతా విధ్వంసమే..:
తాను జైల్లో ఉన్నా అభివృద్ధి రూపంలో ప్రతి చోటా ఉంటానని, సంక్షేమం పేరు వినిపించిన ప్రతి సారీ తానే గుర్తొస్తానని చంద్రబాబు లేఖలో అతిశయోక్తులు వల్లె వేశారు. విభజిత రాష్ట్రంలో చంద్రబాబు దోపిడీ మినహా సంక్షేమం ఎక్కడా కానరాదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకుని విధ్వంసం సృష్టించారని సాక్షాత్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

అమరావతి భూకుంభకోణం నుంచి స్కిల్‌ స్కామ్‌ వరకూ అనేక అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు ఖజానాను కొల్లగొట్టి పేదల నోట్లో మట్టి కొట్టారన్నది యధార్థం. అందుకే రిమాండ్‌పై చంద్రబాబు జైల్లో ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దొరికిపోయిన దొంగ.. దేశ భక్తుడిలా సూక్తులా?
తన రాజకీయ అరంగేట్రం నుంచే చంద్రబాబు అక్రమాలకు తెరతీశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేజిక్కించుకున్నాక అవి పరాకాష్టకు చేరాయి. 1995 నుంచి 2004 వరకూ చంద్రబాబు పాల్పడ్డ అక్రమాలు, ఆయన అక్రమాస్తులపై విచారణ జరిపించాలంటూ ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతితోపాటు ప్రస్తుతం టీడీపీ పంచన చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వరకూ  కోర్టుల్లో 17 కేసులు వేశారు.

ఆ కేసుల్లో విచారణ ఎదుర్కొంటే దొరికిపోతాననే భయంతో స్టేలు తెచ్చుకుని చంద్రబాబు బతుకుతున్నారు. చివరకు స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయారు. అలాంటి వ్యక్తి దేశభక్తుడిలా అంతిమంగా గెలిచేది న్యాయమేనంటూ నమ్మబలకటాన్ని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. 

అనారోగ్య కారణాలతో మరణిస్తే పరామర్శా?
రాష్ట్రంలో అనారోగ్య కారణాలతో మరణించిన వారిని సైతం వదిలిపెట్టకుండా తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందినట్లుగా చంద్రబాబు చిత్రీకరించుకోవటాన్ని సామాజికవేత్తలు తప్పుబడుతున్నారు.

ఆ కుటుంబాలను పరామర్శించేందుకు, అరాచక పాలనను ఎండగట్టడానికి ‘నిజం గెలవాలి’ అంటూ తన భార్య భువనేశ్వరి ప్రజల ముందుకు వస్తోందని చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు. తాను జైల్లో ఉంటున్నా ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఈ డ్రామాకు తెరతీశారన్నది విశదమవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement