
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు నేరస్వభావాన్ని ఆపాదించడానికి వీల్లేదని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ హైకోర్టుకు నివేదించారు. ఉచిత ఇసుక విధానంలో తప్పులు జరిగి ఉంటే కేసు నమోదుకు మూడేళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. ఇన్నేళ్ల తరువాత కేసు ఎందుకు నమోదు చేశారన్న దానికి కారణాలు చెప్పడం లేదన్నారు. ఇసుక విధానం ద్వారా చంద్రబాబుకు లబ్ధిచేకూరినట్లు సీఐడీ ఎలాంటి ఆధారాలను చూపలేదని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
అందువల్ల అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలంటే సెక్షన్ 17(ఏ) కింద గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పిటిషనర్ చంద్రబాబు వయసు, అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను పూర్తిచేయడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఉచిత ఇసుక పథకం పేరుతో కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం కలిగించినందుకు సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ మల్లికార్జునరావు మరోసారి విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment