
సాక్షి, అమరావతి: రాజధానిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను బినామీలకు కట్టబెట్టిన కేసులో విచారణకు హాజరుకాకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు న్యాయవాదులతో విస్తృతంగా మంతనాలు జరిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న ఆయన మంగళవారం సీఐడీ అధికారులు తనకు నోటీసు ఇవ్వకముందే ఆ సమాచారాన్ని తెలుసుకుని దాన్నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై వ్యూహం రచించడం మొదలుపెట్టారు. నోటీసు అందుకున్నాక తనకు సన్నిహితంగా ఉండే న్యాయ నిపుణులు, పలువురు న్యాయ సలహాదారులను తన ఇంటికి పిలిపించుకుని చర్చించారు. ఢిల్లీలోని న్యాయ నిపుణులతోనూ మాట్లాడి ఎలా ముందుకెళ్తే బాగుంటుందని అడిగినట్లు తెలిసింది. సీఐడీ అధికారులు ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని చెప్పిన నేపథ్యంలో ఈలోపే స్టే తెచ్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.
విచారణకు చంద్రబాబు విముఖత
ఇదిలా ఉంటే.. చంద్రబాబు విచారణకు హాజరవుతారని పలువురు టీడీపీ నాయకులు మీడియాకు చెప్పినా అందుకు ఆయన సిద్ధంగా లేనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై విచారణ జరగకుండా, సీఐడీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు స్టే కోసం బుధవారం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టులోనే స్టే వచ్చేలా పిటిషన్ దాఖలు చేయాలని, అందుకు పక్కా ఏర్పాట్లుచేయాలని చంద్రబాబు న్యాయ నిపుణులకు సూచించారు. ఇప్పటికే ఆయన సన్నిహితులు కొందరు ఈ ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఏం చేస్తే స్టే వస్తుంది, సీఐడీ నమోదు చేసిన కేసులో ఉన్న అంశాలు, గతంలో రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన కేసుకు దీనికి ఉన్న సంబంధం గురించి పూర్తి వివరాలతో ఇప్పటికే పిటిషన్‌ను సిద్ధంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా.. ఈ కేసులో తమ అధినేతకు చాలా సులభంగా స్టే వస్తుందని.. దాని గురించి తమకు అసలు ఆందోళనేలేదని పలువురు టీడీపీ ముఖ్య నేతలు మీడియా ప్రతినిధులతో చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment