చంద్రబాబుకు సీఐడీ నోటీసు | CID notice to Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సీఐడీ నోటీసు

Published Wed, Mar 17 2021 3:22 AM | Last Updated on Wed, Mar 17 2021 9:42 AM

CID notice to Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏపీ సీఐడీ అధికారులు మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి నోటీసు జారీచేశారు. గత సర్కారు హయాంలో పక్కా పథకం ప్రకారం సాగిన అసైన్డ్‌ భూముల బదలాయింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు సీఐడీ ప్రాథమికంగా నిగ్గు తేల్చింది. దీంతో ఈ స్కామ్‌లో ప్రమేయమున్న చంద్రబాబుతో పాటు అప్పటి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, స్కామ్‌కు సహకరించిన అధికారులపై కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా కేసు దర్యాప్తు అధికారి సీఐడీ విజయవాడ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 65.. డోర్‌ నెంబర్‌ 8–2–293/82/ఎ/1310లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) సెక్షన్‌ 41ఎ(3), (4) కింద నోటీసు అందజేసింది. ఈనెల 23 ఉ.11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఏ–1గా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే, మాజీమంత్రి నారాయణకు సీఆర్‌పీసీ సెక్షన్‌–41, అప్పటి గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేకు సీఆర్‌పీసీ–160 కింద నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో కేసు నమోదు
ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూముల వ్యవహారంలో గత ప్రభుత్వం పథకం ప్రకారం అక్రమాలకు పాల్పడిందని, ఈ భూ స్కామ్‌పై విచారణ చేయాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 24న ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ సీఐడీ అడిషినల్‌ డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ఆదేశాలతో దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు అసైన్డ్‌ భూ కుంభకోణం నిజమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ స్కామ్‌లో ప్రమేయమున్న చంద్రబాబు, నారాయణ, వారికి సహకరించిన మరికొందరు అధికారులపైన ఈ నెల 12న కేసు (ఎఫ్‌ఐఆర్‌ 5/2021) నమోదు చేశారు. పథకం ప్రకారం కుట్ర చేసినందుకు వీరిపై ఐపీసీ సెక్షన్‌ 120బి రెడ్‌విత్‌ 34, 35, 36, 37.. ఇతరులకు నష్టం కలిగించేలా బాధ్యత కలిగిన ప్రతినిధులు చట్టాన్ని ఉల్లఘించినందుకు సెక్షన్‌–166, పథకం ప్రకారం తప్పుడు పత్రాలు సృష్టించడంపై 167, బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న వారు చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు సెక్షన్‌ 217తోపాటు ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి తక్కువ ధరకు కొనుగోలుచేసి వారిని నష్టపరిచినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి యాక్డ్‌–1989, అసైన్డ్‌ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినందుకు ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ యాక్ట్‌–1977 సెక్షన్‌–7 ప్రకారం కేసులు నమోదు చేశారు. 
చంద్రబాబుకు సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసులు  

దర్యాప్తునకు సహకరించండి.. 
చంద్రబాబుకు జారీచేసిన నోటీసులో సీఐడీ పలు ఆంక్షలను విధించింది. అవి..
► అమరావతి పేరుతో సాగిన అసైన్డ్‌ భూముల స్కామ్‌ కేసులో సీఐడీ విచారణకు, దర్యాప్తు సక్రమంగా సాగేందుకు పూర్తిగా సహకరించాలి. 
► అప్పట్లో జరిగిన వాస్తవాలను విచారణ సమయంలో వెల్లడించాలి. 
► దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేసేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ జోక్యం చేసుకోకూడదు. 
► ఈ కేసులో సాకు‡్ష్యలను బెదిరించడం, ప్రభావితం చేయడం చేయరాదు. 
► సాక్ష్యాలను దెబ్బతీసేందుకు ఎటువంటి తెరవెనుక ప్రయత్నాలకూ పాల్పడకూడదు. 
► ఈ కేసులో సీఐడీ విచారణకు, న్యాయస్థానానికి ఎప్పుడు హాజరుకావాలన్నా సిద్ధంగా ఉండి సహకరించాలి. 
► ఈ కేసు దర్యాప్తు అధికారి విధించే షరతులను విధిగా పాటించాలి. 
► షరతులు ఉల్లంఘిస్తే అరెస్టు చేయడానికి కూడా అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

సీఐడీ ప్రాథమిక నివేదిక సిద్ధం
అమరావతి రాజధాని మాటున జరిగిన భూముల సమీకరణలో సుమారు 500 ఎకరాల అసైన్డ్‌ భూముల బదలాయింపు వ్యవహారం పథకం ప్రకారం జరిగిన కుట్రేనని సీఐడీ ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సిద్ధంచేసింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇక్కడి అసైన్డ్‌ భూములను భూసమీకరణలో చేర్చడానికి జీఓ ఇచ్చారని సీఐడీ ప్రధాన అభియోగం మోపింది. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ పెద్దలు పథకం ప్రకారం ఇచ్చిన లీకులతో అధికార పార్టీ నేతలు కొందరు అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూములను లాగేసుకున్నారు. వీటికి ఎలాంటి ప్లాట్లు రావని చెప్పడంతో దళితులు తమ భూములను కారుచౌకగా అమ్ముకునేలా చేశారు. లొంగని వారిపై బెదిరింపులకు దిగారు. దీంతో వారు దారుణంగా మోసపోయారు. మరోవైపు. ఈ భూముల రిజిస్ట్రేషన్ల కోసం సబ్‌ రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నేతలు విపరీతమై ఒత్తిళ్లు చేసి పనులు చక్కబెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి  ప్రభుత్వ పెద్దలతో జీఓలు జారీచేయించారు. అనంతరం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద వాటి క్రమబద్ధీకరణకు అనుమతించారు. ఈ క్రమంలో కొందరు అధికారుల అభ్యంతరాలను, సూచనలను అప్పట్లో ఏపీ సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు బేఖాతరు చేశారు.   

ఒకే సామాజికవర్గం వారికే లబ్ధి
ఇదిలా ఉంటే... అమరావతిలో అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చి ప్లాట్లు పొందిన వారిలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా లబ్ధి పొందినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్లు స్పష్టమైంది. ఉదా..
► చంద్రబాబు తనయుడు, మాజీమంత్రి లోకేశ్‌ సన్నిహితుడు కొల్లి శివరామ్‌ 47.39 ఎకరాలను ఈ విధంగానే కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. 
► లోకేశ్‌ మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్‌ 42.925 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్‌ను చేజిక్కించుకున్నారు. 
► లోకేశ్‌ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను కారుచౌకగా స్వాధీనం చేసుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement