ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. | Financial situation is not good | Sakshi
Sakshi News home page

ఆర్థిక పరిస్థితి బాగాలేదు..

Published Thu, Apr 26 2018 2:28 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

Financial situation is not good - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  జీ ఎస్సెల్‌ గ్రూప్‌కు చెందిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌గా అగ్రిగోల్డ్‌ ఆస్తులను అభివృద్ధి చేసే ఉద్దేశం కూడా ఏదీ తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు తాము ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నామని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఎలా చేయాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నామని తెలిపింది. డిపాజిటర్లకు ఏం చేయాలో ఓ నిర్ణయం తీసుకుని, వేసవి సెలవులు పూర్తయిన తరువాత ఆ విషయాన్ని కోర్టుకు తెలియచేస్తామంది.

అగ్రిగోల్డ్‌ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్‌ వాదనలు వినిపిస్తూ, సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌తో జాయింట్‌ వెంచర్‌గా అగ్రిగోల్డ్‌ ఆస్తులను అభివృద్ధి చేసే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.

టేకోవర్‌పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, వేసవి సెలవుల అనంతరం చేపట్టే విచారణ నాటికి ఓ స్పష్టత వస్తుందని, అప్పటి వరకు కొంత ఓపిక పట్టాలని అగ్రిగోల్డ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ విజ్ఞప్తి చేశారు. ఏదో జరుగుతుందని డిపాజిట్ల మదిలో ఆశ కల్పించాం. అక్టోబర్‌ నుంచి సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ ఆస్తి, అప్పుల మదింపు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఎంత కాలం ఇలా? ఈ వ్యవహారాన్ని ఐసీయూలో రోగిలా చూడలేం. తప్పుడు సంకేతాలు వెళతాయి’అని ధర్మాసనం తేల్చి చెప్పింది.  అత్యధిక మొత్తాలు కనీసం రూ.100 కోట్లు రాబట్టగలిగే ఆస్తులను గుర్తించి, వేలానికి చర్యలు తీసుకోవాలని సీఐడీని ఆదేశించింది.  విచారణను జూన్‌ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం  ఉత్తర్వులు జారీ చేసింది.

అక్షయగోల్డ్‌ ఆస్తులను వేలం వేయండి... 
అక్షయగోల్డ్‌ ఆస్తుల వేలానికి హైకోర్టు బుధవారం సీఐడీకి అనుమతినిచ్చింది.  సీఐడీ అధికారులు 10 ఆస్తుల వివరాలను కోర్టు ముందుంచారు. కర్నూలు, అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాలోని నాలుగు ఆస్తుల వేలానికి హైకోర్టు అనుమతినిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement