సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుని మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఇచ్చిన 2 రోజుల కస్టడీలో తమ విచారణకు చంద్రబాబు ఏ మాత్రం సహకరించలేదని సీఐడీ వివరించింది.
కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను చదివే పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని తెలిపింది. 2 రోజుల కస్టడీకి మాత్రమే ఇవ్వడంతో ఆ గడువును ఆయన అడ్డంపెట్టుకుని ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారంది. ఆయన నుంచి పలు అంశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, అందువల్ల ఆయనను తమ కస్టడీకి అప్పగించడం అత్యావశ్యకమని తమ పిటిషన్‌లో కోర్టుకు నివేదించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను ఆదేశించింది.
మధ్యాహ్నం వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు
‘చంద్రబాబును 5 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ మొదట ఈ నెల 11న పిటిషన్ దాఖలు చేశాం. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు పలు షరతులతో కేవలం 2 రోజుల కస్టడీకే అప్పగిస్తూ ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు విధించిన షరతులకు లోబడి చంద్రబాబును విచారించాం. విచారణ సందర్భంగా ఆయన నుంచి పలు వివరాలు రాబట్టేందుకు ఈ కేసుకు సంబంధించిన విషయాలతో ప్రశ్నలను సిద్ధం చేశాం.
మా ప్రశ్నల తీరు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశాం. మొదటి రోజు విచారణలో చంద్రబాబు మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేశారు. కోర్టు ఇచ్చిన పోలీసు కస్టడీ ఉత్తర్వులను ప్రశ్నించారు. పోలీసు కస్టడీ ఉత్తర్వుల కాపీని తనకు అందచేస్తే తప్ప, దర్యాప్తు అధికారి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పారు. తనకు ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే పోలీసు కస్టడీకి ఇచ్చారని, న్యాయవాదిని కలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు.
కోర్టు ఇరుపక్షాల వాదనలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే మిమ్మల్ని పోలీసు కస్టడీకి ఇవ్వడం జరిగిందని దర్యాప్తు అధికారి ఆయనకు చెప్పారు. ఒకవేళ పోలీసు కస్టడీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే, న్యాయవాది ద్వారా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కూడా చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టం చేశారు. మిమ్మల్ని విచారించేందుకు కోర్టు మాకు అనుమతినిచ్చిందని, మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయనకు దర్యాప్తు అధికారి తేల్చి చెప్పారు.
కస్టడీ ఉత్తర్వులను తీసుకున్న చంద్రబాబు వాటిని మధ్యాహ్నం 1 గంట వరకు చదివారు. దర్యాప్తు అధికారి గంట పాటు భోజన విరామ సమయం ఇచ్చారు. భోజన విరామం తరువాత వచ్చి కూడా 2 గంటల వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు. 2.20 గంటల సమయంలో మాకు కోర్టు కేవలం రెండు రోజుల కస్టడీ మాత్రమే ఇచ్చిందని చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టంగా చెప్పారు. చదవడం ఆపి, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయనను దర్యాప్తు అధికారి కోరారు. అయితే దీనిని చంద్రబాబు పట్టించుకోలేదు. అలా మరికొద్దిసేపు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు.’ అని సీఐడీ తన పిటిషన్‌లో పేర్కొంది.
15 రోజుల తరువాత విచారణకు ఆస్కారం లేదనే..
‘మేం ఏ సరళిలో ప్రశ్నలు అడగాలనుకున్నామో మమ్మల్ని అలా చంద్రబాబు అడగనివ్వలేదు. అంతేకాక ఆయన చెప్పే విషయాలను రాసుకోవాలని దర్యాప్తు అధికారికి చెప్పారు. తనకు తెలిసిన విషయాలకు సంబంధించి కూడా ఆయన నోరు మెదపలేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. చాలా సందర్భాల్లో దర్యాప్తు అధికారిని మాటలతో వంచించే వైఖరిని అవలంభించారు.
తాను విచారణ సందర్భంగా ఇలానే వ్యవహరించాలని చంద్రబాబు ముందే ఓ నిర్ణయానికి రావడంతో, ఈ కేసులో కీలక నిందితులైన వికాస్ ఖన్వీల్కర్, షెల్ కంపెనీల డైరెక్టర్లు, ఇతర కుట్రదారులైన గంటా సుబ్బారావు (ఏ1), లక్ష్మీనారాయణ (ఏ2)ల వాంగ్మూలాలను ఆయన ముందుంచి వివరాలు రాబట్టే అవకాశం లేకుండా పోయింది. అలాగే కీలక సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా చంద్రబాబు నుంచి తగిన వివరాలు తెలుసుకోలేకపోయాం.
ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ, కావాల్సిన సమాచారాన్ని రాబట్టనివ్వకుండా దర్యాప్తు సంస్థను నిరోధిస్తూ వచ్చారు. విచారణ సందర్భంగా తీసిన వీడియోను పరిశీలిస్తే చంద్రబాబు వేసిన కాలయాపన ఎత్తులు సులభంగా అర్థమవుతాయి. అరెస్ట్ చేసిన నాటి నుంచి 15 రోజుల తరువాత ఎలాంటి జ్యుడీషియల్ ఇంటరాగేషన్ ఉండదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కావాలనే దర్యాప్తు అధికారి కోరిన సమాచారాన్ని ఇవ్వలేదు.’ అని సీఐడీ వివరించింది.
హైకోర్టు ఉత్తర్వుల వల్ల 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోలేకపోయాం...
‘కోట్లాది రూపాయల డబ్బు 2018–20 సంవత్సరాల మధ్య తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు దర్యాప్తులో గుర్తించాం. ఆ బ్యాంకు ఖాతాలకు తానే అథరైజ్డ్ సిగ్నేటరీ అన్న విషయాన్ని చంద్రబాబు కూడా అంగీకరించారు. భారీ స్థాయిలో వచ్చిన నగదు డిపాజిట్ల వివరాలను చంద్రబాబు ముందు ఉంచి, వాటి గురించి ఆయన్ను ప్రశ్నించాల్సి ఉంది.
టీడీపీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలు అందించాలని హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్‌ను కోరాం. ఆ వివరాలు రావాల్సి ఉంది. వచ్చిన తరువాత వాటిని విశ్లేషించి చంద్రబాబును విచారిస్తాం. తనపై మేం నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై ఈ నెల 13న విచారణ జరిపిన హైకోర్టు, 18వ తేదీ వరకు మా పోలీసు కస్టడీ పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఒత్తిడి చేయవద్దని ఉత్తర్వులిచ్చింది. ఈ ఆరు రోజులను మొదటి 15 రోజుల గడువు నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది.
హైకోర్టు ఆదేశాల వల్ల మా కస్టడీ పిటిషన్‌పై ఈ ఏసీబీ కోర్టు విచారణ జరిపే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో తగినంత గడువు లేకపోవడంతో మేం కోరుకున్న విధంగా చంద్రబాబును 5 రోజుల పోలీసు కస్టడీకి తీసుకోలేకపోయాం’ అని సీఐడీ తన పిటిషన్‌లో తెలిపింది.
చంద్రబాబు సహాయ నిరాకరణ వల్ల అది సాధ్యం కాలేదు...
‘ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో లోతైన కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర వెనుక వాస్తవాలను వెలికితీసేందుకు చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార దుర్వినియోగం, ప్రైవేటు వ్యక్తులకు చేకూర్చిన లబ్ధి గురించి ప్రశ్నించాల్సి ఉంది. సాక్షులు చెప్పిన వివరాలను ఆయన ముందుంచి వాటి ఆధారంగా వాస్తవాలను రాబట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థగా మాపై ఉంది.
చంద్రబాబు సహాయ నిరాకరణ వల్ల పలు వివరాలను రాబట్టలేకపోయాం. కీలక ఫైళ్లు గల్లంతయ్యాయి. ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రధాన లబ్ధిదారులుగా అనుమానిస్తున్నాం. గల్లంతైన ఫైళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు చంద్రబాబు కస్టోడియల్ విచారణ అత్యావశ్యకం’ అని సీఐడీ తన పిటిషన్‌లో పేర్కొంది.
ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని దర్యాప్తులో తేలింది...
‘ఈ స్కిల్ కుంభకోణం డబ్బు మొత్తం చివరకు నగదు రూపంలో చేరింది వికాస్ ఖన్వీల్కర్, షెల్ కంపెనీలకు. ఇందుకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని దర్యాప్తులో తేలింది. షెల్ కంపెనీల ద్వారా డబ్బు మొత్తం తిరిగి ఆయనకే చేరింది. సుమన్ బోస్, వికాస్ ఖన్వీల్కర్, లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, సంజయ్ దాగాలు చెప్పిన వివరాల ఆధారంగా చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది.
ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అని మా దర్యాప్తులో తేలింది. నిధుల మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఏమిటన్న విషయాలు చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. కుట్ర పన్నిన తీరు, ఇతర నిందితుల పాత్ర, ఇతర కీలక వివరాలన్నీ చంద్రబాబుకు తెలుసు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబును 5 రోజుల పాటు మా కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని సీఐడీ తన పిటిషన్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment