
ముగిసిన ‘అగ్రిగోల్డ్’ నిందితుల విచారణ
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ల రూపంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన అగ్రిగోల్డ్ సంస్థ నిందితుల విచారణ ముగిసింది. రాష్ట్రంలో నమోదైన కేసుల నిమిత్తం న్యాయస్థానం ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేషనారాయణరావులను నేర విచారణ విభాగం(సీఐడీ) మూడు రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. చివరి రోజైన శుక్రవారం కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రంలో డిపాజిట్ల రూపంలో సేకరించిన డబ్బును ఎక్కడ దాచారని, సంస్థ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయంపై ఆరా తీశారు. కానీ దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితులిద్దరూ మౌనంగా ఉండటం, కొన్నింటికి డొంకతిరుగుడుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రాష్ట్రంలో కొన్ని కీలకమైన ఆస్తులకు సంబంధించి సమాధానం రాబట్టినట్లు సమాచారం.
24 వరకు రిమాండ్: విచారణ అనంతరం సీఐడీ అధికారులు నిందితులను మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. నిందితులను ఏలూరు జైలుకు తరలించారు.