సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో వ్యవహారమంతా గంటా సుబ్బారావే నడిపారు. ఒకేసారి మూడు కీలక స్థానాల్లో ఆయనే ఉన్నారు. షెల్ కంపెనీల ముసుగులో కొల్లగొట్టిన రూ.241 కోట్లు ఏ పెద్దలకు చేరాయో ఆయనకే తెలుసు. ఆ పెద్దలను కాపాడేందుకే ఏకంగా ఆ కాంట్రాక్ట్ నోట్ ఫైళ్లనే మాయం చేశారు’ అని సీఐడీ స్పష్టం చేసింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గంటా సుబ్బారావుకు సంబంధించి కొత్త విషయాలను వెల్లడించింది. ఆయన పాత్రపై న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో సీఐడీ ఏం చెప్పిందంటే..
నిధులు కొల్లగొట్టేందుకే ఆ ప్రాజెక్ట్
ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ముసుగులో కొల్లగొట్టేందుకు లోపభూయిష్టంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ కాంట్రాక్ట్‌ను గంటా సుబ్బారావు రూపొందించారు. రూ.3,556 కోట్లు అని పేర్కొన్న ఆ ప్రాజెక్ట్ వ్యయాన్ని మదింపు చేసేందుకు ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించలేదు. కేవలం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఇచ్చిన ఓ ‘పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) ఆధారంగా ఏకంగా రూ.3,556 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్‌ను కుట్రపూరితంగా ఆమోదించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ఆ రెండు సంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల వాటాను ఎలా నిర్ధారించిందనే విషయాన్ని ఆయన పేర్కొనకుండా దాటవేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం లేకుండానే ఒప్పందం కుదుర్చుకున్నారు.
బ్యాంక్ గ్యారెంటీ లేకుండానే రూ.371 కోట్లు చెల్లింపు
సంబంధిత ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం పన్నులతో సహా చెల్లించాల్సిన రూ.371 కోట్లను గంటా సుబ్బారావు చెల్లించేశారు. కనీసం దానికి ముందు ఆ రెండు సంస్థలు వెచ్చించాల్సిన 90 శాతం నిధులకు సంబంధించి బ్యాంక్ గ్యారెంటీ కూడా ఉద్దేశపూర్వకంగానే తీసుకోలేదు. బ్యాంక్ గ్యారంటీ తీసుకుని ఉంటే ఆ సంస్థలు ప్రాజెక్ట్ పూర్తిచేయకపోతే ఆ మేరకు నిధులను ప్రభుత్వం రికవరీ చేసే అవకాశం ఉండేది. ఆ రెండు కంపెనీల నుంచి లిఖితపూర్వకంగా కూడా ఎలాంటి హామీ తీసుకోకుండా షెల్ కంపెనీలకు ఆయన అడ్డదారిలో ప్రయోజనం కలిగించారు. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందనేది టెక్నాలజీ పార్టనర్స్ నుంచి వివరాలు తెలుసుకోలేదు కూడా.
పరస్పర విరుద్ధ ప్రయోజనాలు
ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు కొల్లగొట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు మరో అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ డిప్యూటీ సీఈవోగా ఐఏఎస్ అధికారి ఉపాధ్యాయుల అపర్ణను నియమించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సీమెన్స్ సంస్థ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ సతీమణి ఆమె. ఆ విషయాన్ని వెల్లడించకుండా ఆమెను డిప్యూటీ సీఈవోగా నియమించడం అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధం. తద్వారా షెల్ కంపెనీలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కల్పించారు.
ఫైళ్లూ మాయం
కేంద్ర జీఎస్టీ అధికారులు ఏపీఎస్‌ఎస్‌డీసీలో కుంభకోణం గురించి 2018లో సమాచారం ఇవ్వగానే సంబంధిత నోట్ ఫైళ్లు మాయమయ్యాయి. ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈవోతోపాటు స్పెషల్ సెక్రటరీగా కూడా ఉన్న గంటా సుబ్బారావే జీవో నంబర్ 4, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కోసం జీవో నంబర్ 5, రెండు కమిటీల ఏర్పాటు కోసం జీవో నంబర్ 8కు సంబంధించి నోట్ ఫైళ్లను రూపొందించారు. దీనిపై ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ఆ జీవోల నోట్ ఫైళ్లు, గంటా సుబ్బారావు రాసిన లేఖలు గల్లంతు కావడం వెనుక ఆయన హస్తం ఉంది. అంతేకాదు షెల్ కంపెనీలు ఇచ్చిన నకిలీ ఇన్‌వాయిస్‌ల ఆధారంగా రూ.371 కోట్లు చెల్లించేశారు. ఆ నిధులు ఎవరికి వెళ్లాయన్నది గంటా సుబ్బారావుకే పూర్తిగా తెలుసు. కాబట్టి ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు దారి మళ్లించిన కేసులో గంటా సుబ్బారావు పాత్ర అత్యంత కీలకం.
Comments
Please login to add a commentAdd a comment