
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో జరిగిన రూ. 241 కోట్ల కుంభకోణంలో బెయిల్ కోసం ప్రధాన నిందితుడైన గంటా సుబ్బారావు, ముందస్తు బెయిల్ కోసం మూడో నిందితుడైన నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీఎస్‌ఎస్‌డీసీ తరఫున ప్రైవేటు కంపెనీలకు చెల్లింపులు చేసిన వ్యక్తిని ఈ కేసులో ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సీఐడీని ప్రశ్నించింది. ఈ విషయంపై తమకు వివరణ, స్పష్టతనివ్వాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ రమేశ్ అడిగిన ప్రశ్ననే రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అడగటాన్ని పలువురు చర్చించుకోవడం విశేషం. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో తనకు కింది కోర్టు రిమాండ్ విధించడంతో బెయిల్ మంజూరు కోరుతూ గంటా సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, సుబ్బారావు విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలి ఇక్కడకు వచ్చారన్నారు.
సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో ఒప్పందం విషయంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్న సీబీఐ, ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయో చెప్పలేదన్నారు. సుబ్బారావును పబ్లిక్ సర్వెంట్‌గా భావించి సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. సుబ్బారావు ప్రభుత్వంలో ఎన్నడూ ఉద్యోగిగా పని చేయలేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోలేదని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆయన పబ్లిక్ సర్వెంట్ నిర్వచన పరిధిలోకి రారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున చెల్లింపులు చేసిన వ్యక్తిని సీఐడీ ఇప్పటి వరకు ప్రశ్నించలేదని, ఆయన ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తి కావడమే అందుకు కారణమన్నారు.
తరువాత నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్ తరఫు సీనియర్ న్యాయవాది ఎన్.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పిటిషనర్ కేవలం కన్సల్టెంట్ మాత్రమేనని తెలిపారు. సీఐడీ తరఫు న్యాయవాది చైతన్య వాదనలు వినిపిస్తూ, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. నిందితుల పాత్ర విషయంలో ప్రభుత్వాధికారులు సాక్ష్యం ఇచ్చారని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ స్పందిస్తూ, ప్రైవేటు కంపెనీలకు చెక్కులు జారీ చేసిన వ్యక్తిని ఎందుకు నిందితునిగా చేర్చలేదని, చెల్లింపులన్నీ ఆయన ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఆయనను కనీసం ప్రశ్నించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment