సాక్షి, అమరావతి: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల కుంభకోణం కేసులో అరెస్టయిన ఆ సంస్థ మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలంది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట లోపు సీఐడీ అధికారుల ముందు హాజరు కావాలని సుబ్బారావును ఆదేశించింది.
ప్రశ్నించాలనుకుంటే ఆయనకు 24 గంటల ముందు నోటీసు ఇవ్వాలని సీఐడీకి సూచించింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ తరఫున సీమెన్స్–డిజైన్ టెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అధికారులను ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించింది. ఆ అధికారులను ఎందుకు నిందితులుగా చేర్చలేదో, వారి పాత్ర గురించి ప్రాథమిక దర్యాప్తు ఎందుకు చేయలేదో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
డిజైన్ టెక్ ఓ షెల్ కంపెనీ..
ఏపీఎస్‌ఎస్‌డీసీలో జరిగిన రూ.241 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన గంటా సుబ్బారావు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ సోమవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది టీఎంకే చైతన్య వాదనలు వినిపిస్తూ.. ఈ కుంభకోణంపై రెండు నెలల పాటు ప్రాథమిక దర్యాప్తు చేశామని చెప్పారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ తరఫున సీమెన్స్–డిజైన్ టెక్‌తో ఒప్పందం, ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేసింది గంటా సుబ్బారావేనని తెలిపారు. డిజైన్ టెక్ ఓ షెల్ కంపెనీ అని, నిధుల మళ్లింపునకు ఈ కంపెనీని వాడుకున్నారని వివరించారు. ఎండీగా సుబ్బారావును తప్పించి ఆయన స్థానంలో ప్రేమచంద్రారెడ్డిని తెచ్చారన్నారు.
ఆయన ద్వారా ఆ కంపెనీలకు చెల్లింపులు చేయించి, ఆ పని పూర్తి కాగానే తిరిగి సుబ్బారావును ఎండీగా నియమించారని తెలిపారు. ఇదంతా ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందన్నారు. ప్రేమచంద్రారెడ్డికి సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చామన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ జోక్యం చేసుకుంటూ.. ఈ మొత్తం ప్రాజెక్టులో పలువురు ఐఏఎస్ అధికారులు కూడా పాలుపంచుకున్నారని, వారందరినీ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
ఇది కుంభకోణం కాదని తాము చెప్పడం లేదన్నారు. ప్రస్తుతానికి మిగిలిన అధికారుల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆధారాలు లభించినప్పుడు వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని చైతన్య చెప్పారు. సుబ్బారావు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఎండీ, చైర్మన్‌గా ప్రతిపాదనలు సిద్ధం చేశారన్న ఆరోపణలు తప్ప సుబ్బారావుపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సుబ్బారావుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment