రాష్ట్రంలో ‘అగ్రిగోల్డ్‌’ కదలిక! | Agrigold case.. AP CID cheaf met TS DGP | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ‘అగ్రిగోల్డ్‌’ కదలిక!

Published Sat, Apr 1 2017 4:14 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

రాష్ట్రంలో ‘అగ్రిగోల్డ్‌’ కదలిక! - Sakshi

రాష్ట్రంలో ‘అగ్రిగోల్డ్‌’ కదలిక!

- ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పోరాటంతో ఇక్కడ కేసులపై సమీక్ష
- డీజీపీ అనురాగ్‌ శర్మతో ఏపీ సీఐడీ చీఫ్‌ భేటీ
- తెలంగాణలోని ఆ సంస్థ ఆస్తుల స్వాధీనానికి కసరత్తు


సాక్షి, హైదరాబాద్‌: లక్షలాది మంది డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్‌ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అగ్రిగోల్డ్‌ ఆస్తులు, వేలం పాటకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పోరాటంతో.. తెలంగాణలోనూ ఆ సంస్థ ఆస్తుల స్వాధీనానికి సీఐడీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం డీజీపీ అనురాగ్‌ శర్మ ఆధ్వర్యంలో కీలక సమీక్ష జరిగింది. ప్రస్తుతం ఏపీలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనం, వేలం పాటపై డీజీపీ అనురాగ్‌ శర్మ వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా తెలంగాణలో అగ్రిగోల్డ్‌ సంస్థపై ఉన్న కేసులు, డిపాజిట్‌ దారులు, స్వాధీనం చేసుకోవాల్సి ఆస్తులు, చెల్లించిన మొత్తాన్ని ఏ విధంగా అందజేయాలన్న అంశాలపై సమీక్షించినట్టు తెలిసింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులకు సంబంధించి శనివారం రెండు రాష్ట్రాల డీజీపీలు, రెండు రాష్ట్రాల సీఐడీ ఉన్నతాధికారులు భేటీ కావాలని నిర్ణయించారు.

రెండు కేసులు.. నాలుగేళ్లుగా పెండింగ్‌
అగ్రిగోల్డ్‌కు సంబంధించి తెలంగాణలో ఇప్పటివరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని సీఐడీ అధికారులు చెప్పారు. నల్లగొండ జిల్లా కనగల్‌ పోలీస్‌స్టేషన్‌లో 2013లో ఒక కేసు నమోదు కాగా, 2015లో సీఐడీ విభాగంలో మరో కేసు నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా.. సీఐడీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2.5 లక్షల మంది డిపాజిట్‌దారులు
రాష్ట్రంలో 2.5 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారని సీఐడీ అధికారులు గుర్తించారు. వీరంతా సుమారు రూ.460 కోట్ల వరకు డిపాజిట్లు చేశారని తేల్చారు. ఈ మేరకు రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ ఆస్తులను గుర్తించాలని.. ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకోకుండా మిగిలిన ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తే డిపాజిట్‌ దారులకు న్యాయం జరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్‌కు సంబంధించి మహబూబ్‌నగర్‌ (పాత) జిల్లాలోని బాల్‌నగర్, గద్వాల, జడ్చర్ల, నల్లగొండ(పాత) జిల్లాలోని చౌటుప్పల్, మిర్యాలగూడ, ఖమ్మం, రంగారెడ్డిలోని గచ్చిబౌలిలలో ఆస్తులున్నాయని సీఐడీకి ఫిర్యాదు చేసిన బాధితులు పేర్కొన్నారు. దీంతో ఆ ఆస్తుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎంత వరకు స్వాధీనం చేసుకోవచ్చనే అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు.

సీఐడీ దర్యాప్తుపై నమ్మకం లేదు
రెండు రాష్ట్రాల్లో సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆలిండియా అగ్రిగోల్డ్‌ కస్టమర్స్, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అండాల్‌ రమేష్‌బాబు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని, డైరెక్టర్లు ఇంకా పరారీలోనే ఉన్నట్టు సీఐడీ చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఆస్తులను కూడా జప్తు చేసి వేలం పాటలో చూపాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. రోజుకో ఏజెంటు, బాధితుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారానే తెలంగాణలో అగ్రిగోల్డ్‌ కేసులను విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement