
విశాఖలోని బ్లూఫ్రాగ్ కార్యాలయంలో విచారణ చేస్తున్న సీఐడీ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్టు విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థపై ఫిర్యాదులు రావడంతో సీఐడీ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. ప్రభుత్వ వెబ్ పోర్టల్‌ను బ్లాక్ చేసి కృత్రిమంగా ఇసుక కొరత సృష్టిస్తున్నట్లు బ్లూ ఫ్రాగ్‌పై గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి. టీడీపీ హయాంలో ఇసుక సరఫరాకు సంబంధించి మన శాండ్ పేరుతో యాప్‌ను బ్లూ ఫ్రాగ్ సంస్థ నిర్వహించేది. ఆ అనుభవంతో ప్రభుత్వం తరఫున ఇసుక సరఫరా విధానాన్ని పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ (రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ)ని బ్లాక్ చేశారని, లబ్ధిదారులు చెల్లించే డబ్బులు కూడా మళ్లింపు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ఇసుకకు సంబంధించిన వెబ్‌సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సాండ్.ఏపీ.జీఓవీ.ఇన్’ సరిగ్గా ఓపెన్ కావడం లేదు. ఓపెన్ అయినప్పుడు.. ర్యాంపుల్లో ఇసుక అందుబాటులో ఉన్నా అందులో మాత్రం నో స్టాక్ అని వస్తోంది. వీటిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ చిట్టిబాబు ఆధ్వర్యంలో సిరిపురంలోని బ్లూ ఫ్రాగ్ కార్యాలయంలో బుధవారం దాదాపు 4 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల నుంచి బ్యాక్ అప్ ఫైల్స్‌ను సేకరించి, హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే మొత్తం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ చిట్టిబాబు బుధవారం రాత్రి మీడియాతో చెప్పారు. ఐటీ కోర్ సిబ్బందితో సైబర్ క్రైమ్ బృందాలు డేటాను నిశితంగా పరిశీలిస్తున్నాయన్నారు.
టీడీపీ హయాంలో డేటా చోరీ ఆరోపణలు
సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారనే ఆరోపణలపై బ్లూ ఫ్రాగ్‌పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ఈ సంస్థకు అప్పటి టీడీపీ ప్రభుత్వమే అధికారిక అనుమతులిచ్చింది. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి సేకరించే సమాచారాన్ని బ్లూ ఫ్రాగ్‌కు ఇవ్వడంతో పాటు ఆ సంస్థ ఇచ్చే సూచనలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జన్మభూమి పథకంలో పొందుపరిచిన 25 అంశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తి సమాచారాన్ని కుటుంబ వికాసం, సమాజ వికాసం పేరిట ఈ సంస్థ సేకరించేది. అక్కడి నుంచి ఈ సమాచారమంతా టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థకు చేరిపోయేది. ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన సమాచార సేకరణ పనిని నిబంధలనకు విరుద్ధంగా బ్లూ ఫ్రాగ్ వంటి కంపెనీకి అప్పగించడంపై ఈ ఏడాది మార్చిలో వైఎస్సార్‌సీపీ నేత తుమ్మల లోకేశ్వరరెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబు సన్నిహితుడిదే బ్లూ ఫ్రాగ్
బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్ ఫణికుమార్‌రాజ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. చంద్రబాబుతో హెలికాప్టర్‌లో కూడా తిరిగేంత సాన్నిహిత్యం అతని ఉండేదని టీడీపీ నేతలే చెప్పుకునే వారు. తెలుగుదేశం పార్టీ యాప్‌లు, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు సంబంధించి ఐటీ సర్వీసులన్నీ ఆయనే చూసేవాడు.
Comments
Please login to add a commentAdd a comment