
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్‌ను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించడంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది.
ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్‌ను గురువారం విచారించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శైలజను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలోనే విచారించనున్నారు. రామోజీరావు, శైలజ స్టేట్‌మెంట్లను విశ్లేషించిన అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని సీఐడీ భావిస్తోంది. వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిపించి మరీ విచారించేందుకు సీఐడీ సంసిద్ధమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment