సాక్షి, విజయవాడ: సీఐడీ విచారణలో చంద్రబాబు హఠాత్తుగా రూటు మార్చారు. విచారణకు ఏమాత్రం సహకరించకుండా మాట దాటవేస్తున్నట్టు తెలిసింది. తాము సేకరించిన ఆధారాలను చంద్రబాబుకు చూపించి ప్రశ్నలడిగిన అధికారులకు సమాధానం చెప్పకుండా కూర్చున్నట్టు సమాచారం.
స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి వివిధ సాక్ష్యాల ఆధారంగా 20 ప్రశ్నలను చంద్రబాబును అడిగారు అధికారులు. తనకు రాజకీయాల్లో 40 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉందని, పోలీసులను ఏం చేయాలో తనకు తెలుసంటూ ఎదురుదాడికి దిగేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్టు తెలిసింది.
మధ్యమధ్యలో మీరెవరు నన్ను అడగడానికి అంటూ ఎదురు తిరిగినట్టు సమాచారం. సీఐడీ రూపొందించిన ప్రశ్నల్లో ఎక్కువ భాగం హవాలా లావాదేవీలతో పాటు ఏ రకంగా ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారనే అంశాలపై ఉన్నాయి.
2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసిన ముఖ్యమైన నోట్‌ఫైల్స్‌ను సిఐడి అధికారులు చూపించినట్టు తెలిసింది. ఇవి చూడగానే చంద్రబాబు ముఖం ఒక్కసారిగా వాడిపోయింది.
నోట్‌ఫైల్‌లో ఏముందంటే..
2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేశారు. సెప్టెంబర్ 8, 2015న ఒక ఫైల్ సీఎంవో నుంచి ఆర్ధికశాఖకు వచ్చింది. ఆ ఫైల్ వచ్చిన వెంటనే చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్థికశాఖ సెక్షన్ ఆఫీసర్‌కు పిలుపొచ్చింది.
సెప్టెంబర్ 5, 2015న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సమావేశం జరిగిందని చీఫ్ సెక్రటరీ తనకు వెల్లడించినట్టు ఆర్థికశాఖ నోట్‌ఫైల్‌లో ఉంది. ఆ సమావేశానికి సంబంధించి మినిట్స్ కూడా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ కంపెనీతో ఆగస్టు 21, 2015న ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించినట్టు చీఫ్ సెక్రటరీ తనకు తెలిపారని ఆర్థికశాఖ కార్యదర్శి అందులో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన నిధులను (రూ.371కోట్లను) తక్షణం విడుదల చేయాలని, ఇది ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ఆదేశమని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నట్టు నోట్‌ఫైల్‌లో ఉంది. వీలైనంత త్వరగా MOU (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) కుదుర్చుకోవాలని సీఎం చెప్పినట్టు ఆర్థికశాఖ వ్యవహారాల్లో పేర్కొన్నారు.
ఆగస్టు 5, 2015న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిన నోట్‌పై అప్పటి చీఫ్ సెక్రటరీ స్వయంగా కొన్ని కామెంట్లు రాశారు. దాంట్లో ఏముందంటే..
"పారా నెంబర్ 27 ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం, చర్చల మేరకు తక్షణం BRO (Budget Release Order - బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేసేందుకు అవసరమైన పత్రాలు)ను విడుదల చేయాలి"
దీంతో పాటు ఆగస్టు 27న రూ.270 కోట్ల నిధులకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను విడుదల చేసే ప్రతిపాదన తయారయింది. ఈ ప్రతిపాదనకు ఆఘమేఘాల మీద ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సీమెన్స్ కంపెనీకి నిధులను వెంటనే విడుదల చేసేలా ఉత్తర్వులు వెలువడ్డాయి.
దీంతో పాటు చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తో జరిగిన వాట్సాప్ చాట్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను చంద్రబాబుకు చూపించగా.. తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం.
ఈ ఆధారాలను ఇవ్వాళ్టి విచారణలో సీఐడీ అధికారులు చంద్రబాబుకు చూపించగానే నీళ్లు నమిలినట్టు తెలిసింది. అందుకే అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శించినట్టు తెలిసింది. ఈ స్కాంలో చంద్రబాబు ప్రమేయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment