చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే! | Nara Bhuvaneswari lying talks About Chandrababu Arrest | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే!

Published Sat, Oct 28 2023 2:00 PM | Last Updated on Sat, Oct 28 2023 3:44 PM

Nara Bhuvaneswari lying talks About Chandrababu Arrest - Sakshi

సాక్షి, గుంటూరు: 371 కోట్ల రూపాయలు లూటీ చేసిన స్కిల్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ స్కాం ఆద్యంతం అబద్ధాలతో ముందుకు తీసుకెళ్లారాయన. సాక్ష్యాలతో దొరికినా సిఐడీ అధికారులకు అబద్ధాలే చెప్పారాయన. న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపితే..ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు  అబద్ధాలపై అబద్ధలు పేర్చుకుపోయారు. బాబు ఆరోగ్యంపైనా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయనకు మాయరోగాలన్నీ అంటించారు. ఇన్ని అబద్ధాలతో కోట కట్టేసి ఇపుడు  నిజం గెలవాలని భువనేశ్వరి చేత యాత్ర చేయిస్తున్నారు. 

నిజం గెలవాలంటున్నారు నారా భువనేశ్వరి. నిజమే నిజమే గెలవాలి. అబద్ధం ఎప్పుడూ గెలవకూడనే కూడదు.  కాకపోతే దురదృష్ట వశాత్తూ  అబద్ధాలతోనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితమంతా నెట్టుకొచ్చేశారని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు నాయుడికి నిజానికి అసలు సంబంధంమే లేదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయ నేతలు. 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమాంతం భోంచేసిన అతి పెద్ద అవినీతి ఘట్టంలో చంద్రబాబు నాయుడి పాత్రకు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయస్థానం భావించింది కాబట్టే  చంద్రబాబు నాయుడు  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది.

నిజానికి స్కిల్‌ వ్యవహారంలో సిమన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్ ను నమ్మించారు. అది అబద్ధం
 మనం 10 శాతం నిధులు పెడితే సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా  ఇస్తుందని మంత్రివర్గాన్ని నమ్మించారు. అది అబద్ధం
 స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే  వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అది అబద్ధం
 సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుణ్ని సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుముందు హాజరు పరిస్తే తనను 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని ఫిర్యాదు చేశారు. అది అబద్ధం
 48 రోజులకు పైగా జైల్లో ఉండి..ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని సాకులు చెబుతున్నారు. అది అబద్ధం
 చంద్రబాబు నాయుణ్ని ములాఖత్ లో కలిసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి నా భర్త జైలుకెళ్లాక అయిదు కిలోల బరువు తగ్గిపోయారని  ఆందోళన వ్యక్తం చేశారు. అది అబద్ధం ఆయన ఒక కిలో బరువు పెరిగారన్నది నిజం.
 జైల్లో   సరఫరా అవుతోన్న  నీళ్లు కలుషితంగా ఉన్నాయని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం
 తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. అది అబద్ధం
 చైనా నుండి డ్రాగన్ దోమలను  దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా  ప్రచారం చేయించారు. అది అబద్ధం
► తన భర్త కు సరియైన భద్రత లేదని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం. అత్యంత పటిష్ఠమైన భద్రతను చంద్రబాబుకు ఏర్పాటు చేశారన్నది నిజం.
► ఇపుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారు . అది అబద్ధం. చంద్రబాబుకు జైలును మించిన సురక్షితమైన చోటు మరోటి లేదని వారు అంటున్నారు.
 అసలు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది అబద్ధం.

371 కోట్ల రూపాయలకు ఎలా రెక్కలు వచ్చాయో.. ఎలా షెల్ కంపెనీలు దాటుకుంటూ హవాలా మార్గంలో చంద్రబాబు నాయుడికి అవి చేరాయో ఈడీ అధికారులు మొత్తం రూట్ ని కనిపెట్టారు. ఆధారాలతో సహా   వెలుగులోకి తెచ్చారు. హవాలా మార్గంలో చంద్రబాబుకు నిధులు సేకరించిన బాబు పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్, లోకేష్  సన్నిహితుడు కిలారు రాజేష్ లతో పాటు షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన  మనోజ్ పార్ధసానికి సిఐడీ నోటీసులు ఇవ్వడంతోనే  వారు  పరారయ్యారు.

కిలారు రాజేష్‌ అయితే నెల రోజులకు పైగా అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత అమాంతం సిఐడీ ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. ఏం అడిగినా తెలీదు గుర్తులేదు అని దాటవేశారు. రెండో రోజు విచారణకు వచ్చేటపుడు కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని రావలసిందిగా సిఐడీ అధికారులు ఆదేశించారు. అంతే  తాను విచారణకు రాలేనని ఆ డాక్యుమెంట్లు తీసుకురాడానికి కొంత సమయం పడుతుందని దసరా తర్వాత తిరిగి విచారణకు హాజరవుతానని చెప్పి  రాజేష్ మాయమయ్యాడు.

పెండ్యాల శ్రీనివాస్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఆయన ఎందుకు పారిపోయాడో మాత్రం  సిఐడీ అధికారులకు తెలుసు. అతగాణ్ని విచారిస్తే  షెల్ కంపెనీల ద్వారా తలరించిన 241 కోట్ల రూపాయల నిధులు ఏయే ఖాతాల్లో జమ చేశారో  తెలుస్తుంది. ఆ భయానికే చంద్రబాబు  నాయుడే శ్రీనివాస్ ను దేశంలో లేకుండా బయటకు పంపేశారని  సిఐడీ అనుమానిస్తోంది. స్కిల్ స్కాం ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడి  అపకీర్తి కిరీటంలో ఎన్నో  అవినీతి రాళ్లు పొదిగి ఉన్నాయి. అమరావతి ల్యాండ్ స్కాం, అసైన్డ్ ల్యాండ్స్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం  వంటివి  క్యూలో నిలబడ్డాయి.

చంద్రబాబును ఎప్పుడు విచారిద్దామా అని దర్యాప్తు సంస్థలు కాచుక్కూర్చున్నాయి. వీటిలోనే కొన్నింటికి పీటీ వారంట్లు జారీ చేసింది అందుకే. న్యాయస్థానాల అనుమతి రాగానే ఒకటొకటిగా  పాపాలు బద్దలు అవుతాయి. అబద్ధాల పుట్టలు పేలిపోతాయి...అని న్యాయ రంగ నిపుణులు అంటున్నారు. అన్ని కేసుల్లోనూ స్కిల్  స్కాం తరహాలోనే అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ పోయి  పెద్ద కోట కట్టేశారు. ఆ కోటకు ఇంతకాలానికి బీటలు వారాయి. ఇక అది కుప్పకూలడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. 

బెయిల్ ఎంతకీ రాకపోయే సరికి చంద్రబాబుకు  ఆ రోగం ఉంది ఈ సమస్య ఉంది అని  రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చివరకు 73 ఏళ్ల వయసున్న  నేతని జైల్లో  పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు నాయుడికన్నా వయసులో  చాలా పెద్ద వారు అయిన నేతలు మాజీ ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఉన్న సంగతిని టిడిపి నేతలు కానీ..భువనేశ్వరి అండ్ కో కానీ తెలివిగా విస్మరిస్తున్నారు. అబద్ధాల  చంద్రబాబును కాపాడుకోడానికి భువనేశ్వరి ఎన్ని ప్రయత్నాలు చేసినా  అంతిమంగా నిజం గెలిచి తీరుతుందని.. అపుడు చంద్రబాబు శాశ్వతంగా జైల్లోనే ఉండక తప్పదని  పాలక పక్ష నేతలు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement