‘అగ్రిగోల్డ్ ప్రత్యేక వెబ్‌సైట్’ సాధ్యమవుతుందా?
వివరాలు తెలపాలని ఇరు రాష్ట్రాల సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఆ వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేతపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం కూడా విచారణ కొనసాగించింది.
ఈ సందర్భంగా ఏపీ సీఐడీ న్యాయవాది కృష్ణప్రకాశ్ స్పందిస్తూ, గతంలో ధర్మాసనం చేసిన ప్రతిపాదనను పరిశీలించామని, అయితే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌కు మాత్రమే పరిమితమైన ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆస్తుల వేలం సాధ్యం కాదని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపకల్పన విషయంలో సాధ్యాసాధ్యాలను టెక్నాలజీ సర్వీసెస్ విభాగాలను సంప్రదించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఉభయ రాష్ట్రాల సీఐడీ అధికారులకు స్పష్టం చేసింది.