పగ్గాలు రాగానే పాగాలు | tdp leaders do khabjas in kakinada | Sakshi
Sakshi News home page

పగ్గాలు రాగానే పాగాలు

Published Tue, Jul 8 2014 1:35 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

పగ్గాలు రాగానే పాగాలు - Sakshi

పగ్గాలు రాగానే పాగాలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ : బడి, గుడి, లెబ్రరీ, మార్కెట్, కమ్యూనిటీహాలు.. కబ్జాకు అనర్హమైన దేదీ లేదంటున్నారు కాకినాడలో టీడీపీ నేతలు. ఇందుకు నిదర్శనంగా కబ్జా బాగోతమొకటి పర్లోపేటలో వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’ పరిశీలనలో తేలిన వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరుడు, మాజీ కౌన్సిలర్ వి.పవన్‌మూర్తి పర్లోపేటలో మార్కెట్‌కు ఆనుకుని 122/98 సర్వే నంబరులోని సుమారు 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ ప్రహారీ కట్టేశారు.

ఆ స్థలం వదిన వి.సీతారత్నంకు చెందిందని గోడ మీద రాయిం చారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలో మారుమూల జాగా అయినా గజం రూ.10 వేల పైమాటే. ఆ ప్రకారం చూసినా పవన్‌మూర్తి ఆక్రమించిన స్థలం విలువ రూ.40లక్షలు. పవన్‌మూర్తి ఆ స్థలానికి ఆనుకుని మత్స్యకారులకు మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన కమ్యూనిటీహాల్ గుమ్మాలకు గోడలు కట్టించి, తన ఆధీనంలో ఉంచుకున్నారు.
 
చిన్నారుల సదుపాయానికి సంకెళ్లు
కబ్జా చేసిన స్థలానికి సమీపంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులంతా కమ్యూనిటీ హాలు లోపలి నుంచి వెళ్లేందుకు  దారి ఉండేది. విద్యార్థులు కమ్యూనిటీహాలు ఖాళీ స్థలంలో సాయంత్రం ఆడుకునే వారు. వారికి అదే కమ్యూనిటీహాలులో మధ్యాహ్నభోజనంవడ్డించేవారు. కమ్యూనిటీ హాలును కబ్జా చేసే క్ర మంలో హాలుకు, స్కూలుకు మధ్య గోడ నిర్మించేశారు. పాఠశాలకు డ్రెయిన్ మీదుగా చిన్నదారి ఏర్పాటు చేశారు. చివరకు పాఠశాల వైపున్న కమ్యూనిటీ హాలు గుమ్మాలకు సగం వరకు సిమెంట్ గోడలు కట్టించి, చిన్నారులను కట్టడి చేశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలలో గాంధీజీ విగ్రహాన్ని కూడా మార్చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
‘దేశం’ గెలిచాకే ఈ దందా..
స్థానిక మత్స్యకారుల కుటుంబాల్లో జరిగే కార్యక్రమాల కోసం వినియోగించే కమ్యూనిటీ హాల్‌ను పవన్‌మూర్తి నిర్వహించే వారు. హాలు తాళాలను తన ఆధీనంలో పెట్టుకుని ఎవరికీ ఇవ్వకపోవడం, గ్రంథాలయం, జిమ్ నిర్మించేందుకు ప్రతిపాదించిన 400 గజాల కార్పొరేషన్ స్థలాన్ని కబ్జాచేసి గోడలు కట్టేయడం ఇవన్నీ  కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి గెలిచాక జరిగినవేనని స్థానికులంటున్నారు. మార్కెట్ స్థలా న్ని కూడా ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాడని ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై గత నెల 16నే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, అధికార పార్టీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కావడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో ఇంతవరకూ చర్యలు తీసుకున్న దాఖలా లేదు. కబ్జాలపై   కార్పొరేషన్ అధికారులకు సమగ్రమైన వివరాలు అందచేసినా కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాకినాడ దుగ్గిరాలవారివీధిలో ఒక ఎయిడెడ్ పాఠశాల పాత భవనాలను కూల్చేసి తెగనమ్మేందుకు ప్రయత్నించిన తెలుగుతమ్ముళ్లు స్థానికుల వ్యతిరేకతతో తోకముడవక తప్పలేదు. ఇప్పుడు పర్లోపేటలో బరితెగించిన ఎమ్మెల్యే అనుచరుడిపై అధికారులు కొరడా ఝుళిపిస్తారో, జో హుకుం అంటారో వేచి చూడాలి.  
 
విచారణకు ఆదేశించాం..
పర్లోపేటలో మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదుపై విచారణ జరపాల్సిందిగా టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించామని కార్పొరేషన్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి చెప్పారు. విచారణ అనంతరం మున్సిపల్ స్థలంగా తేలితే స్వాధీనం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
 
ప్రభుత్వ స్థలాలు, ఆస్తులను పరిరక్షించాలి..
ప్రభుత్వ ఆస్తులపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు, మాజీ కౌన్సిలర్ పవన్‌మూర్తి పెత్తనం చలాయిస్తున్నాడు. అతని కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వాస్తులను అధికారులు పరిరక్షించాలి. మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనుకుంటున్నాడు. 400 గజాల స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ నిర్మించాడు. కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి పెత్తనంసాగిస్తున్నాడు.

 - దిబ్బాడ సత్తిరాజు, శ్రీ వెంకట సత్యసాయి
 మెరైన్ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్  సొసైటి అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement