గజ్వేల్: నగర పంచాయతీ పాలన తీరుపై ‘బాబోయ్ ఇదేం నగర పాలన’ శీర్షికన శనివారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనం సంచలనం సృష్టించింది. ప్రధానంగా ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో దళారుల ప్రమేయం, జాప్యం, పన్నుల పెరుగుదల తదితర అంశాలను వివరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ పేషీ ఆరాతీయడమే కాకుండా.. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఈ క్రమంలోనే ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు శనివారం పట్టణంలోని తన కార్యాలయంలో నగర పంచాయతీకి చెందిన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణ అనుమతి కోసం ఎవరు ధరఖాస్తు చేసుకున్నా వారంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఏదేని కారణంతో అనుమతిని ఇవ్వకపోతే...సంబంధిత నిర్మాణాదారులకు కారణాలను వివరిస్తూ నోటీసు అందజేయాలని సూచించారు. అలాకాకుండా అవకతవకలకు పాల్పడితే ఊరుకునేదిలేదన్నారు.
ఇదిలావుంటే నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నుంచి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాక్స్‌ను వారానికోసారి తెరిచి ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, జాప్యం చేసినా నిర్మాణాదారులు నేరుగా తన దృష్టికి తీసుకువస్తే..బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ముగ్గురు అధికారులపై ఫిర్యాదులు...
నగర పంచాయతీలో కీలకమైన ముగ్గురు అధికారులపై శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి హరీష్‌రావుకు మెజార్టీ కౌన్సిలర్లు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. ఆ ముగ్గురు అవకతవకలకు పాల్పడటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వివరించారని తెలిసింది.
‘నగర పాలన’పై ఆరా
Published Sun, Sep 21 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM
Advertisement