మాడి మసై..
♦ ఎండల ధాటికి ‘వెజిటబుల్ హబ్’ విలవిల
♦ గణనీయంగా పడిపోయిన కూరగాయల ఉత్పత్తులు
♦ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రీయ మార్కెట్లకు తప్పని ఇబ్బందులు
♦ జిల్లాలో రూ.200 కోట్లకుపైగా పంట నష్టం
భానుడి భగభగలకు కూరగాయ తోటలు మాడి మసైపోతున్నాయి. దిగుబడు లు లేక రైతన్న డీలా పడ్డాడు. ఉత్పత్తులు రాక మార్కెట్లు బోసిపోయాయి. ఎండ దెబ్బకు ‘వెజిటబుల్ హబ్’కు జబ్బు చేసింది. గత వేసవిలో నిత్యం 800 క్వింటాళ్ల కాంటా వేస్తే ఇప్పుడు 300 క్వింటాళ్లు కూడా వేయని పరిస్థితి. 60వేల హెక్టార్ల సాగుతో జంటనగరాలకే కాకుండా ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు వంటి మార్కెట్లకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. సూర్యప్రతాపానికి తీవ్రంగా నష్టపోయిన రైతన్న విలవిల్లాడుతున్నాడు.
గజ్వేల్
జిల్లాలో ప్రస్తుతం 60 వేల హెక్టార్లలో కూరగాయలు సాగవుతున్నాయి. ఆరేళ్ల కిందట కేవలం 10 వేల హెక్టార్లకే పరిమితం కాగా ప్రస్తుతం ఐదింతలు పెరిగింది. దీంతో జిల్లా ప్రస్తుతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. గతంలో మార్కెటింగ్ సౌకర్యాలు లేక అతి తక్కువ విస్తీర్ణంలో పండించారు. మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడడంతో సాగు విస్తీర్ణం పెరిగింది.
ప్రధాన సాగు ఇక్కడే...
ప్రధానంగా గజ్వేల్, ములుగు, వర్గల్, జిన్నారం, పటాన్‌చెరు, కొండాపూర్, సదాశివపేట, సిద్దిపేట, చిన్నకోడూరు, జహీరాబాద్, నారాయణఖేడ్, రేగోడ్ మండలాల్లో కూరగాయల సాగు అత్యధికంగా కనిపిస్తున్నది. ఆయా మండలాల్లో టమాటా, వంకాయ, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లిగడ్డ, బీన్స్, ఆలుతోపాటు పందిరి రకాలు బీర, కాకర, సొర, చిక్కుడు వంటి రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి.
ఎగుమతి ఇలా..
జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వందలాది టన్నులు కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, మిర్యాలగూడ, ఖమ్మం, హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర రాష్ట్రీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. నెలకు రూ.200కోట్లకుపైగా టర్నోవర్ జరుగుతున్నట్లు అంచనా. పెరుగుతోన్న జనాభా అవసరాలకు కూరగాయలు అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి.
ప్రధాన సంస్థలు....
గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను ఎంచుకొని ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సార్, ఐటీసీ వంటి భారీ సంస్థలు కూరగాయల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాయి. నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధరను అందిస్తూ రైతుల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను తమ తమ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచీల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నాయి.
ఎండ దెబ్బతో...
మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో కూరగాయల ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. దీంతో ప్రైవేట్ కంపెనీలు కలెక్షన్ సెంటర్లు సైతం వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం కూరగాయల దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో జిల్లావ్యాప్తంగా రైతులకు దాదాపు రూ.200 కోట్లకుపైగా నష్టం వాటిల్లునట్టు ప్రాథమిక అంచనా.
నష్టపోయిన తీరు ఇలా...
ములుగు మండలం మర్కుక్ గ్రామానికి చెంది న కొత్త రామకృష్ణారెడ్డికి ఐదెకరాల భూమి ఉంది. 3 బోరుబావులున్నాయి. భూగర్భజలా లు గణనీయంగా పడిపోవడంతో బోరుబావు ల్లో నీరు సక్రమంగా రావడం లేదు. వేసవిలో ఆరుతడిగా ఎకరా విస్తీర్ణంలో మిర్చి, అర ఎకరంలో బుడమ, అర ఎకరంలో టమాటా, మరో అర ఎకరంలో స్వీట్‌కార్న్ సాగు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పె ట్టాడు. పరిస్థితులు కలిసొస్తే మిర్చి 50 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాలి.
కానీ నీరు అందక కేవలం 15 క్వింటాళ్లే వచ్చింది. బుడమకాయ 10 టన్నుల కు కేవలం 5 క్వింటాళ్లకే పరిమితమైంది. టమాటా 18 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాల్సి రెండు క్వింటాళ్లే వచ్చింది. స్వీట్‌కార్న్ కూడా దెబ్బతింది. నాలుగు పంటలు కలుపుకుని కేవలం ఆ రైతుకు రూ.25 వేలు మాత్రమే చేతికందగా పెట్టుబడి నష్టపోయాడు. ఈ సమస్య ఒక్క రామకృష్ణారెడ్డిదే కాదు... కూరగాయలు పండిస్తున్న ప్రతి రైతుది.
ఉత్పత్తులు పడిపోయిన తీరు...
ములుగు మండలం వంటిమామిడి కూరగాయ ల మార్కెట్ యార్డుకు గజ్వేల్, ములుగు, వర్గ ల్, జగదేవ్‌పూర్, కొండపాక, తూప్రాన్ మండలాలే కాకుండా రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి నిత్యం టన్నుల కొద్దీ కూరగాయలు వస్తుంటాయి. సీజన్‌లో 1,500నుంచి రెండు వేల క్వింటాళ్ల వరకు కాంటా జరుగుతుం ది. అన్‌సీజన్‌లో అయితే (వేసవిలో) 800 క్విం టాళ్ల కాంటా వేస్తారు. గతేడాది ఇదే సమయానికి రోజుకు 600 నుంచి 800 క్వింటాళ్ల కాంటా వేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు.
ఈ సారి 300నుంచి 400 క్వింటాళ్ల కాంటా కూడా కావటం లేదని యార్డు సిబ్బంది తెలిపారు. దీన్నిబట్టి ఉత్పత్తులు ఎలా పడిపోయాయో స్పష్టమవుతోంది. ప్రత్యేకించి జంటనగరాలకే కాకుండా రాష్ట్రీయ మార్కెట్లకూ ఆధారమైన ఈ ప్రాంతంలో ఉత్పత్తులు పడిపోవడం.... ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఇదే అదనుగా పక్క రాష్ట్రాలను నుంచి కూరగాయలు వస్తుండగా... ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి.
దయనీయ పరిస్థితి..
ఎండ తీవ్రత కారణంగా జిల్లాలో కూరగాయల ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. జిల్లాపై ఆధారపడిన రాష్ట్రీయ మార్కెట్లకూ ఇబ్బంది తప్పడంలేదు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తాం. - రామలక్ష్మి, ఉద్యానశాఖ డీడీ