గజ్వేల్, న్యూస్‌లైన్: గణనీయమైన కూరగాయల సాగుతో ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన జిల్లాలో తూపాన్ భారీ నష్టాన్ని కలిగించింది. జిల్లాలో సుమారు 4 వేల హెక్టార్లలో కూరగాయల పంటలు దెబ్బతినగా ఇందులో గజ్వేల్ నియోజకవర్గంలోనే వెయ్యి హెక్టార్లలో పంటలు ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోంది. వర్షం కారణంగా రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. పంటలు భారీగా దెబ్బతినడంతో ఈ ప్రాంతంపై ఆధారపడిన హైదరాబాద్‌తోపాటు రాష్ట్రీయ మార్కెట్లకు భారీగా ఎగుమతులు తగ్గిపోయాయి.
హైదరాబాద్ నగరవాసుల అవసరాలకు జిల్లానే ప్రధాన వనరుగా మారింది. ఇక్కడ ఉత్పత్తులు తగ్గితే నగరంలో జనం అల్లాడే పరిస్థితి నెలకొనడంలో అతిశయోక్తి కాదు. గజ్వేల్, ములుగు, వర్గల్, జిన్నారం, కొండాపూర్, పటాన్‌చెరు, చిన్నకోడూరు, నంగునూరు తదితర మండలాల్లో ప్రతి ఏటా 20 వేల హెక్టార్లలో కూరగాయలు సాగవుతున్నాయి. కాగా ఇక్కడి నుంచి హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతోపాటు చెన్నై, తదితర ప్రధాన కేంద్రాలకు కూరగాయలను తీసుకెళ్తారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి.
ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను ఎంచుకొని ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీలాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాయి. నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధరను అందిస్తూ రైతుల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను తమ తమ కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచీల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం వంటిమామిడిలో తెలంగాణలోనే అతిపెద్దదైన కూరగాయలు, పండ్ల మార్కెట్ యార్డును ప్రారంభించడం కూరగాయల సాగుకు పరిస్థితి మరింత అనుకూలంగా మారింది.
భారీగా నష్టం
ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం ధాటికి చేలల్లోనే టమాటా, బీర, ఆలుగడ్డ, బీన్స్, ఉల్లిగడ్డ, గోబీ తదితర కూరగాయలు తోటల్లోనే కుళ్లిపోయాయి. 4 వేల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా హెక్టారుకు 40 వేలకుపైగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతుండగా ఈ లెక్కన నష్టం రూ. 16 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. ఉద్యానవన శాఖ మాత్రం రూ.3.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ శాఖ జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ శేఖర్ తెలిపారు. రైతులకు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు.
పడిపోయిన ఎగుమతులు
కూరగాయల పంటలు దెబ్బతినడం వల్ల ఇక్కడి నుంచి ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ యార్డులో, ప్రైవేట్ కలెక్షన్ సెంటర్‌లలో సేకరణ గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు. ఎగుమతులు పడిపోయిన కారణంగా ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
‘వెజిటబుల్ హబ్’కు వర్షం దెబ్బ
Published Mon, Oct 28 2013 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement