Earthworms
-
పప్పులో వానపాములు, జెర్రులు
మహబూబాబాద్ అర్బన్: వానపాములు, జెర్రులను గమనించకుండా వండిన పప్పు తిన్న 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 9 మంది పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆరుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమపాఠశాలలో గురువారం జరగగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆశ్రమ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం, పప్పుకూరలో వానపా ము, జెర్రి వచ్చింది. అప్పటికే కొంతమంది విద్యార్థినులు భోజనం తిన్నారు. వారిలో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. వార్డెన్, హెచ్ఎం, ఉపాధ్యాయు లు ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా ఆ విద్యార్థినులను హాస్టల్లోనే ఉంచి రాత్రి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బిస్కెట్లు ఇచ్చారు. శుక్రవారం వారిలో 9 మంది పరిస్థితి విషమించడంతో హుటాహుటిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి ఆరోగ్యం కుదుటపడగా, మరో ఆరుగురు ఐశ్వర్య, అఖిల, కావ్య, భూమిక, భాను, గౌతమిలను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మెనూ ప్రకారం వంట చేయడం లేదని విద్యార్థులు హాస్టల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో ప్రత్యేక క్యాంపు పెట్టి వైద్యసేవలందించారు. పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, జేసీ, డీడీ అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, డీడీ ఎర్రయ్య గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. రాత్రి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి హాస్టల్‌ను తనిఖీ చేశారు. -
కనుమరుగవుతున్నాయి.. కాపాడుకుంటే మేలు
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): భూమిపై జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. మానవ మనుగడకు జీవజాతుల అవసరం కీలకం. చీమ, పేడపురుగు, సీతాకోక చిలుక, నక్క, ఉడుము, కాకి, గబ్బిలం ఇలా ఎన్నో జీవులు ప్రత్యేకంగానో.. పరోక్షంగానో.. మానవ ప్రయోజనకారులు . మారుతన్న జీవన విధానంతో జీవ వైవిధ్యానికి కీడు కలిగిస్తోంది. కొన్ని జాతులు వేట గాళ్ల బారీన పడి కనుమరుగవుతుంటే... మరికొన్ని సహజంగా క్షీణదశకు చేరుకుంటున్నాయి. మితిమీరిన రసాయనాల వాడకం, ఆధునిక సమాచారల వ్యవస్థలతో కొన్ని జీవజాతులు కనుమరుగవుతున్నాయి. అందుకే అంతాకలిసి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మాయమవుతున్న ఉడుములు..! ఉడుములు అన్ని ప్రాంతాల్లోనూ సంచరిస్తుంటాయి. వీటిని శాస్త్రీయంగా వెరానస్ బెంగా లెన్సిస్ అంటారు. ఇవి సుమారు మూడున్నర కిలోల బరువు వరకు ఉంటాయి. భూమిలో బొరియాలు చేసి గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పి వేయడం వీటి ప్రత్యేకత. ఇవి పంటలకు హానీ చేసే కీటకాలను ఆహారంగా తీసుకొని ప్రయోజనకారిగా ఉంటాయి. వీటి మాంసం నడుంనొప్పులను తగ్గిస్తుందనే ఓ నమ్మకం ప్రచారంలో ఉంది. దీంతో వేటగాళ్లు వీటికి ఉచ్చులు వేసి పట్టుకొని విక్రయిస్తుంటారు. తూనిగలు కనుమరుగు... గుండ్రటి తల.. పొడవాటి రెక్కలు.. తోక చిన్నరకం హెలికాప్టర్ ఉండే తూనిగలను చూస్తే అందరికీ ముచ్చటేస్తోంది. చిన్నప్పుడు ప్రతీ ఒక్కరూ వాటితో ఆడుకునే ఉంటారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్న వెంటనే తూనిగలు గుంపులుగుంపులు చేరి గాల్లో ఎగురుతు కనిపిస్తాయి. నిజానికి ఇవి కీటకాలను తినే మాంసాహారులు వీటి జీవితంలో తక్కువ కాలం నీటిలో సయాడ్ అనే లార్వా రూపంలో ఉంటూ దోమగుడ్లను ఆహారంగా తీసుకొని దోమల నివారణకు ఉపయోగపడుతుంటాయి. ఫైడా తూనిగలు దోమలను, పంటలకు నష్టం కలిగించే శుత్రు పురుగులను తిని రైతులకు మేలు చేస్తాయి. రసాయాన ఎరువులు, పురుగు మందులు నీటి కాలుష్యంతో ప్రస్తుతం తూనిగలు కనుమరుగవుతున్నాయి. వాన పాముల.. భూమి పుత్రులు..! వానపాములు భూమిని సారవంతం చేస్తాయి. కొన్ని వేల సంఖ్యలో భూమి పై పొరల్లో ఉండి కంపోస్టును తయారు చేస్తాయి. ఇవి నేలలో బొరియాలు చేయడంతో నీటిని నిల్వ చేసుకునే శక్తి పెరుగుతోంది. వానపాము విషర్జకంలో నత్రజని సహజంగా ఉంటుంది. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం పెరిగి నేలలో వానపాములు చనిపోతున్నాయి. దీంతో నేలకు అవసరమయ్యే జీవద్రవం అందక గట్టిపడి పోతున్నాయి. కూలుతున్న పిచ్చుక గూడు.. ! గూడు కట్టుకోవడం అన్ని పక్షులది ఒక తీరైతే పిచ్చుకల గూడుది మరో ప్రత్యేకత. ఇవి ఇంజనీరింగ్ ప్రతిభ మాదరిగా.. ఈత, తుమ్మ, తాటి చెట్ల కొమ్మలకు చివరన గూల్లు కట్టుకుంటాయి. ఒకటే పొడవు ఉన్న గడ్డి పోచలను ముక్కున కరచి తెచ్చుకుని అత్యంత నైపుణ్యంతో గూళ్లను కట్టి ఆడపక్షిని ఆకర్శిస్తాయి. గూడు లోపల వెచ్చగా ఉండడంతో వాన వచ్చిన తడవక పోవడం దీని ప్రత్యేకత. ఇవి కూడ కీటకాలను అదుపులో ఉంచుతాయి. గుంట నక్క జిత్తులేవి..? ఇప్పటికే మన పరిసరాల్లో తోడేలు కనిపించడం లేదు. ఇక జిత్తులతో అందరిని అబ్బుర పరిచే టక్కులమారి గుంటనక్క ఆపదలో పడిపోయింది. వీటిని శాస్త్రియంగా ఉల్ప్స్ బెంగాలెన్సిస్ అంటారు. ఇవి భూమి లోపల రెండు నుంచి మూడు భూమి లోతులో గుంటలు చేసుకుని జీవిస్తాయి. చిన్న జంతువులు ఎలుకలు, పందికొక్కులు, పీతలు, కీటకాలను ఆహారంగా తీసుకొని వ్యవసాయ రంగానికి సహాకరిస్తాయి. రెల్లు దుబ్బలు వంటి వాటి ఆవాసాలను నాశనం చేయడం, పురుగుల మందుల ప్రభావంతో ఈ జాతి అంతరించి పోతుంది. -
జీవ వైవిధ్యమే ప్రాణం!
‘గత డిసెంబరుతో (హైదరాబాద్ సమీపంలోని నారపల్లిలోని) మా మిద్దెతోట తొమ్మిదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో మార్కెట్లో కూరగాయలు కొనలేదు – పండ్లు కొనలేదు! మిద్దెతోటలోనే ఉత్పత్తి చేశాం! ఎనిమిది సంవత్సరాల మిద్దెతోట ఉత్పత్తిని – రోజుకు కిలో చొప్పున లెక్కించినా – మూడు టన్నుల పైమాటే! ఇదంతా కేవలం 1240 స్క్వేర్ ఫీట్ల టెర్రస్ మీద మాత్రమే పండించాం. ఎనిమిది సంవత్సరాల క్రితం మిద్దెతోట నిర్మాణ వ్యయం ఇరవై వేల రూపాయలు. అయితే, ఈ ప్రత్యక్ష ఫలితాల గురించి కాదు నేను చెప్పాలనుకుంటున్నది.. అది అందరికీ కనిపించే విషయమే! ఈ ఉత్పత్తి వెనుక ఒక సహజసిద్ధమైన ‘జీవ వైవిధ్య ప్రభావం’ ప్రక్రియ ఉన్నదని తెలియ జెప్పాలన్నదే ఈ ప్రయత్నం. అదే లేకుంటే, ఈ ఉత్పత్తి వచ్చేదే కాదు! జీవ వైవిధ్యం వల్లనే ప్రకృతి కొనసాగుతున్నది. మనందరికీ తెలుసు, పరపరాగ సంపర్కం వల్లనే పువ్వులు ఫలిస్తాయని. తేనెటీగలు సీతాకోకచిలుకలు ఇతర రెక్కల పురుగులు అందుకు దోహదపడతాయి. పూలలోని తేనె కోసం తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాలినప్పుడు వాటి కాళ్ల నూగుకు పువ్వుల పుప్పొడి అంటుకుని.. అలా పరపరాగ సంపర్కం అప్రయత్నంగా జరుగుతుంది. అలా పువ్వులు ఫలదీకరణ చెందుతాయి. మనకు లభించే దాదాపుగా అన్ని రకాల ఉత్పత్తులు ఇలానే పండుతాయి. మిద్దెతోటను మనం అభివృద్ధి చేస్తున్నకొద్దీ, రావలసిన జీవజాతులు వచ్చి చేరతాయి. మిద్దెతోటల్లో పండ్ల మొక్కలను కూడా పెంచడం వల్ల పక్షులు కూడా వస్తాయి. చిన్న చిన్న పక్షులు మొక్కల మీద పురుగులను ఏరుకొని తింటాయి! మొక్కలకు హాని చేసే క్రిమికీటకాలను అలా కంట్రోల్ చేస్తాయి. కోయిలలు కూడా పండ్ల కోసం మిద్దెతోటల లోకి వస్తాయి. వాటి పాటలను వినగలగడం వల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అది మన స్వయం కృషి ఫలమైన సహజ సంగీతం! మట్టిలో వానపాములు అభివృద్ధి అవుతాయి. వాటివలన సహజసిద్ధమైన ఎరువు తయారు అవుతుంది. మిద్దెతోటలో సంవత్సరం పొడవునా పువ్వు లుండేలా పూల మొక్కలను పెంచుతాం కనుక రంగురంగుల సీతాకోక చిలుకలు మిద్దె తోటలోకి వస్తాయి, తేనె తాగడానికి! తద్వారా పువ్వుల మధ్య పరపరాగ సంపర్కం జరిగి మనకు సంపూర్ణ ఉత్పత్తి వస్తుంది. గువ్వలు, పిచ్చుకలు వచ్చి మిద్దెతోటలో గూళ్లు కట్టుకుంటాయి. మిద్దెతోటల మొక్కలకు హాని చేసే పురుగూ పుట్రలను అవి తినేస్తూ మొక్కలకు పరోక్షంగా రక్షణ కలిగిస్తాయి. మిద్దెతోటల్లోకి ఎలుకలు కూడా వస్తాయి.. నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకల కోసం పిల్లులు వస్తాయి. ఇలా ఇప్పుడు మా మిద్దెతోటలో మూడు పిల్లులు ఉన్నాయి. ఒక పెంçపుడు శునకం ఉంది. వాటి మధ్య సఖ్యత కూడా కలిగింది! మిద్దెతోటలో నిత్యం పూసే పువ్వుల తేనె కోసం వందలాది తేనెటీగలు ఉదయం పూట వస్తాయి. మిద్దెతోటలో చిన్నచిన్న తేనెపట్టులు పెట్టుకుంటాయి. ప్రతీ చిన్న పువ్వు నుండి అవి తేనెను గ్రహిస్తాయి. కూరగాయ మొక్కల పువ్వుల నుండి కూడా తేనెను గ్రహిస్తాయి. ఆ ప్రక్రియ వల్లనే నిజానికి సమస్త రకాల పువ్వులు ఫలదీకరణం చెందుతున్నాయి. మనం నిత్యం తినే తిండి తయారీలో తేనెటీగల పాత్ర అపురూపమైనది – వెలకట్టలేనిది! మనం ప్రకృతి సమతుల్యతను కాపాడితే, అది మన ఆయురారోగ్యాలను కాపాడుతుంది! మిత్రుడు క్రాంతిరెడ్డి ఓ మాట అన్నాడు, ‘నేను మాత్రమే అనుకుంటే అహం – నేను కూడా అనుకుంటే సుఖం. మనుషులొక్కరే భూగోళం మీద మనలేరు – సమస్త జీవజాతుల మనుగడలో మనుషుల మనుగడ ముడిపడి ఉంది! పట్టణాలలో జీవ వైవిధ్యం పెరగాలంటే, మిద్దెతోటలను మించిన సాధనాలు లేవు! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు, నారపల్లి రఘోత్తమరెడ్డి మిద్దె తోటలో జీవవైవిధ్యానికి ఆనవాళ్లు.. పక్షి గూళ్లు, పక్షులు, పిల్లి, కుక్క.. -
ఇంకా ఆగలేదు!
పులికాట్ సరస్సు గర్భంలో సహజ సిద్ధంగా ఏర్పడిన వానపాములను తవ్వేస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొంతమంది బడాబాబులు తీరప్రాంత గ్రామాల్లో ఉండే కూలీలను ప్రోత్సహించి సరస్సు ఉనికికే ప్రమాదం తెస్తున్నారు. దీంతో సరస్సు గుంటలు మిట్టలుగా మారి సహజత్వాన్ని కోల్పోతోంది. వానపాముల తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా ఉంటున్నారు. నెల్లూరు,సూళ్లూరుపేట: నాలుగైదు సంవత్సరాల నుంచి పులికాట్ సరస్సులో వానపాముల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా తడ మండలం వేనాడు, ఇరకం దీవులకు చుట్టూ గుల్ల, వానపాముల కోసం సరçస్సును తవ్వేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్నవారు వేనాడు దీవిలోని మూల, తదితర ప్రాంతాల్లోని కూలీలను ప్రోత్సహిస్తున్నారు. కేజీ పాములు తీస్తే రూ.900 వరకు ఇస్తుండటంతో ఒక్కో ఇంటి నుంచి ఇద్దరేసి చొప్పున వెళ్లి రెండు కిలోలు పైగా పడుతున్నారు. తవ్విన వానపాములను ప్లాస్టిక్ బకెట్లు, పాలిథిన్ కవర్లు, థర్మాకోల్ బాక్స్‌లు, మట్టి కుండల్లో భద్రపరిచి ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లలో రొయ్యల హేచరీలకు గుట్టుచప్పుడు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకాశం, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల్లోని హేచరీలకు తరలించి విక్రయించే వారికి సుమారుగా రూ.5 వేలు నుంచి రూ.6 వేలు వరకు వస్తోంది. కేసులు నమోదవుతున్నా.. 2015–16 సంవత్సరంలో సుమారు పది కేసులు, 2016–17 సంవత్సరంలో పది కేసులు, 2017–18లో ఐదారు కేసులు నమోదయ్యాయి. రెండురోజుల క్రితం చెన్నై నగరంలోని ఎన్నూరు నుంచి ప్రకాశం జిల్లాకు తరలిస్తున్న వానపాములను తడ పోలీసులు పట్టుకుని పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులకు అప్పగించారు. దీనికి వన్యప్రాణి విభాగంలో ప్రత్యేకమైన చట్టాలు లేకపోవడంతో అధికారులు చేతులెత్తుస్తున్నారు. నిందితులను పట్టుకుని వదిలేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. సూళ్లూరుపేటలో పలు ప్రాంతాల్లో నిల్వ చేసుకుని దర్జాగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇలాగే కొనసాగితే.. ఈ ఏడాది పులికాట్ సరస్సులో మత్స్య సంపద ఉత్పత్తి భారీగా తగ్గిందని, ముఖ్యంగా రొయ్యలు ఉత్పత్తి పూర్తిగా పడిపోయిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పులికాట్ సరస్సు పూర్తిగా ఉనికి కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవవని, విదేశీ వలస విహంగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడులేవీ? సరస్సును అన్ని రకాలుగా నాశనం చేస్తున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా దాడులు చేస్తున్న దాఖలాల్లేవు. వానపాములు అక్రమ రవాణా చేసేవారి నుంచి కిందిస్థాయి సిబ్బందికి ప్రతినెలా మామూళ్లు అందుతున్నాయని చెబుతున్నారు. సరస్సు పరిధిని ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తూ బీట్ ఆఫీసర్లను ఏర్పాటుచేశారు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లడంలేదని విమర్శలున్నాయి. ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప ప్రత్యేకంగా సిబ్బంది నిఘా వేసి అక్రమ రవాణాను అరికట్టిన సందర్భాలు లేవు. సరస్సును పక్షుల భూతల స్వర్గంగా ప్రకటించారు కాబట్టి ఈ ప్రాంతంలో తారు రోడ్లు వేయకూడదు, ఎలాంటి భవనాలు నిర్మించకూడదనే నిబంధన ఉంది. వీటిని గట్టిగానే అమలుచేసే అధికారులు వానపాములు, గుల్ల తవ్వకాలను మాత్రం అడ్డుకోవడంలో శ్రద్ధ తీసుకోవడం లేదు. సమాచారం ఇస్తే పట్టుకుంటాం వానపాములు తరలిస్తున్నారనే సమాచారం ఇస్తే వెంటనే పట్టుకుంటున్నాం. ఇటీవలే వేనాడు రెండు వాహనాలను సీజ్ చేశాం. ఎవరైనా వానపాములు తీస్తూ మత్స్యకారులకు పట్టుబడితే రూ.50 వేలు అపరాధ రుసుం విధిస్తామని చెప్పడంతో తగ్గుముఖం పట్టింది. పూర్తిగా నిరోధించేందుకు మత్స్యకారుల భాగస్వామ్యంతో కృషి చేస్తాం. – వేణు, రేంజర్ -
మట్టే మన ఆహారం!
మన పంట భూముల్లో మట్టి ఎంత సజీవంగా, సారవంతంగా ఉంటుందో మనం తినే ఆహారం కూడా అంత ఆరోగ్యదాయకంగా, సకల పోషకాలతో కూడి ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ సాయిల్ మైక్రో బయాలజిస్ట్, ఎకో సైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ (చెన్నై) అధినేత డా. సుల్తాన్ ఇస్మాయిల్. రసాయనిక వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజసిద్ధంగా పెంపొందించడానికి.. భూమి కోతను, భూతాపం పెరుగుదలను అరికట్టడానికి పంట పొలాల్లోకి స్థానిక జాతుల వానపాములను తిరిగి ఆహ్వానించటం అత్యుత్తమ పరిష్కారమని ఆయన చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిలిపివేసి.. పశువుల పేడ, మూత్రాలను నీటితో కలిపి పొలంలో పారించడం ద్వారా స్థానిక జాతుల వానపాములను తిరిగి సాదరంగా ఆహ్వానించవచ్చని, భూసారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనంలో ఆయన భూసారం పెంచుకునే మార్గాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► భూగోళం విస్తీర్ణంలో 75% నీరు, 25% భూమి ఉంది. ఈ భూమిలో సగం మనుషులకు పనికిరాదు. పనికొచ్చే భూమిలో.. 75% భూమి మాత్రమే సాగుయోగ్యమైనది. అంగుళం పైమట్టి(టాప్ సాయిల్) ఏర్పడటానికి 250 ఏళ్లు పడుతుంది. కాబట్టి, మట్టి వానకు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ► భూమిలో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉంటాయి. భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం 5% సేంద్రియ పదార్థం(ఆర్గానిక్ కార్బన్) ఉండాలి (ఇందులో 80% జీవనద్రవ్యం, 10% వేర్లు, 10% సూక్ష్మజీవరాశి ఉండాలి). కానీ, మన దేశ పంట భూముల్లో సేంద్రియ పదార్థం 0.4% మాత్రమే ఉంది. ► మట్టిలో ఏయే పోషకం ఎంత మోతాదులో ఉన్నదో(సాయిల్ ఫెర్టిలిటీని) చూడటం రసాయనిక ఎరువులు వాడే రైతులకు అవసరం.. అయితే, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేలతల్లి సమగ్ర ఆరోగ్యాన్ని(సాయిల్ హెల్త్‌ని) కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి. ► నేలపైన పడిన ఎండిన గడ్డీ గాదాన్ని, రాలిన కొమ్మా రెమ్మలను సూక్ష్మజీవులు, చెద పురుగుల సాయంతో కుళ్లింపజేయటం.. విత్తనాలను మాత్రం కుళ్లబెట్టకుండా మొలకెత్తించటం నేలతల్లి విజ్ఞతకు, విచక్షణకు నిదర్శనం. ► వర్మీకంపోస్టు తయారు చేసే టబ్/కంటెయినర్‌కు పైన చిన్న బక్కెట్ వేలాడగట్టి చుక్కలు,చుక్కలుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తే.. ఆ టబ్/కంటెయినర్ కిందికి వచ్చే పోషక ద్రవమే వర్మీవాష్. దీన్ని పంటలపై చల్లితే మంచి దిగుబడులు వస్తాయి. ► పెద్ద చెట్టు దగ్గర కర్బన నిల్వలు మెండుగా ఉంటాయి. దగ్గర్లో ఉండే మొక్కలు, చిన్న చెట్ల వేరు వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థలోని మైసీలియా వంటి శిలీంధ్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది. చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు.. పెద్ద చెట్లు కర్బనాన్ని భూమి లోపలి నుంచే శిలీంద్రాల ద్వారా చిన్న చెట్లకు అందిస్తాయి. రాలిన చెట్ల ఆకుల్లో సకల పోషకాలుంటాయి. వీటిని తిరిగి భూమిలో కలిసేలా చేయాలి. తగులబెట్టకూడదు. ఎండిన ఆకుల్లో కర్బనం ఉంటుంది, ఆకుపచ్చని ఆకుల్లో నత్రజని ఉంటుంది. ► మన దేశంలో 500 జాతుల వానపాములు ఉన్నా.. వీటిలో ముఖ్యమైనవి మూడే స్థానిక జాతులు: భూమి పైనే ఉండేవి, భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొరియలు చేసుకుంటూ పైకీ కిందకు తిరిగేవి, భూమి అడుగున ఉండేవి. స్థానిక జాతుల వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి పంటలకు వాడొచ్చు. కర్బనంతో కూడిన మట్టిని, పేడను తిని.. దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజనిని జోడించి.. పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి. ► నేలపైన ఆవు పేడ కల్లు వేసిన తర్వాత ఆ పేడ చెక్కుచెదరకుండా పిడక మాదిరిగా ఎండిపోతే దాని కింద ఉన్న భూమి నిర్జీవమైపోయిందని గ్రహించాలి. అలా కాకుండా.. పేడ కల్లు చివికినట్లు అయిపోయి, దాని అడుగున బొరియలు ఉంటే.. ఆ భూమి సారవంతంగా ఉన్నదని అర్థం. ► దేశీ జాతుల ఆవులు, ఇతర పశువుల కొట్టం(షెడ్)ను నీటితో కడిగి శుభ్రం చేసినప్పుడు పేడ, మూత్రం కలిసిన నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని వృథాగా పోనీయకుండా.. ఒక గుంతలోకి పట్టి ఉంచుకోవాలి. ఈ నీటిని 10%, బోరు నీరు 90% కలిపి పొలానికి పారించాలి. మట్టిలో సూక్ష్మజీవరాశి, వానపాముల సంతతి పెరిగి భూమి సారవంతమవుతుంది. ► రాత్రి వేళల్లో వానపాములు భూమికి బొరియలు చేస్తాయి. ఈ బొరియల ద్వారా వాన నీరు, ప్రాణవాయువు వేర్లకు, భూమిలోపలి జీవరాశికి అందుతాయి. ► బరువైన యంత్రాలు పొలంలో తిరిగితే భూమి చట్టుబడిపోతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములు, ఇతర చిరుజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ► వానపాములు మన పంట భూముల్లో మళ్లీ తారాడేలా చేయటం(రీవార్మింగ్) ద్వారా భూమి ఆరోగ్యాన్ని.. తద్వారా సేంద్రియ ఆహారం ద్వారా మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పనిలో పనిగా భూతాపాన్ని(గ్లోబల్ వార్మింగ్‌ను) నిలువరించవచ్చు! www.erfindia.org. సేకరణ: పంతంగి రాంబాబు సాగుబడి డెస్క్ -
వాటి ధరలు మారిస్తే..లక్షల ప్రాణాలు మిగులుతాయి..
ఆరోగ్యంగా ఉండాలంటే... కాయగూరలు, పండ్లు బాగా తినాలని డాక్టర్లు చెబుతారు. పేదలకు ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో కనీసం ఏడు రకాల ఆహార పదార్థాల ధరలు తగ్గించగలిగితే.. గుండెపోటు, మధుమేహం, గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని అంటున్నారు టఫ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనం ప్రకారం... గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లు, నట్స్, విత్తనాల వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు.. ప్రాసెస్ చేసిన మాంస ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్ వంటి అనారోగ్య కారక పదార్థాల ధరల్లో పదిశాతం హెచ్చు తగ్గులు చేస్తే ఒక్క అమెరికాలోనే గుండె సంబంధిత జబ్బులతో వచ్చే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. ధరల్లో మార్పులు 30 శాతం వరకూ ఉంటే, అంటే.. అనారోగ్య కారక ఆహార పదార్థాలపై ఎక్కువ పన్నులు వేసి ధరలు పెంచితే.. ఈ సంఖ్య మరింత తగ్గుతుందని టఫ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. కాయగూరలు, పండ్లు వంటి హెల్దీఫుడ్ తీసుకో(లే)కపోవడానికి ఉన్న కారణాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. యాంటీబయాటిక్స్తోనే క్యాన్సర్‌కు చికిత్స? చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికారని సామెత. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి చికిత్స విషయంలోనూ ఇలాగే జరిగిందని అనిపిస్తుంది ఈ విషయం తెలిస్తే... మన నోటిలో ఉండే ఓ బ్యాక్టీరియాకు క్యాన్సర్ కణాలను చంపేసే సామర్థ్యం ఉన్నట్లు బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫూసో బ్యాక్టీరియాను యాంటీబయాటిక్ మందులతో నియంత్రించినప్పుడు క్యాన్సర్ కణుతులు చాలా నెమ్మదిగా పెరగడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనల ద్వారా క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స అందించే వీలు ఏర్పడుతుందని భావిస్తున్నారు. క్యాన్సర్ కణాల్లో బ్యాక్టీరియా ఉండటం కొత్త కాకపోయినప్పటికీ నోటిలో ఉండే ఫూసో బ్యాక్టీరియా పేగు, కాలేయాలకూ విస్తరించడం మాత్రం శాస్త్రవేత్తల్లో కుతూహలాన్ని పెంచింది. ఆరేళ్ల క్రితం తొలిసారి పేగు క్యాన్సర్ కణుతుల్లో వీటిని గుర్తించారు. తాజాగా దాదాపు సగం మంది రోగుల్లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు స్పష్టమైంది. ఈనేపథ్యంలో ఎలుకలపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రించేందుకు వినియోగించే రెండు రకాల మందులను ఉపయోగించి చూసినప్పుడు... మెట్రోనిడాజోల్ అందించిన ఎలుకల్లో క్యాన్సర్ కణుతులు చాలా నెమ్మదిగా పెరిగితే... ఎరిత్రోమైసిన్ అందించిన ఎలుకల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీన్ని బట్టి యాంటీబయాటిక్స్తోనే క్యాన్సర్ విస్తరణ వేగాన్ని నెమ్మదిందప చేయవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధన వివరాలు సైన్స్ సైంటిఫిక్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. వానపాములు అక్కడా పెరుగుతాయి! భూమి మీద బతికే పరిస్థితులు లేకపోతే దగ్గరున్న అంగారకుyì పైకి ఎగిరిపోవాలని మనిషి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాగెనిగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ సానుకూల వార్తను మోసుకొచ్చారు. వాతావరణం దాదాపుగా లేని అరుణగ్రహపు మట్టిలోనూ వానపాములు మనగలగవని... పునరుత్పత్తి సాధించగలవని వీరు నిరూపించారు. మట్టిని సారవంతం చేయడం... తద్వారా పంటలు పండించేందుకు వానపాములు ఉపయోగపడతాయన్నది తెలిసిందే. అంగారకుడిపై ఉండే ధూళి చాలా పొడిగా ఉంటుంది. సేంద్రియ పదార్థాలేవీ ఉండవు కాబట్టి.. దాన్ని మట్టి అనేందుకు కూడా శాస్త్రవేత్తలు ఇష్టపడరు. ఆ గ్రహంపై మనిషి బతకాలంటే ఆహారం కోసం పంటలు పండించుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆ మట్టిలో వానపాములు బతుకుతాయా? లేదా? అన్నది పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. క్యూరియాసిటీ రోవర్ పంపిన అక్కడి మట్టి వివరాలను పరిశీలించినప్పుడు హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వతం పరిసరాల్లో ఉండే మట్టి దాదాపు ఇలాగే ఉన్నట్లు తెలిసింది. ఆ మట్టికి పంది వ్యర్థాలను కలిపి వానపాములను కూడా చేర్చారు. అచ్చం భూమిపై మాదిరిగానే వానపాములు ఆ మట్టినీ గుల్లగా మార్చి.. నీరు లోతులకు చేరేలా చేశాయి. ఈ ప్రయోగాల ఆధారంగా భవిష్యత్తులో అంగారకుడిపై మట్టిపై వ్యర్థాలు, వానపాముల ఆధారంగా పంటలు పండించడం సాధ్యమే అన్న అంచనాలు బలపడ్డాయి. -
దేశీ విత్తనంతో నేలతల్లికి వందనం!
- కారు చౌడు నేలలో దేశీ వరి ధాన్య సిరులు - 150 రకాల దేశీ వరి విత్తనాల సేకరణ.. ఎంపిక చేసిన 8 రకాల సాగు - అరెకరం నీటి కుంట ద్వారా 70 దేశీ ఆవులు, గిత్తల పోషణ - 10 శాతం పంట భూమిలో వాన నీటి సంరక్షణ చేపడితే డెల్టా రైతుకు నీటి కష్టాలుండవు - దేశీ వంగడాలు, ప్రకృతి సేద్యంతోనే బంగారు భవిష్యత్తు అంటున్న విజయరామ్ ప్రకృతి సేద్యానికి దేశీ విత్తనం, దేశీ ఆవే మూలాధారాలని భావిస్తున్న విజయరామ్.. కృష్ణా డెల్టాలోని చౌడు భూమిలోనూ దేశీ విత్తనాలతో మంచి దిగుబడులు సాధిస్తూ తోటి రైతాంగానికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. తొలుత తాను ఆరేళ్ల క్రితం పాలేకర్ ప్రకృతి సేద్యాన్ని నేర్చుకొని, శిక్షణా శిబిరాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో దేశీ వరి వంగడాలు దాదాపు కనుమరుగైపోయిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు పర్యటించి 150 రకాల దేశీ వరి వంగడాలను సేకరించారు. మేలైన రకాలను సాగు చేసి రైతులకు విత్తనాలు అందిస్తున్నారు. రసాయనిక సేద్యంతో రోగగ్రస్థమైన సమాజానికి కాయకల్ప చికిత్స చేసే యజ్ఞంలో.. ఔషధ విలువలతో కూడిన సహజాహార ఉత్పత్తికి దేశీ వరి వంగడాలు, దేశీ గోసంపద పరిరక్షణ అత్యవసరం. ఈ చైతన్యంతోనే విజయరామ్ నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. మచిలీపట్నానికి చెందిన మేకపోతుల విజయరామ్ హైదరాబాద్‌లో అప్లయిడ్ ఆర్ట్ స్టూడియో నడుపుతూ మిఠాయిల వ్యాపారం చేపట్టారు. పర్యావరణ ప్రేమికుడైన ఆయన ‘సేవ్’ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి వాన నీటి సంరక్షణ, మట్టి గణేశ విగ్రహాల తయారీ వంటి కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఆ దశలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్, రాజీవ్ దీక్షిత్ బోధనలు పరిచయమయ్యాయి. రాజమండ్రిలో 2009లో పాలేకర్ శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. దేశీ గోసంపద పరిరక్షణకు దేశీ విత్తనాలతో ప్రకృతి సేద్యం చేయడమే లక్ష్యంగా భావించారు. ఆ స్ఫూర్తితోనే నెల తిరగక ముందే కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు సమీపంలోని పినగూడూరు లంక గ్రామంలో ఆరెకరాల సాగు భూమిని కొనుగోలు చేశారు. 2010 ఖరీఫ్ నుంచే ప్రకృతి సేద్యంతోపాటు దేశీ గో సంపద పరిరక్షణకూ ఉపక్రమించారు. గిర్, ఒంగోలు, సాహివాల్ ఆవులు, గిత్తలను కొనుగోలు చేసి సౌభాగ్య గోసదన్‌ను మూడెకరాల్లో ఏర్పాటు చేశారు. ఆవులు విశ్రమించడానికి పక్కా భవనాలతోపాటు ఎండలో ఆరుబయట తిరగడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే.. వ్యవసాయ సంక్షోభానికి, ఆత్మహత్యలకు పరిష్కారంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు నేర్పించాలని సంకల్పించారు. పాలేకర్‌తో 4 శిబిరాల ద్వారా సుమారు 6 వేల మంది రైతులకు శిక్షణ ఇప్పించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. వానపాములు, సూక్ష్మజీవరాశికి కృతజ్ఞతగా ఆచ్ఛాదన! సుమారు అరెకరంలో 15 అడుగుల లోతున నీటి కుంటను తవ్వి.. వాన నీటి సంరక్షణ చేస్తున్నారు. మిగతా పొలంలో ఖరీఫ్‌లో దేశీ వరి వంగడాలను, రబీలో అపరాలు సాగు చేస్తున్నారు. అపరాలు నూర్చిన తర్వాత ఎండాకాలంలో నాలుగైదు అంగుళాల మందాన పశువులు తొక్కిన గడ్డీ గాదాన్ని ఆచ్ఛాదనగా వాడుతున్నారు. ‘పంట భూమిలోని సూక్ష్మజీవులు, వానపాములే ప్రకృతి సేద్యంలో పంటలకు పోషకాలను అందిస్తాయి. వాటికి కృతజ్ఞతగా ఎండాకాలం ఇలా ఆచ్ఛాదన చేస్తున్నా’నని విజయరామ్ అంటారు. అది కారు చౌడు భూమి. భూగర్భ నీరు కూడా పంటలకు పనికిరావు. అయినా, ప్రతికూల పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని సవాలుగా తీసుకున్న విజయరామ్ దీక్షగా ముందడుగు వేశారు. చౌడు తీవ్రత ఎంతని అడిగితే.. అసలు భూసార పరీక్ష, నీటి పరీక్ష ఎందుకు? అని ఆయన ఎదురు ప్రశ్నిస్తారు. రసాయనిక సేద్యం చేసే మాగాణుల్లో నుంచి నీటి ఊట తన భూమిలోకి రాకుండా జాగ్రత్త పడడానికి 3-4 అడుగుల వెడల్పున గట్లు తీయడం విశేషం. దేశీ వరి వంగడాల సేకరణ.. సాగు.. పంపిణీ.. ఒరిస్సాకు చెందిన దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారిణి సబర్మతి కృషిపై ‘సాక్షి’ ఫ్యామిలీలో నాలుగేళ్ల క్రితం ప్రచురితమైన కథనం విజయరామ్ను కదిలించింది. హుటాహుటిన సబర్మతి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని సందర్శించి.. అపురూపమైన అనేక వరి వంగడాల సేకరణకు ఉపక్రమించారు. అది మొదలు అనేక రాష్ట్రాలు పర్యటించి సుమారు 150 రకాలను సేకరించారు. 2015 ఖరీఫ్‌లో వీటిని తన క్షేత్రంలో చిన్న చిన్న మడుల్లో సాగు చేసి.. వాటి గుణగణాలను, దిగుబడినీ స్వయంగా నమోదు చేశారు. వీటిలో రైతులకు అన్ని రకాలుగా నచ్చే ఘని, మడు ముర్రంగి, నారాయణ కామిని, పుల్లాకార్, పుంగార్, కాలాభట్ సెంటెడ్, తులసి బాసొ వంటి వంగడాలను ఎంపిక చేశారు. వీటిని ఈ ఏడాది తన పొలంతోపాటు ఇతరులకు చెందిన సుమారు 60 ఎకరాల్లోనూ పెట్టుబడి లేని ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేయిస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలు వాడుతున్నారు. ఎటుచూసినా అడుగున్నర దూరంలో ఒక మొక్కను నాటితే చాలు. ఎకరానికి కిలో విత్తనం చాలు. చీడపీడల బెడద లేకుండా మంచి దిగుబడి పొందడానికి ఇదే మార్గమని విజయరామ్ అనుభవ పూర్వకంగా గ్రహించారు. ఆరోగ్యంగా పెరుగుతున్న తన పంటను చూపుతూ సందర్శకులతో ఇదే విషయాన్ని చెబుతుంటారు. రసాయనిక వ్యవసాయం చేసే వరి పొలాల్లో ఉన్న చీడపీడలు ఈ పొలంలో కనిపించకపోవడం విశేషం. అధిక దిగుబడినిచ్చే దేశీ వంగడాలు.. కర్ణాటకకు చెందిన ఘనిఖాన్ అభివృద్ధి పరచిన ‘ఘని’ దేశీ వరి వంగడాన్ని 2.6 ఎకరాల్లో విజయరామ్ తన చౌడు భూమిలో సాగు చేస్తున్నారు. 120 రోజుల పంట. గింజ రాలదు. పడిపోదు. చీడపీడలు లేకుండా చక్కగా పెరిగిన ఈ వంగడం నెలలో కోతకు రానుంది. ఎకరానికి 35 బస్తాల (బస్తా 70 కిలోలు) దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన మడు ముర్రంగి రకం ఈ సీజన్లో 4 అడుగుల ఎత్తు పెరిగింది. పాలుపోసుకునే దశలో ఉంది. 130 రోజులు. పడిపోదు. గింజ రాలదు. నీటి మట్టం పెరిగే కొద్దీ అంతకన్నా ఎత్తు పెరగడం దీని ప్రత్యేకత. ఎకరానికి 25 - 30 బస్తాల దిగుబడి రావచ్చని ఆశిస్తున్నారు. ఈ రకం కృష్ణా డెల్టా రైతులకు విస్తృతంగా అందించాలని ఆశిస్తున్నారు. నారాయణ కామిని వంగడాన్ని పశ్చిమ బెంగాల్‌కు చెందిన నారాయణ బచాడ అనే రైతు అభివృద్ధి పరిచారు. చక్కని రుచికరమైనది. నెమ్మదిగా జీర్ణమయ్యే గుణం కలిగిన ఈ వంగడాన్ని ఎక్కువ మందికి ఇవ్వడానికి విస్తారంగా సాగు చేయిస్తున్నామని విజయరామ్ తెలిపారు. పాలేకర్ సేద్య పద్ధతిని పూర్తిగా ఆచరిస్తే ఏ నేలలోనైనా తొలి ఏడాదే 20-15 బస్తాల దిగుబడి వస్తుందన్నారు. తులసిబాసో అనే సుగంధ రకం బియ్యం సైజు చిన్నగా ఉంటుంది. వరి కోత అయిన తర్వాత పొలానికి నీరు పెట్టి వదిలేస్తే.. 35 రోజుల్లో మరోసారి 40% పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ ఏడాది తమ పొలంలో 75 సెంట్లలో నవారా (బ్లాక్ రైస్)ను సాగు చేస్తే.. పుష్కరాల కారణంగా కాలువ నీరు రావడం ఆలస్యమై నేల నెర్రెలిచ్చినప్పటికీ తట్టుకొని.. 10-12 బస్తాల దిగుబడి రావడం విశేషం. ప్రకృతి సేద్య పద్ధతులు, ఆచ్ఛాదన వల్లనే ఇది సాధ్యమైందన్నారు. వాన నీరు మన సంపద.. మన పొలంలో కురిసిన వాన నీరు మన సంపద. ఎకరానికి పది సెంట్ల స్థలంలో నీటి కుంట తవ్వుకుంటే.. వర్షాలు, కాలువ నీరు ఆలస్యంగా వచ్చినా నార్లకు, నాట్లకు ఆటంకం ఉండదు. డబ్బు వృథా, పంట విస్తీర్ణం వృథా అనుకోవడం తప్పు. మొదటి ఏడాదే ఖర్చు తిరిగి వచ్చేస్తుంది. మా అరెకరం కుంట వల్ల వ్యవసాయానికే కాదు.. 70 ఆవులకు, 20 మంది మనుషులకూ నీటి కొరత లేదు. కరువొచ్చినా ఒక్క ట్యాంకరు కూడా కొనలేదని విజయరామ్ అన్నారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో పొట్టి వరి రకాలు సాగులోకి వచ్చాక దేశీ వంగడాలు కనుమరుగైపోయాయి. అయితే, వరి గడ్డిని కట్టలు కట్టేందుకు ‘కట్ల గడ్డి’గా మాత్రం నెల్లూరు మొలగొలుకులు రకాన్ని ప్రతి వరి పొలంలోనూ కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తుండడం కనిపించింది! ఆరోగ్యదాయకంగా దేశీ ఆవుల పోషణపై విజయరామ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం పెదముత్తేవి వద్ద 9 ఎకరాల్లో పశుగ్రాసాన్ని ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేస్తున్నారు. దేశీ ఆవు నెయ్యి, సంప్రదాయ గానుగలతో నూనెలు, షాంపూలు, సున్నిపిండి తదితర ఉత్పత్తులు తయారు చేసి విక్రయించడం ద్వారా రైతు సమగ్ర ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయడం అభినందనీయం. జనవరి, ఫిబ్రవరిలో విత్తనోత్సవం వివిధ రాష్ట్రాల్లో సేకరించి, తెలుగునాట సాగుచేసిన దేశీ వరి వంగడాలను వచ్చే జనవరి, ఫిబ్రవరిలో వేలాది మంది రైతులకు అందించేందుకు విజయరామ్ సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని ‘మన గ్రామం’ కార్యాలయంలో 2017 జనవరి 8, 9 10 తేదీల్లో భారీ ఎత్తున దేశీ వరి విత్తనాలు పంపిణీ చేస్తారు. పినగూడూరులంకలోని సౌభాగ్య గోసదన్‌లో ఆ తర్వాత ఏ రోజైనా దేశీ వరి విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. అదేవిధంగా, హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో విత్తనోత్సవం నిర్వహిస్తామన్నారు. వివరాలకు 0866 2583426 నంబరులో సంప్రదించవచ్చు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : జె. అజీజ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మచిలీపట్నం ఔషధ విలువలున్న ఆహారాన్నందించడమే లక్ష్యం! ఏదో ఒక పంట పండించాం.. తిన్నాం అని కాదు.. ఔషధ విలువలున్న ఆహారాన్ని ప్రజలకు అందించాలి. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ఖాళీ కావాలి. ఇదే లక్ష్యంతో వేలాది మంది రైతులకు గతంలో పాలేకర్ గారి ద్వారా శిక్షణ ఇప్పించాం. అదే దీక్షతో ఇప్పుడు దేశీ వరి విత్తనాలను వేలాది మంది రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఔషధ విలువలున్న వరి బియ్యం దైవం మనకిచ్చిన అద్భుత వరం. దేవాలయాల్లో నైవేద్యాలు దేశీ వరి బియ్యంతో పెడితే బాగుంటుంది. ఇందుకోసం యాదాద్రి పరిసరాల్లోని 365 మంది రైతులకు దేశీ వరి విత్తనాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ఆలయ ప్రాంగణంలోనే దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేస్తే.. దైవదర్శనానికి వచ్చిన రైతులకు దేశీ విత్తనాలు ఇస్తుండొచ్చన్నది ఆలోచన. పాలకులు స్పందించాలి. - మేకపోతుల విజయరామ్, సౌభాగ్య గోసదన్, పినగూడూరు లంక (తరకటూరు దగ్గర), గూడూరు మం., కృష్ణా జిల్లా -
పులికాట్ కేంద్రంగా... ఎర్రల దందా!
ప్రతి రోజూ రూ.500 కేజీల అక్రమ రవాణా రూ.లక్షలు సంపాదిస్తున్న దళారులు చిల్లకూరు: పులికాట్ కేంద్రంగా వానపాముల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి రోజూ సుమారు 500 కేజీల వరకు తరలిపోతున్నాయి. భూమిని తొలిచి పంటలకు ఆక్సిజన్ అందించడంలో వానపాములు(ఎర్ర లు) రైతుల కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో గిరాకీ పెరిగింది. ఇది ఎక్కవ శాతం పులికాట్‌ను ఆధారం చేసుకుని దాందా సాగుతోంది. ఎందుకు వినియోగిస్తారంటే: వానపాములు ఎక్కువగా రొయ్యలకు మేతగా వినియోగి స్తారు. ఇవి ఎంత తింటే అంత బలంగా రొయ్యలు పెరుగుతాయి. రొయ్యల గుంతలు సాగు చేసే వారు ఎర్రల కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. పులికాట్ ప్రాంతంలో దోరికే వాటికి మండి డిమాండ్ ఉండటంతో ప్రకాశం, తూర్పుగోదావరి ప్రాంతాల్లోని రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేవారు పోటీ పడిమరీ కొనుగోలు చేస్తుండటంతో వాటికి మంచి గిరాకి ఏర్పడింది. తల్లి రొయ్యకు వానపామును ఆహారంగా వేస్తే లక్ష గుడ్లు పెట్టే రొయ్య అంతకు మించి గుడ్లు పెడుతుంది. వివిధ మార్గాల్లో: సాధారణంగా దొరికే వానపాముల కంటే పులికాట్లో దొరికేవి పుష్టిగా ఉండటమే కాకుండా రొ య్యలకు మంచి బలం చేకూర్చుతుండటంతో ఆ ప్రాం తంలోనే వాటి కోసం అన్వేషణ ఎక్కువైంది. దీంతో దళారులు ఆ ప్రాంతలోని గిరిజనులను మచ్చిక చేసుకుని వారికి డబ్బు ఆశచూపి ప్రతిరోజూ వానపాములను తవ్వి తరలిస్తున్నారు. వీటిని కొంత మంది కుండల్లో, టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లలో ఉంచి బస్సు, లారీలు, ప్రైవేట్ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేజీ రూ.3 వేలు పలుకుతున్న ధర: పులికాట్ ప్రాంతంలో సేకరించిన ఎర్రలకు కేజీ రూ.3 నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. పులికాట్లో గిరిజనులు సేకరించే వాటికి మాత్రం కేజీకి రూ.40 ఇచ్చి, దళారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
25 కిలోల వానపాములు పట్టివేత
సూళ్లూరుపేట: అక్రమంగా తరలిస్తున్న వానపాములను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వద్ద పులికాట్ వన్యప్రాణి విభాగం అధికారులు శనివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తడ మండలం వేనాడు నుంచి బైక్‌పై 25 కిలోల వానపాములను గోనె సంచిలో తరలిస్తుండగా మండలంలోని దావాదిగుంట వద్ద అధికారులు అడ్డుకున్నారు. అయితే నాగేంద్ర పరారయ్యాడు. వానపాములను స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు. గతంలో నాగేంద్ర వన్యప్రాణి విభాగంలో ఉద్యోగిగా పని చేశాడు. -
20 కిలోల వానపాములు పట్టివేత
సూళ్లూరుపేట : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న వానపాములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తడ మండలం వేనాడు గ్రామానికి చెందిన వందేటి నాగేంద్ర అక్రమంగా వానపాములతో బైక్‌పై వస్తుండగా అతడిని వైల్డ్ లైఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి వద్దనున్న వానపాములను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వానపాముల తరలింపు వన్యప్రాణుల చట్టం ప్రకారం నేరమని వైల్డ్ లైఫ్ రేంజి కుమార్‌రాజా తెలిపారు.