ఇంకా ఆగలేదు! | Earthworms Smuggling In PSR Nellore | Sakshi
Sakshi News home page

ఇంకా ఆగలేదు!

Published Fri, Aug 24 2018 11:55 AM | Last Updated on Fri, Aug 24 2018 11:55 AM

Earthworms Smuggling In PSR Nellore - Sakshi

పాలిథిన్‌ కవర్లలో పార్శిల్‌ చేసిన వానపాములు (ఫైల్‌)

పులికాట్‌ సరస్సు గర్భంలో సహజ సిద్ధంగా ఏర్పడిన వానపాములను తవ్వేస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొంతమంది బడాబాబులు తీరప్రాంత గ్రామాల్లో ఉండే కూలీలను ప్రోత్సహించి సరస్సు ఉనికికే ప్రమాదం తెస్తున్నారు. దీంతో సరస్సు గుంటలు మిట్టలుగా మారి సహజత్వాన్ని కోల్పోతోంది. వానపాముల తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా ఉంటున్నారు.

నెల్లూరు,సూళ్లూరుపేట: నాలుగైదు సంవత్సరాల నుంచి పులికాట్‌ సరస్సులో వానపాముల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా తడ మండలం వేనాడు, ఇరకం దీవులకు చుట్టూ గుల్ల, వానపాముల కోసం సరçస్సును తవ్వేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్నవారు వేనాడు దీవిలోని మూల, తదితర ప్రాంతాల్లోని కూలీలను ప్రోత్సహిస్తున్నారు. కేజీ పాములు తీస్తే రూ.900 వరకు ఇస్తుండటంతో ఒక్కో ఇంటి నుంచి ఇద్దరేసి చొప్పున వెళ్లి రెండు కిలోలు పైగా పడుతున్నారు. తవ్విన వానపాములను ప్లాస్టిక్‌ బకెట్లు, పాలిథిన్‌ కవర్లు, థర్మాకోల్‌ బాక్స్‌లు, మట్టి కుండల్లో భద్రపరిచి ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లలో రొయ్యల హేచరీలకు గుట్టుచప్పుడు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకాశం, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల్లోని హేచరీలకు తరలించి విక్రయించే వారికి సుమారుగా రూ.5 వేలు నుంచి రూ.6 వేలు వరకు వస్తోంది.

కేసులు నమోదవుతున్నా..
2015–16 సంవత్సరంలో సుమారు పది కేసులు, 2016–17 సంవత్సరంలో పది కేసులు, 2017–18లో ఐదారు కేసులు నమోదయ్యాయి. రెండురోజుల క్రితం చెన్నై నగరంలోని ఎన్నూరు నుంచి ప్రకాశం జిల్లాకు తరలిస్తున్న వానపాములను తడ పోలీసులు పట్టుకుని పులికాట్‌ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులకు అప్పగించారు. దీనికి వన్యప్రాణి విభాగంలో ప్రత్యేకమైన చట్టాలు లేకపోవడంతో అధికారులు చేతులెత్తుస్తున్నారు. నిందితులను పట్టుకుని వదిలేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. సూళ్లూరుపేటలో పలు ప్రాంతాల్లో నిల్వ చేసుకుని దర్జాగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు.

ఇలాగే కొనసాగితే..
ఈ ఏడాది పులికాట్‌ సరస్సులో మత్స్య సంపద ఉత్పత్తి భారీగా తగ్గిందని, ముఖ్యంగా రొయ్యలు ఉత్పత్తి పూర్తిగా పడిపోయిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పులికాట్‌ సరస్సు పూర్తిగా ఉనికి కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురవవని, విదేశీ వలస విహంగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

దాడులేవీ?
సరస్సును అన్ని రకాలుగా నాశనం చేస్తున్నా పులికాట్‌ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా దాడులు చేస్తున్న దాఖలాల్లేవు. వానపాములు అక్రమ రవాణా చేసేవారి నుంచి కిందిస్థాయి సిబ్బందికి ప్రతినెలా మామూళ్లు అందుతున్నాయని చెబుతున్నారు. సరస్సు పరిధిని ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తూ బీట్‌ ఆఫీసర్లను ఏర్పాటుచేశారు. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లడంలేదని విమర్శలున్నాయి. ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప ప్రత్యేకంగా సిబ్బంది నిఘా వేసి అక్రమ రవాణాను అరికట్టిన సందర్భాలు లేవు. సరస్సును పక్షుల భూతల స్వర్గంగా ప్రకటించారు కాబట్టి ఈ ప్రాంతంలో తారు రోడ్లు వేయకూడదు, ఎలాంటి భవనాలు నిర్మించకూడదనే నిబంధన ఉంది. వీటిని గట్టిగానే అమలుచేసే అధికారులు వానపాములు, గుల్ల తవ్వకాలను మాత్రం అడ్డుకోవడంలో శ్రద్ధ తీసుకోవడం లేదు.   

సమాచారం ఇస్తే పట్టుకుంటాం
వానపాములు తరలిస్తున్నారనే సమాచారం ఇస్తే వెంటనే పట్టుకుంటున్నాం. ఇటీవలే వేనాడు రెండు వాహనాలను సీజ్‌ చేశాం. ఎవరైనా వానపాములు తీస్తూ మత్స్యకారులకు పట్టుబడితే రూ.50 వేలు అపరాధ రుసుం విధిస్తామని చెప్పడంతో తగ్గుముఖం పట్టింది. పూర్తిగా నిరోధించేందుకు మత్స్యకారుల భాగస్వామ్యంతో కృషి చేస్తాం. – వేణు, రేంజర్‌     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement