వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ రాంబాబు, చిత్రంలో నిందితులు
చిల్లకూరు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని, విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. చిల్లకూరు పోలీసు స్టేషన్‌లో సోమవారం గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇటీవల గూడూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయం పెరిగడంతో, దీనిపై దృష్టి పెట్టామన్నారు. రెండురోజుల క్రితం ఆదివారం రూరల్ సీఐ అక్కేశ్వరరావు, ఎస్సై శ్రీనివాసరావుకు వైజాగ్ నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సులో గంజాయి రవాణా జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. ఆరోజు సాయంత్రం ఆయన సిబ్బందితో కలసి కోట క్రాస్‌రోడ్డు వద్ద బస్సును నిలిపి తనిఖీ చేయగా ఓ బ్యాగ్‌లో నాలుగు ప్యాకెట్ల (8.5 కేజీలు) గంజాయిని గుర్తించారని తెలిపారు.
ఆ బ్యాగ్‌తో పాటు ప్రయాణిస్తున్న వేలుపాండ్యన్ ఉదయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. కోటకు చెందిన నూరుబాషాకు గంజాయిని సరఫరా చేసి అతని ద్వారా గూడూరు, కోట ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పాడన్నారు. దీంతో నూర్‌బాషాతో పాటు అతని భార్య మదార్‌బీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వేలుపాండ్యన్ ఉదయ్‌కు చెందిన ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి మరింత విచారిస్తున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. నిందితులను కోర్టుకు హాజరుస్తున్నట్లు వెల్లడిం చారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment