బంగారం చెన్నైలో ఎందుకు చౌకంటే.. | Gold Biscuits Smuggling In Kavali PSR Nellore | Sakshi
Sakshi News home page

జీరో దందా

Published Sat, Jun 9 2018 12:15 PM | Last Updated on Sat, Jun 9 2018 12:15 PM

Gold Biscuits Smuggling In Kavali PSR Nellore - Sakshi

రెండేళ్ల క్రితం కావలికి చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయలు తీసుకుని రైల్లో ప్రయాణం చేస్తుండగా, నెల్లూరు–పడుగుపాడు రైల్వేస్టేషన్‌ మధ్యలో ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బెదిరించారు. అతన్ని నెల్లూరు రైల్వేస్టేషన్‌లో దింపి కారులో ఎక్కించుకుని, అతని వద్ద ఉన్న నగదు తీసుకున్నారు. జాతీయ రహదారిపై కావలి సమీపంలో ఆ వ్యక్తిని దింపి కారులో వెళ్లిపోయారు. ఈ సొమ్మంతా బంగారు వ్యాపారులది కావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును, అందులోని వ్యక్తులను కందుకూరు–కనిగిరి మధ్య పట్టుకున్నారు. నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.  

కావలి :   పట్టణంలో నెలకు రూ.200 కోట్ల మేర బంగారు బిస్కెట్లు వ్యాపారం జరుగుతోంది. అంతా జీరో ట్యాక్స్‌ బిజినెస్‌. బిల్లులు లేకుండా చెన్నై నుంచి బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ముందుగా ఆర్డర్లు ఇచ్చిన వారికి వాటిని అప్పగిస్తుంటారు. కావలి నుంచి చెన్నైకు రాకపోకలు సాగించే క్రమంలో పోలీ సులు, డీఆర్‌ఐ అధికారుల తనిఖీల్లో దొరుకుతున్నారు. పట్టణంలో 60 మంది వరకు బంగారు వ్యాపారులు ఉన్నారు. వీరిలో 50 మంది ఆభరణాలు అమ్మకాలు చేస్తుంటారు. మిగిలిన వారు ఆభరణాల అమ్మకాలతో పాటు చెన్నై నుంచి బిల్లులు లేకుండా బంగారు బిస్కెట్లను కావలికి తెచ్చి అమ్మకాలు చేస్తుంటారు. ఈ పది మంది వ్యక్తులు, వారి వద్ద గుమస్తాలుగా పని చేసేవారు, సీజన్‌ బాయ్స్‌ ఈ బంగారు బిస్కెట్ల వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నెల్లూరుకు చెందిన బంగారు వ్యాపారస్తులు కూడా కావలికి వచ్చి బిల్లులు లేకుండా బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తుండటం గమనార్హం.  ప్రకాశం జిల్లాలోని కందుకూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు జిల్లా తెనాలి తదితర ప్రాంతాల నుంచి బంగారు వ్యాపారులు కావలికి వచ్చి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం. ఒక్క ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ కావలి– చెన్నై మధ్య రూ.కోట్ల నగదు, బంగారు బిస్కెట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు బంగారు బిస్కెట్ల వ్యాపారం జరుగుతుండగా,  నెలకు కనీసం రూ.200 కోట్లకు తగ్గకుండా టర్నోవర్‌ జరుగుతోంది. 

ఆర్డర్లు ఇలా..
బంగారు బిస్కెట్లు కావాల్సిన వ్యాపారస్తులు తమకు ఎంత తూకంలో కావాలో వాటి విలువకు సరిపడే నగదును ముందుగానే వ్యాపారులకు అందజేస్తున్నారు. ఏదైనా రిస్క్‌ జరిగితే ఆర్డరు ఇచ్చిన వారికి ఎటువంటి సంబంధం ఉండదు. ఆర్డర్లు ఇచ్చిన వారికి మాత్రం అనుకున్న ధరకు తూకం ప్రకారం బంగారు బిస్కెట్లు ఇవ్వాల్సిందే. అలా ఆర్డర్లు సేకరించి, చెన్నైలో బంగారు బిస్కెట్లు అమ్మకాలు చేసే వారితో ఫోన్‌లోనే కాంటాక్ట్‌ అవుతారు. ధరను బట్టి నగదు ఎంత తీసుకు వచ్చేది, ఎవరు వచ్చేది, చెన్నైలో ఎక్కడ కలుసుకునేది అంతా ఫోన్‌లోనే చెబుతారు.

రవాణాలో అనేక మార్పులు
బిల్లులు లేని బంగారు బిస్కెట్ల కోసం కావలి నుంచి చెన్నైకు వెళ్లే వారి ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది. రైల్లో సాధారణ మనుషులుగా చేతిలో చిరిగిన సంచి, పాత గోతం వంటి సంచి పెట్టుకుని బోగీలో నేలపై కూర్చొంటారు. చెన్నై సమీప రైల్వే స్టేషన్‌కు పోయేలోగా చాలా బోగీలు మారిపోతుంటారు. చెన్నై సమీప రైల్వేస్టేషన్‌లో దిగి సబర్బన్‌ రైల్లో కానీ, బస్సులో కానీ ప్రయాణించి చెన్నైకు చేరిపోతారు. చెన్నైలోని సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెళ్లరు. అక్కడ అడుగడుగు>నా నిఘా, సునిశిత పరిశీలన ఉంటుంది. కారులో కూడా రాకపోకలు సాగిస్తుంటారు. చెన్నైలో క్షేమంగా లావాదేవీలు పూర్తి చేసుకోవడానికి ఏది సౌలభ్యంగా ఉంటుందో చేసుకుంకొంటారు.

కావలిపై డీఆర్‌ఐ నిఘా  
కావలికి చెందిన కొందరు విదేశాల నుంచి భారీ ఎత్తున బిల్లులు, ట్యాక్స్‌ లేకుండా బంగారం తరలిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) నిఘా పెట్టింది. ఇటీవల తనిఖీల్లో పట్టుబడిన బంగారు వ్యాపారుల గుమస్తాలను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరికి చెన్నైలో సరఫరా చేసే బంగారు మాఫియా వివరాలు, వారి స్థావరాలు, కావలి నుంచి వాటిని ఏ ఏ ప్రాంతాల్లోని బంగారు వ్యాపారస్తులకు అమ్మకాలు చేస్తున్నారు.. ఎంత కాలం నుంచి ఈ అక్రమ వ్యాపారం జరుగుతుందనే విషయాలు తెలుసుకుని నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద డీఆర్‌ఐ అధికారులు చెన్నై నుంచి కారులో బంగారు బిస్కెట్లు కావలికి తీసుకు వస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిప కావలికి చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి తమకు అవసరమైన కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలిసింది. ఈ కేసులోని నిందితులను సైతం విశాఖపట్నం కేంద్రకారాగారానికి తరలించారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఉండేందుకు అవసరమైతే మరోసారి కస్టడీకి తీసుకుని విచారించేందుకు డీఆర్‌ఐ అధికారులు అక్కడికి తరలించినట్లు సమాచారం. దీంతో కావలిలో బిల్లులు లేకుండా చెన్నై నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొచ్చి అమ్మకాలు చేసే వారు, వారి వద్ద కొనుగోలు చేసే వారు వణుకుతున్నారు.   

ఆదాయం లక్షల్లో ఉండడంతోనే..
చెన్నై నుంచి కావలికి చేర్చుకుని బంగారు బిస్కెట్లను ఆర్డర్లు ఇచ్చిన వ్యాపారస్తులకు ఇచ్చేస్తారు. అంటే పెట్టుబడి లేకుండానే బంగారు బిస్కెట్ల వ్యాపారం చేయడం అన్నమాట. బంగారు ధర షేర్‌ మార్కెట్‌లా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారం చేసే స్థానికులు రోజుకు ఒక్కొక్కరు కనీసం రూ.50 వేలు నంచి రూ.లక్ష వరకు ఆదాయంగా  ఆర్జిస్తున్నారు. చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం కావడంతో కావలి–చెన్నై, చెన్నై–కావలి మధ్య చాలా రకాల ఇబ్బందులు జరుగుతుంటాయి. తమిళనాడుతో పాటు మన రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఇతర శాఖల అధికారులు, కేంద్ర సంస్థలు నుంచి, వ్యక్తుల నుంచి పలు రిస్క్‌లు నిత్యం ఎదుర్కొంటుంటారు. అయితే అంతా చేయి తడుపుకొంటూ దర్జాగా ఈ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాన్ని విజయవంతంగా కొనసాగిస్తుంటారు.

చెన్నైలో ఎందుకు చౌకంటే..  
విదేశాల్లో చౌకగా దొరికే బంగారం, మన దేశంలో ప్రియం. చట్టాలకు అనుగుణంగా నిబంధనలను అనురించి విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే పన్నుల రూపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి చెల్లించాలి.  బంగారం కొనుగోలుకు పెట్టే పెట్టుబడికి సంబంధించి ఆదాయపన్ను శాఖకు లెక్కలు చూపి, పన్నులు చెల్లించాలి. అందుకే ‘బంగారు మాఫియా’ జిత్తుల మారి కుయుక్తులతో ముందుస్తుగా ఏర్పాటు చేసుకొన్న వ్యక్తుల ద్వారా విమాన ప్రయాణాలు చేయించి బంగారాన్ని మన దేశానికి చేరవేస్తోంది. చెన్నైకు చేరిన బంగారు బిస్కెట్లను బిల్లులు లేకుండా అమ్మకాలు చేస్తుంటారు. దీని వల్ల బహిరంగ మార్కెట్‌ కన్నా 10 నుంచి 20 శాతం ధరల్లో తేడాలు ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement