వాటి ధరలు మారిస్తే..లక్షల ప్రాణాలు మిగులుతాయి.. | usefull information | Sakshi
Sakshi News home page

వాటి ధరలు మారిస్తే..లక్షల ప్రాణాలు మిగులుతాయి..

Published Thu, Nov 30 2017 1:29 AM | Last Updated on Thu, Nov 30 2017 1:29 AM

usefull information  - Sakshi

ఆరోగ్యంగా ఉండాలంటే... కాయగూరలు, పండ్లు బాగా తినాలని డాక్టర్లు చెబుతారు. పేదలకు ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో కనీసం ఏడు రకాల ఆహార పదార్థాల ధరలు తగ్గించగలిగితే.. గుండెపోటు, మధుమేహం, గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని అంటున్నారు టఫ్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.

తాజా అధ్యయనం ప్రకారం... గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లు, నట్స్, విత్తనాల వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు.. ప్రాసెస్‌ చేసిన మాంస ఉత్పత్తులు, కూల్‌ డ్రింక్స్‌ వంటి అనారోగ్య కారక పదార్థాల ధరల్లో పదిశాతం హెచ్చు తగ్గులు చేస్తే ఒక్క అమెరికాలోనే గుండె సంబంధిత జబ్బులతో వచ్చే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు.

ధరల్లో మార్పులు 30 శాతం వరకూ ఉంటే, అంటే.. అనారోగ్య కారక ఆహార పదార్థాలపై ఎక్కువ పన్నులు వేసి ధరలు పెంచితే.. ఈ సంఖ్య మరింత తగ్గుతుందని టఫ్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. కాయగూరలు, పండ్లు వంటి హెల్దీఫుడ్‌ తీసుకో(లే)కపోవడానికి ఉన్న కారణాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు.

యాంటీబయాటిక్స్‌తోనే క్యాన్సర్‌కు చికిత్స?
చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికారని సామెత. ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధి చికిత్స విషయంలోనూ ఇలాగే జరిగిందని అనిపిస్తుంది ఈ విషయం తెలిస్తే... మన నోటిలో ఉండే ఓ బ్యాక్టీరియాకు క్యాన్సర్‌ కణాలను చంపేసే సామర్థ్యం ఉన్నట్లు బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫూసో బ్యాక్టీరియాను యాంటీబయాటిక్‌ మందులతో నియంత్రించినప్పుడు క్యాన్సర్‌ కణుతులు చాలా నెమ్మదిగా పెరగడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనల ద్వారా క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స అందించే వీలు ఏర్పడుతుందని భావిస్తున్నారు.

క్యాన్సర్‌ కణాల్లో బ్యాక్టీరియా ఉండటం కొత్త కాకపోయినప్పటికీ నోటిలో ఉండే ఫూసో బ్యాక్టీరియా పేగు, కాలేయాలకూ విస్తరించడం మాత్రం శాస్త్రవేత్తల్లో కుతూహలాన్ని పెంచింది. ఆరేళ్ల క్రితం తొలిసారి పేగు క్యాన్సర్‌ కణుతుల్లో వీటిని గుర్తించారు. తాజాగా దాదాపు సగం మంది రోగుల్లో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు స్పష్టమైంది. ఈనేపథ్యంలో ఎలుకలపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రించేందుకు వినియోగించే రెండు రకాల మందులను ఉపయోగించి చూసినప్పుడు... మెట్రోనిడాజోల్‌ అందించిన ఎలుకల్లో క్యాన్సర్‌ కణుతులు చాలా నెమ్మదిగా పెరిగితే... ఎరిత్రోమైసిన్‌ అందించిన ఎలుకల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీన్ని బట్టి యాంటీబయాటిక్స్‌తోనే క్యాన్సర్‌ విస్తరణ వేగాన్ని నెమ్మదిందప చేయవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధన వివరాలు సైన్స్‌ సైంటిఫిక్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

వానపాములు అక్కడా పెరుగుతాయి!
భూమి మీద బతికే పరిస్థితులు లేకపోతే దగ్గరున్న అంగారకుyì పైకి ఎగిరిపోవాలని మనిషి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో  వాగెనిగెన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ సానుకూల వార్తను మోసుకొచ్చారు. వాతావరణం దాదాపుగా లేని అరుణగ్రహపు మట్టిలోనూ వానపాములు మనగలగవని... పునరుత్పత్తి సాధించగలవని వీరు నిరూపించారు. మట్టిని సారవంతం చేయడం... తద్వారా పంటలు పండించేందుకు వానపాములు ఉపయోగపడతాయన్నది తెలిసిందే. అంగారకుడిపై ఉండే ధూళి చాలా పొడిగా ఉంటుంది. సేంద్రియ పదార్థాలేవీ ఉండవు కాబట్టి.. దాన్ని మట్టి అనేందుకు కూడా శాస్త్రవేత్తలు ఇష్టపడరు.

ఆ గ్రహంపై మనిషి బతకాలంటే ఆహారం కోసం పంటలు పండించుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆ మట్టిలో వానపాములు బతుకుతాయా? లేదా? అన్నది పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. క్యూరియాసిటీ రోవర్‌ పంపిన అక్కడి మట్టి వివరాలను పరిశీలించినప్పుడు హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వతం పరిసరాల్లో ఉండే మట్టి దాదాపు ఇలాగే ఉన్నట్లు తెలిసింది. ఆ మట్టికి పంది వ్యర్థాలను కలిపి వానపాములను కూడా చేర్చారు. అచ్చం భూమిపై మాదిరిగానే వానపాములు ఆ మట్టినీ గుల్లగా మార్చి.. నీరు లోతులకు చేరేలా చేశాయి. ఈ ప్రయోగాల ఆధారంగా భవిష్యత్తులో అంగారకుడిపై మట్టిపై వ్యర్థాలు, వానపాముల ఆధారంగా పంటలు పండించడం సాధ్యమే అన్న అంచనాలు బలపడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement