ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ అర్బన్: వానపాములు, జెర్రులను గమనించకుండా వండిన పప్పు తిన్న 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 9 మంది పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆరుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమపాఠశాలలో గురువారం జరగగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
ఆశ్రమ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం, పప్పుకూరలో వానపా ము, జెర్రి వచ్చింది. అప్పటికే కొంతమంది విద్యార్థినులు భోజనం తిన్నారు. వారిలో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. వార్డెన్, హెచ్‌ఎం, ఉపాధ్యాయు లు ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా ఆ విద్యార్థినులను హాస్టల్‌లోనే ఉంచి రాత్రి వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, బిస్కెట్లు ఇచ్చారు.
శుక్రవారం వారిలో 9 మంది పరిస్థితి విషమించడంతో హుటాహుటిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి ఆరోగ్యం కుదుటపడగా, మరో ఆరుగురు ఐశ్వర్య, అఖిల, కావ్య, భూమిక, భాను, గౌతమిలను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మెనూ ప్రకారం వంట చేయడం లేదని విద్యార్థులు హాస్టల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో ప్రత్యేక క్యాంపు పెట్టి వైద్యసేవలందించారు.
పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, జేసీ, డీడీ
అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, డీడీ ఎర్రయ్య గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. రాత్రి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి హాస్టల్‌ను తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment