మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌ | 40 Students From ZPHS Maganur Fall Ill After Food Poisoning Incident In Narayanpet District, More Details | Sakshi
Sakshi News home page

మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌

Published Wed, Nov 27 2024 6:13 AM | Last Updated on Wed, Nov 27 2024 11:30 AM

Food poisoning again 40 students fall ill in Maganur

వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురైన విద్యార్థులు

మాగనూర్‌లో తాజాగా 40 మంది విద్యార్థులకు అస్వస్థత  

నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం మరోసారి కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఉపాధ్యాయులు మొదట మాగనూర్‌ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 30 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం మక్తల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 9వ తరగతి విద్యార్థులు నేత్ర, దీపిక పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రి తరలించారు. 

తహసీల్దార్‌ పర్యవేక్షణలోనే వంట 
మాగనూర్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌ సురేష్‌ కుమార్, మధ్యాహ్న భోజనం ఇన్‌చార్జి, పాఠశాల ఉపాధ్యాయుడు రాఘవేంద్రచారి పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనం తయారు చేయించారు. అయినప్పటికీ మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వంట చేసిన కార్మీకులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.  

బయట చిరుతిళ్లు తిన్నారా? 
విద్యార్థులు స్కూల్‌ బయట ఉన్న బేకరీలు, దుకాణాల్లో చిరుతిళ్లు తినడంతోనే అస్వస్థతకు గురై ఉంటారని కలెక్టర్‌ సిక్తా పటా్నయక్‌ అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి మాగనూర్‌లోని పలు బేకరీలు, దుకాణాల్లో విచారణ చేపట్టారు. 



సీఎం దృష్టికి వెళ్లినా.. 
గత బుధవారం కలుషిత ఆహారంతో 100 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 17 మంది ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరునాడే అన్నంలో మళ్లీ పురుగులు రావడం, అధికారులపై చర్యలు తీసుకోవడం వంటివి జరిగాయి. తాజాగా మళ్లీ ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు వరుసబెట్టి అస్వస్థతకు గురవుతుండటంపై ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement