దేశీ విత్తనంతో నేలతల్లికి వందనం!
- కారు చౌడు నేలలో దేశీ వరి ధాన్య సిరులు
- 150 రకాల దేశీ వరి విత్తనాల సేకరణ.. ఎంపిక చేసిన 8 రకాల సాగు
- అరెకరం నీటి కుంట ద్వారా 70 దేశీ ఆవులు, గిత్తల పోషణ
- 10 శాతం పంట భూమిలో వాన నీటి సంరక్షణ చేపడితే డెల్టా రైతుకు నీటి కష్టాలుండవు
- దేశీ వంగడాలు, ప్రకృతి సేద్యంతోనే బంగారు భవిష్యత్తు అంటున్న విజయరామ్
ప్రకృతి సేద్యానికి దేశీ విత్తనం, దేశీ ఆవే మూలాధారాలని భావిస్తున్న విజయరామ్.. కృష్ణా డెల్టాలోని చౌడు భూమిలోనూ దేశీ విత్తనాలతో మంచి దిగుబడులు సాధిస్తూ తోటి రైతాంగానికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. తొలుత తాను ఆరేళ్ల క్రితం పాలేకర్ ప్రకృతి సేద్యాన్ని నేర్చుకొని, శిక్షణా శిబిరాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో దేశీ వరి వంగడాలు దాదాపు కనుమరుగైపోయిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు పర్యటించి 150 రకాల దేశీ వరి వంగడాలను సేకరించారు. మేలైన రకాలను సాగు చేసి రైతులకు విత్తనాలు అందిస్తున్నారు. రసాయనిక సేద్యంతో రోగగ్రస్థమైన సమాజానికి కాయకల్ప చికిత్స చేసే యజ్ఞంలో.. ఔషధ విలువలతో కూడిన సహజాహార ఉత్పత్తికి దేశీ వరి వంగడాలు, దేశీ గోసంపద పరిరక్షణ అత్యవసరం. ఈ చైతన్యంతోనే విజయరామ్ నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు.
మచిలీపట్నానికి చెందిన మేకపోతుల విజయరామ్ హైదరాబాద్‌లో అప్లయిడ్ ఆర్ట్ స్టూడియో నడుపుతూ మిఠాయిల వ్యాపారం చేపట్టారు. పర్యావరణ ప్రేమికుడైన ఆయన ‘సేవ్’ పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి వాన నీటి సంరక్షణ, మట్టి గణేశ విగ్రహాల తయారీ వంటి కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఆ దశలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్, రాజీవ్ దీక్షిత్ బోధనలు పరిచయమయ్యాయి. రాజమండ్రిలో 2009లో పాలేకర్ శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. దేశీ గోసంపద పరిరక్షణకు దేశీ విత్తనాలతో ప్రకృతి సేద్యం చేయడమే లక్ష్యంగా భావించారు. ఆ స్ఫూర్తితోనే నెల తిరగక ముందే కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు సమీపంలోని పినగూడూరు లంక గ్రామంలో ఆరెకరాల సాగు భూమిని కొనుగోలు చేశారు. 2010 ఖరీఫ్ నుంచే ప్రకృతి సేద్యంతోపాటు దేశీ గో సంపద పరిరక్షణకూ ఉపక్రమించారు. గిర్, ఒంగోలు, సాహివాల్ ఆవులు, గిత్తలను కొనుగోలు చేసి సౌభాగ్య గోసదన్‌ను మూడెకరాల్లో ఏర్పాటు చేశారు. ఆవులు విశ్రమించడానికి పక్కా భవనాలతోపాటు ఎండలో ఆరుబయట తిరగడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే.. వ్యవసాయ సంక్షోభానికి, ఆత్మహత్యలకు పరిష్కారంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు నేర్పించాలని సంకల్పించారు. పాలేకర్‌తో 4 శిబిరాల ద్వారా సుమారు 6 వేల మంది రైతులకు శిక్షణ ఇప్పించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.
వానపాములు, సూక్ష్మజీవరాశికి కృతజ్ఞతగా ఆచ్ఛాదన!
సుమారు అరెకరంలో 15 అడుగుల లోతున నీటి కుంటను తవ్వి.. వాన నీటి సంరక్షణ చేస్తున్నారు. మిగతా పొలంలో ఖరీఫ్‌లో దేశీ వరి వంగడాలను, రబీలో అపరాలు సాగు చేస్తున్నారు. అపరాలు నూర్చిన తర్వాత ఎండాకాలంలో నాలుగైదు అంగుళాల మందాన పశువులు తొక్కిన గడ్డీ గాదాన్ని ఆచ్ఛాదనగా వాడుతున్నారు. ‘పంట భూమిలోని సూక్ష్మజీవులు, వానపాములే ప్రకృతి సేద్యంలో పంటలకు పోషకాలను అందిస్తాయి. వాటికి కృతజ్ఞతగా ఎండాకాలం ఇలా ఆచ్ఛాదన చేస్తున్నా’నని విజయరామ్ అంటారు. అది కారు చౌడు భూమి. భూగర్భ నీరు కూడా పంటలకు పనికిరావు. అయినా, ప్రతికూల పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని సవాలుగా తీసుకున్న విజయరామ్ దీక్షగా ముందడుగు వేశారు. చౌడు తీవ్రత ఎంతని అడిగితే.. అసలు భూసార పరీక్ష, నీటి పరీక్ష ఎందుకు? అని ఆయన ఎదురు ప్రశ్నిస్తారు. రసాయనిక సేద్యం చేసే మాగాణుల్లో నుంచి నీటి ఊట తన భూమిలోకి రాకుండా జాగ్రత్త పడడానికి 3-4 అడుగుల వెడల్పున గట్లు తీయడం విశేషం.
దేశీ వరి వంగడాల సేకరణ.. సాగు.. పంపిణీ..
ఒరిస్సాకు చెందిన దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమకారిణి సబర్మతి కృషిపై ‘సాక్షి’ ఫ్యామిలీలో నాలుగేళ్ల క్రితం ప్రచురితమైన కథనం విజయరామ్‌ను కదిలించింది. హుటాహుటిన సబర్మతి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని సందర్శించి.. అపురూపమైన అనేక వరి వంగడాల సేకరణకు ఉపక్రమించారు. అది మొదలు అనేక రాష్ట్రాలు పర్యటించి సుమారు 150 రకాలను సేకరించారు. 2015 ఖరీఫ్‌లో వీటిని తన క్షేత్రంలో చిన్న చిన్న మడుల్లో సాగు చేసి.. వాటి గుణగణాలను, దిగుబడినీ స్వయంగా నమోదు చేశారు. వీటిలో రైతులకు అన్ని రకాలుగా నచ్చే ఘని, మడు ముర్రంగి, నారాయణ కామిని, పుల్లాకార్, పుంగార్, కాలాభట్ సెంటెడ్, తులసి బాసొ వంటి వంగడాలను ఎంపిక చేశారు. వీటిని ఈ ఏడాది తన పొలంతోపాటు ఇతరులకు చెందిన సుమారు 60 ఎకరాల్లోనూ పెట్టుబడి లేని ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేయిస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలు వాడుతున్నారు. ఎటుచూసినా అడుగున్నర దూరంలో ఒక మొక్కను నాటితే చాలు. ఎకరానికి కిలో విత్తనం చాలు. చీడపీడల బెడద లేకుండా మంచి దిగుబడి పొందడానికి ఇదే మార్గమని విజయరామ్ అనుభవ పూర్వకంగా గ్రహించారు. ఆరోగ్యంగా పెరుగుతున్న తన పంటను చూపుతూ సందర్శకులతో ఇదే విషయాన్ని చెబుతుంటారు. రసాయనిక వ్యవసాయం చేసే వరి పొలాల్లో ఉన్న చీడపీడలు ఈ పొలంలో కనిపించకపోవడం విశేషం.
అధిక దిగుబడినిచ్చే దేశీ వంగడాలు..
కర్ణాటకకు చెందిన ఘనిఖాన్ అభివృద్ధి పరచిన ‘ఘని’ దేశీ వరి వంగడాన్ని 2.6 ఎకరాల్లో విజయరామ్ తన చౌడు భూమిలో సాగు చేస్తున్నారు. 120 రోజుల పంట. గింజ రాలదు. పడిపోదు. చీడపీడలు లేకుండా చక్కగా పెరిగిన ఈ వంగడం నెలలో కోతకు రానుంది. ఎకరానికి 35 బస్తాల (బస్తా 70 కిలోలు) దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.
తమిళనాడుకు చెందిన మడు ముర్రంగి రకం ఈ సీజన్‌లో 4 అడుగుల ఎత్తు పెరిగింది. పాలుపోసుకునే దశలో ఉంది. 130 రోజులు. పడిపోదు. గింజ రాలదు. నీటి మట్టం పెరిగే కొద్దీ అంతకన్నా ఎత్తు పెరగడం దీని ప్రత్యేకత. ఎకరానికి 25 - 30 బస్తాల దిగుబడి రావచ్చని ఆశిస్తున్నారు. ఈ రకం కృష్ణా డెల్టా రైతులకు విస్తృతంగా అందించాలని ఆశిస్తున్నారు.
నారాయణ కామిని వంగడాన్ని పశ్చిమ బెంగాల్‌కు చెందిన నారాయణ బచాడ అనే రైతు అభివృద్ధి పరిచారు. చక్కని రుచికరమైనది. నెమ్మదిగా జీర్ణమయ్యే గుణం కలిగిన ఈ వంగడాన్ని ఎక్కువ మందికి ఇవ్వడానికి విస్తారంగా సాగు చేయిస్తున్నామని విజయరామ్ తెలిపారు. పాలేకర్ సేద్య పద్ధతిని పూర్తిగా ఆచరిస్తే ఏ నేలలోనైనా తొలి ఏడాదే 20-15 బస్తాల దిగుబడి వస్తుందన్నారు.
తులసిబాసో అనే సుగంధ రకం బియ్యం సైజు చిన్నగా ఉంటుంది. వరి కోత అయిన తర్వాత పొలానికి నీరు పెట్టి వదిలేస్తే.. 35 రోజుల్లో మరోసారి 40% పంట దిగుబడి వస్తుందన్నారు.
ఈ ఏడాది తమ పొలంలో 75 సెంట్లలో నవారా (బ్లాక్ రైస్)ను సాగు చేస్తే.. పుష్కరాల కారణంగా కాలువ నీరు రావడం ఆలస్యమై నేల నెర్రెలిచ్చినప్పటికీ తట్టుకొని.. 10-12 బస్తాల దిగుబడి రావడం విశేషం. ప్రకృతి సేద్య పద్ధతులు, ఆచ్ఛాదన వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
వాన నీరు మన సంపద..
మన పొలంలో కురిసిన వాన నీరు మన సంపద. ఎకరానికి పది సెంట్ల స్థలంలో నీటి కుంట తవ్వుకుంటే.. వర్షాలు, కాలువ నీరు ఆలస్యంగా వచ్చినా నార్లకు, నాట్లకు ఆటంకం ఉండదు. డబ్బు వృథా, పంట విస్తీర్ణం వృథా అనుకోవడం తప్పు. మొదటి ఏడాదే ఖర్చు తిరిగి వచ్చేస్తుంది. మా అరెకరం కుంట వల్ల వ్యవసాయానికే కాదు.. 70 ఆవులకు, 20 మంది మనుషులకూ నీటి కొరత లేదు. కరువొచ్చినా ఒక్క ట్యాంకరు కూడా కొనలేదని విజయరామ్ అన్నారు.
కృష్ణా డెల్టా ప్రాంతంలో పొట్టి వరి రకాలు సాగులోకి వచ్చాక దేశీ వంగడాలు కనుమరుగైపోయాయి. అయితే, వరి గడ్డిని కట్టలు కట్టేందుకు ‘కట్ల గడ్డి’గా మాత్రం నెల్లూరు మొలగొలుకులు రకాన్ని ప్రతి వరి పొలంలోనూ కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తుండడం కనిపించింది!
ఆరోగ్యదాయకంగా దేశీ ఆవుల పోషణపై విజయరామ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం పెదముత్తేవి వద్ద 9 ఎకరాల్లో పశుగ్రాసాన్ని ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేస్తున్నారు. దేశీ ఆవు నెయ్యి, సంప్రదాయ గానుగలతో నూనెలు, షాంపూలు, సున్నిపిండి తదితర ఉత్పత్తులు తయారు చేసి విక్రయించడం ద్వారా రైతు సమగ్ర ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయడం అభినందనీయం.
జనవరి, ఫిబ్రవరిలో విత్తనోత్సవం
వివిధ రాష్ట్రాల్లో సేకరించి, తెలుగునాట సాగుచేసిన దేశీ వరి వంగడాలను వచ్చే జనవరి, ఫిబ్రవరిలో వేలాది మంది రైతులకు అందించేందుకు విజయరామ్ సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని ‘మన గ్రామం’ కార్యాలయంలో 2017 జనవరి 8, 9 10 తేదీల్లో భారీ ఎత్తున దేశీ వరి విత్తనాలు పంపిణీ చేస్తారు. పినగూడూరులంకలోని సౌభాగ్య గోసదన్‌లో ఆ తర్వాత ఏ రోజైనా దేశీ వరి విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. అదేవిధంగా, హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో విత్తనోత్సవం నిర్వహిస్తామన్నారు. వివరాలకు 0866 2583426 నంబరులో సంప్రదించవచ్చు.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఫొటోలు : జె. అజీజ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మచిలీపట్నం
ఔషధ విలువలున్న ఆహారాన్నందించడమే లక్ష్యం!
ఏదో ఒక పంట పండించాం.. తిన్నాం అని కాదు.. ఔషధ విలువలున్న ఆహారాన్ని ప్రజలకు అందించాలి. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ఖాళీ కావాలి. ఇదే లక్ష్యంతో వేలాది మంది రైతులకు గతంలో పాలేకర్ గారి ద్వారా శిక్షణ ఇప్పించాం. అదే దీక్షతో ఇప్పుడు దేశీ వరి విత్తనాలను వేలాది మంది రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఔషధ విలువలున్న వరి బియ్యం దైవం మనకిచ్చిన అద్భుత వరం. దేవాలయాల్లో నైవేద్యాలు దేశీ వరి బియ్యంతో పెడితే బాగుంటుంది. ఇందుకోసం యాదాద్రి పరిసరాల్లోని 365 మంది రైతులకు దేశీ వరి విత్తనాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ఆలయ ప్రాంగణంలోనే దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేస్తే.. దైవదర్శనానికి వచ్చిన రైతులకు దేశీ విత్తనాలు ఇస్తుండొచ్చన్నది ఆలోచన. పాలకులు స్పందించాలి.
- మేకపోతుల విజయరామ్, సౌభాగ్య గోసదన్, పినగూడూరు లంక (తరకటూరు దగ్గర), గూడూరు మం., కృష్ణా జిల్లా