ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతకు అపర నష్టం | Farmers lost their investments due to floods | Sakshi
Sakshi News home page

ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతకు అపర నష్టం

Published Fri, Sep 13 2024 5:43 AM | Last Updated on Fri, Sep 13 2024 5:43 AM

Farmers lost their investments due to floods

పొలాలపైకి పోటెత్తిన కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి  

రైతులను కన్నీట ముంచిన బుడమేరు, ఏలేరు, కొల్లేరు.. పది రోజులుగా వరద ముంపులోనే పంట పొలాలు 

19 జిల్లాల్లో 5.93 లక్షల ఎకరాల్లో పంటలు మునక.. అత్యధికంగా 4.29 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న వరి

ఎకరాకు రూ.20వేల నుంచి రూ.2లక్షల వరకు పెట్టుబడులు కోల్పోయిన రైతులు 

ప్రాథమికంగా 3.08 లక్షల మందికి రూ.403.93 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని అంచనా 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకు రూ.20వేలు పరిహారం ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు  

ఇప్పుడు ఎకరాకు రూ.10వేలతో సరిపెడుతున్న వైనం  

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు పోటెత్తాయి. ప్రభుత్వ నిర్వాకంతో బుడమేరు, ఏలేరు, కొల్లేరు సైతం విరుచు­కు పడ్డాయి. పంట పొలాలను ముంచెత్తాయి. ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంట వరద­పాలైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. 

ప్రాథమిక అంచనా ప్రకారం 19 జిల్లాల్లో 5.93లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 18 రకాల ఆహార, వాణిజ్య పంటలు 5.42లక్షల ఎకరాల్లో, మరో 51వేల ఎకరాల్లో 21 రకాల ఉద్యాన పంటలు పాడైపో­యాయి. మొత్తం 3.08 లక్షల మంది రైతులు నష్టపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయ­నగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం జరిగింది.

వరి రైతుల పరిస్థితి దారుణం
» వరి పంట 4.29లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నది. మరో 15 నుంచి 20 రోజుల్లో కోతకు వచ్చే దశలో ఉన్న పంట పది రోజులకు పైగా వరద నీటిలో నానడంతో పూర్తిగా కుళ్లిపోయింది. 
»    ప్రాథమికంగా 6 లక్షల టన్నుల ఆహార, వాణిజ్య, ఉద్యాన ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అత్యధికంగా 5,07,807 టన్నుల ధాన్యం ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
» వరి రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30 వేలు వరకు పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన ఒక్క వరి రైతులే రూ.1,200 కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోగా, ఉత్పత్తి రూపంలో మరో రూ.1,168 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా 
అంచనా వేశారు.
» ఆ తర్వాత 58వేల ఎకరాల్లో పత్తి, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.
»   ఉద్యాన పంటల్లో అత్యధికంగా 15వేల ఎకరాల్లో మిరప, 10వేల ఎకరాల్లో అరటి, మరో 10వేల ఎకరాల్లో పసుపు, 6వేల ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మరో 150 ఎకరాల్లో మల్బరీ తోటలు, మరికొన్ని ఇతర పంటలు పాడైపోయాయి.
» ఇప్పటికే ఎకరా మిరపకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు, కందకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు, పసుపునకు రూ.లక్ష, అరటికి రూ.75వేలు, తమలపాకులకు రూ.2లక్షలు, మొక్కజొన్నకు రూ.30వేలు, అరటికి 50వేలు, ఉల్లికి రూ.40వేలు, పత్తికి రూ.25వేలు, అపరాలకు రూ.15వేలు చొప్పున పెట్టుబడులు పెట్టారు. 
» ఆహార, వాణిజ్య పంటలకు రూ.358.91 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.42.34 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.2.68 కోట్లు కలిపి మొత్తం 3.08లక్షల మంది రైతులకు రూ.403.93 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని ప్రాథమికంగా అధికారులు లెక్కతేల్చారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఇది మరింత కోత పెట్టే అవకాశాలు ఉన్నాయి.

కౌలురైతులకు తీవ్ర నష్టం
పంట నష్టం అంచనాలకు నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండటం... సాగుదారుల పేర్ల నమోదుకు భూ యజమానులు అభ్యంతరం వ్యక్తంచేస్తుండటంతో ఎన్యుమరేషన్‌ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. చాలా జిల్లాల్లో వెబ్‌ల్యాండ్‌ డేటా ఆధారంగా భూ యజమానుల పేరిట పంట నష్టం వివరాలు నమోదు చేస్తున్నారు. ఫలితంగా కౌలుదారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.  

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.20వేలు ఇస్తానని..
వరి రైతులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల పరిహారంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని భారీగా పెంచి ఇచ్చినప్పటికీ ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు లేనిపోని విమర్శలు  చేశారని, తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.20వేలు పరిహారం ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.10వేలకు సరిపెట్టడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
కేంద్ర బృందానికి మస్కా..
ఆగస్టు 30, 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని 28న ఐఎండీ హెచ్చరిక
కానీ ఆగస్టు 30న ఐఎండీ, సీడబ్ల్యూసీ హెచ్చరించినట్లు అబద్ధం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 
వరద నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి ప్రభుత్వం మస్కా కొట్టింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏపీలో ఆగస్టు 30, 31 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ­ని ఆగస్టు 28వ తేదీన ఐఎండీ హెచ్చరించింది. కానీ, ఆ హెచ్చరిక­లు ఆగస్టు 30న వచ్చినట్లు కేంద్ర బృందానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

అదే రోజున అన్ని జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ శాఖ అప్రమత్తం చేసి, వరదల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేసిందని పేర్కొంది. ఈ మేరకు వరద సహాయక చర్యలను సమర్థంగా చేపట్టడానికి ఆగస్టు 31న అధికారులతో ఓ కమిటీ వేశామని వివరించింది. కాగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చ­రిస్తే... ఇందుకు విరుద్ధంగా 30న హెచ్చరించిందంటూ కేంద్ర బృందాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందనే చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది.

ఇంకా 34వేల ఎకరాల్లోనే పంట నష్టం నమోదు
తొలుత ఈ నెల 10వ తేదీలోపు పంట నష్టం అంచనాలు పూర్తిచేసి 11 నుంచి 16 వరకు సామాజిక తనిఖీల్లో భాగంగా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని, అభ్యంతరాల పరిష్కారం అనంతరం 20న తుది జాబితాలను ప్రదర్శించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ, ఎక్కడా సరిగా పంట నష్టం నమోదు జరగలేదు. దీంతో నష్టం అంచనాల నమోదుకు 18వ తేదీ వరకు గడువు పొడిగించారు. ప్రాథమికంగా 5.93 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. ఇప్పటి వరకు 34వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగలిగారు. 

తొలుత ఈ–క్రాప్‌ నమోదును ప్రామాణికంగా పేర్కొన్నారు. వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో 50 శాతం కూడా ఈ–పంట నమోదు పూర్తి కాలేదు. దీంతో ఈ నిబంధనను మినహాయించారు. ఎన్యుమరేషన్‌లో వాస్తవ సాగుదా­రుల వివరాలను నమోదు చేసినప్పటికీ సమాంతరంగా ఈ–క్రాప్‌లో కూడా వివరాలు నమోదు చేయాలని ఆదే­శించారు. ఈ–క్రాప్‌ నమోదు, ఎన్యుమరేషన్‌ ఒకే­సారి చేపట్టాల్సి రావడంతో అంతా గందరగోళంగా మారింది. నష్టం వివరాల్లో సాగుదారుల పేర్లను నమోదు చేస్తుంటే భూ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

గాడిలో పడని ఈ–క్రాప్‌..   ఆందోళనలో రైతులు
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్‌ నమోదు ఏటా ఖరీఫ్‌లో జూలై మొదటి వారంలో శ్రీకారం చుట్టి సెప్టెంబర్‌ 15 కల్లా పూర్తిచేసేవారు. సోషల్‌ ఆడిట్‌ అనంతరం అక్టోబర్‌ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్‌కు సంబంధించి నవంబర్‌ మొదటి వారంలో మొదలు పెట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. 

కానీ ఈసారి సీజన్‌ ప్రారంభమై 45 రోజులైనా పూర్తి స్థాయిలో ఈ–క్రాప్‌ గాడిలో పడలేదు. ఫలితంగా ప్రభుత్వ పథకాలకు అందకుండా పోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. గత∙ఐదేళ్లలో గత సీజన్‌లో నమోదైన ఈ–క్రాప్‌ డేటా ప్రామాణికంగానే రాయి­తీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ చేసేవారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, గడువులోగా పంట నష్ట పరిహారం, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రాయితీ అందించేవారు. 

ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఈ–క్రాప్‌ ప్రామాణికంగానే కొనుగోలు చేసేవారు. ఇలా సగటున ఏటా 1.65 కోట్ల ఎకరాలు చొప్పున ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు.  వైఎస్సార్‌ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్లు అందించారు. 

ఐదేళ్లలో 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, ఐదేళ్లలో 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. ఐదేళ్లలో 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement