మార్గం సుగమం: పంట పొలాల్లో సోలార్‌ ప్లాంట్లు | Solar Plants In Crop Fields | Sakshi
Sakshi News home page

మార్గం సుగమం: పంట పొలాల్లో సోలార్‌ ప్లాంట్లు

Published Sun, Sep 26 2021 1:58 AM | Last Updated on Sun, Sep 26 2021 2:00 AM

Solar Plants In Crop Fields - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులు సొంతంగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని, విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కంల)కు అమ్ముకునేందుకు మార్గం సుగమమైంది. ‘ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా సురక్ష ఉత్తన్‌ మహాభియాన్‌ (పీఎంకుసుమ్‌)’పథకం కింద రైతులు ఏర్పాటు చేసుకునే సోలార్‌ ప్లాంట్ల నుంచి డిస్కంలు కొనుగోలు చేయాల్సిన విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.3.13గా ఖరారైంది. దీనిపై గతంలోనే జారీ చేసిన టారిఫ్‌ ఆర్డర్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) మళ్లీ ఫైనల్‌ చేసింది. ఈ పథకం కింద పంజాబ్‌లో యూనిట్‌కు రూ.2.74, మధ్యప్రదేశ్‌లో రూ.3.07, జార్ఖండ్‌లో రూ.3.05 టారిఫ్‌ నిర్ధారించారని.. మన రాష్ట్రంలో ఎక్కువగా నిర్ణయించినందున తగ్గించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిం ది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

రైతుల ఆధ్వర్యంలో..
పీఎం కుసుమ్‌ పథకం కింద రైతులు, రైతుల గ్రూపులు, సహకార సంఘాలు, పంచాయతీలు, రైతుల ఉత్పాదక సంస్థ (ఎఫ్‌పీఓ)లు, నీటి వినియోగ సంఘాలవారు ఎవరైనా 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్లాంట్ల నిర్మాణానికి సగటున ఒక్కో మెగావాట్‌కు రూ.3.60 కోట్ల వ్యయం అవుతుంది. కనీసం 30శాతం పెట్టుబడి పెట్టగలిగితే.. బ్యాంకుల నుంచి మిగతా 70% వరకు రుణం లభించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పంపుసెట్లన్నింటినీ సౌర విద్యుత్‌తో నడపాలన్న లక్ష్యంతో.. పునరుత్పాదక విద్యుత్‌ ప్లాంట్లు, సోలార్‌ వాటర్‌ పంపుల ఏర్పాటు దిశగా కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ 2019లో పీఎం కుసుమ్‌ పథకాన్ని ప్రారంభించింది.

తెలంగాణకు లక్ష్యం 500 మెగావాట్లు
పీఎం కుసుమ్‌ కింద 2020–21లో దక్షిణ డిస్కం (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 300 మెగావాట్లు, ఉత్తర డిస్కం (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) 200 మెగావాట్లు కలిపి మొత్తం 500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను రైతులతో ఏర్పాటు చేయించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు, సబ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా.. 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో వీటిని నిర్మించాలి.

ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ను తీసుకుని గ్రిడ్‌కు సరఫరా చేయడానికి అవకాశమున్న సబ్‌స్టేషన్లు, అక్కడ అందుబాటులో ఉన్న సర్‌ప్లస్‌ సామర్థ్యం వివరాలను డిస్కంలు తమ వెబ్‌సైట్‌లో ప్రకటించాలి. ఆయా చోట్ల రైతుల నుంచి సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వా నించాలి. రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటు కోసం రివర్స్‌ బిడ్డింగ్‌ లేదా క్లోజ్డ్‌ బిడ్డింగ్‌ విధానంలో బిడ్లను డిస్కంలు ఆహ్వానించే అవకాశం ఉంది. తక్కువ ధరను సూచించిన బిడ్లను ఎంపిక చేసి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకుంటారు. ఈ పీపీఏ కాల వ్యవధి 25 ఏళ్లుగా ఉంటుంది.

డిస్కంలకు ప్రోత్సాహకాలు
పీఎం కుసుమ్‌ కింద ఏర్పాటు చేసే సోలార్‌ ప్లాంట్ల నుంచి కొనే ప్రతి యూనిట్‌ (కేడబ్ల్యూహెచ్‌) విద్యుత్‌కు 40 పైసల చొప్పునగానీ.. లేదా మెగావాట్‌కు ఏడాదికి రూ.6.6 లక్షల చొప్పునగానీ.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని ప్రోత్సాహకంగా డిస్కంలకు చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. ప్లాంట్‌ నుంచి వాణిజ్యపర ఉత్పత్తి (సీఓడీ) ప్రారంభమైన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం అందుతుంది. మొత్తంగా ఐదేళ్లలో ఒక్కో మెగావాట్‌కు రూ.33 లక్షల చొప్పున డిస్కంలకు ప్రోత్సాహకాలు రానున్నాయి. కాలుష్య నివారణలో భాగంగా డిస్కంలు తప్పనిసరిగా నిర్దేశిత పరిమాణంలో పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలని, లేకుంటే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. పీఎం కుసుమ్‌ కింద కొనే విద్యుత్‌ను ఈ కేటగిరీ కింద పరిగణించనుంది.

డెవలపర్లతో ఏర్పాటు చేయించుకోవచ్చు..
రైతులు, ఇతర లబ్ధిదారులు స్వయంగా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉంటే..  వారు డెవలపర్లతో ప్లాంట్లను ఏర్పాటు చేయించుకోవచ్చు. అయితే ప్లాంట్ల ఏర్పాటు కోసం డెవలపర్లకు తమ స్థలాలను అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది.
భూమికి ఏడాది లెక్కన అద్దెను గానీ.. లేదా ఏడాదిలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో యూనిట్‌కు కొంత మొత్తం చొప్పున డబ్బులనుగానీ అద్దెగా తీసుకోవచ్చు.
ఈ అద్దె డబ్బులను నేరుగా 
డిస్కంల నుంచే తమ బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా కోరవచ్చు.
ఇలా తమ భూములను అద్దెకు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతుల జాబితాను డిస్కంలు తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నాయి.
ప్లాంట్‌ ఏర్పాటు చేసే లబ్ధిదారులు/
డెవలపర్లే ప్లాంట్‌ నుంచి సబ్‌స్టేషన్‌ వరకు 11 కేవీ లైన్‌ వేయాల్సి ఉండనుంది.
సాగులో లేని బీడు భూముల్లోనే 
ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement