పంట పొలాల్లో కూలిన భారీ బెలూన్‌.. 1,050 కిలోల బరువు | Telangana Nagarkurnool Huge Balloon Crashed Crop Fields | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లో కూలిన భారీ బెలూన్‌.. 1,050 కిలోల బరువు

Published Mon, Feb 20 2023 8:57 AM | Last Updated on Mon, Feb 20 2023 11:04 AM

Telangana Nagarkurnool Huge Balloon Crashed Crop Fields - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్‌ గ్రామ శివారులో ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ఆకాశం నుంచి ఓ భారీ బెలూన్‌కు సంబంధించిన యంత్రం కూలడం కలకలం సృష్టించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బెలూన్‌ యంత్రాన్ని పరిశీలించారు. దానిని హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌)కు చెందిన బెలూన్‌గా గుర్తించారు.

బెలూన్‌ యంత్రం తర్నికల్‌ సమీపంలోని పొలాల్లో పడిపోగా.. జిల్లాలోని ఊర్కొండ మండలం శివారులోని బండారు బాలయ్యకు చెందిన మామిడితోటలో తెలుపు రంగు భారీ బెలూన్‌ పడిపోయింది. దీని మొత్తం బరువు సుమారు 1,050 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ఆకాశం నుంచి యంత్రం తమ దగ్గరలో వచ్చి పడిపోవడంతో భయం వేసిందని, కాసేపటి వరకు ఏమీ అర్థం కాలేదని రాజిరెడ్డి అనే రైతు చెప్పారు. టీఐఎఫ్‌ఆర్‌కు చెందిన హరినాయక్‌ నేతృత్వంలోని బృందం బెలూన్, యంత్ర పరికరాలను హైదరాబాద్‌కు తరలించింది. 

ఖగోళ, వాతావరణ పరిశోధన కోసమే..
అంతరిక్ష పరిశోధనలతోపాటు భూ ఉపరితలంపై వాతావరణ కాలుష్యం, ఓజోన్‌ పొర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని తమ బెలూన్‌ ఫెసిలిటీ సెంటర్‌ నుంచి ఈ నెల 17న ప్లాస్టిక్‌ రీసెర్చ్‌ బెలూన్‌ను ఆకాశంలోకి పంపించామని టీఐఎఫ్‌ఆర్‌కు చెందిన సైంటిఫిక్‌ ఆఫీసర్‌ నాగేందర్‌రెడ్డి తెలిపారు. 176 మీటర్ల పొడవు ఉండే ఈ బెలూన్‌ పేలిపోయే ప్రమాదం లేదని, జనసమ్మర్ధం లేనిచోట నెమ్మదిగా ల్యాండ్‌ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
చదవండి: తలసరి ‘విద్యుత్‌’లో 5వ స్థానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement