- తాళ్లపాలెం డ్రెయిన్‌పై క్రాస్‌బండ్‌కు గండి
- ఇప్పటికే నిండా మునిగిన రైతులు
- పాలకులకు చెప్పినా పట్టించుకోని వైనం
- రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని
మచిలీపట్నం : మురుగునీటి పారుదలకు అడ్డంకిగా మారిన తాళ్లపాలెం డ్రెయిన్‌పై ఉన్న క్రాస్‌బండ్‌కు సోమవారం రైతులు గండి కొట్టారు. బందరు మండలంలోని బోట్లవానిపాలెం, పల్లెతాళ్లపాలెం మధ్య ఏడు నెలల క్రితం తాళ్లపాలెం డ్రెయిన్‌పై వంతెన నిర్మాణం ప్రారంభించారు. అప్పట్లోనే ఈ వంతెన నిర్మాణం కోసం డ్రెయిన్‌కు క్రాస్‌బండ్ నిర్మించారు. ఏడు నెలలుగా కేవలం పునాదుల పనులు మాత్రమే పూర్తిచేశారు. నెల రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో పొట్లపాలెం, చిరివెళ్లపాలెం, గోకవరం, బొర్రపోతుపాలెం, పిళ్లారిశెట్టిపాలెం, పిల్లనగొల్లపాలెం, తాళ్లపాలెం గ్రామాల్లోని రైతులు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. వర్షపునీరు దిగువకు చేరడానికి వీలు లేకుండా ఉండటంతో వరినాట్లు పూర్తి చేసిన పొలాలు నీటమునిగి చనిపోయాయి.
మంత్రికి చెప్పినా ఫలితం లేదు..
పల్లెతాళ్లపాలెం, తాళ్లపాలెం, చిరివెళ్లపాలెం, బొర్రపోతుపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఒకటికి రెండుసార్లు మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు వెళ్లి తాళ్లపాలెం డ్రెయిన్‌పై క్రాస్‌బండ్ అడ్డుగా ఉండటంతో తమ పొలాల్లోని పైర్లు నీటమునిగి చనిపోతున్నాయని విన్నవించారు. ఆదివారం జెడ్పీ సమావేశానికి వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావును కలిసి మరోసారి తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. క్రాస్‌బండ్ తొలగిస్తామని చెప్పటమే తప్ప ఎలాంటి పనులు చేయలేదు. దీంతో రైతులు విషయాన్ని వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) దృష్టికి తీసుకువెళ్లారు.
కాంట్రాక్టర్‌కు సర్దిచెప్పినా ససేమీరా..
సోమవారం ఉదయం తాళ్లపాలెం డ్రెయిన్‌పై వంతెన నిర్మిస్తున్న ప్రాంతం వద్దకు నాని, రైతులు వెళ్లారు. క్రాస్‌బండ్ తొలగించాలని కాంట్రాక్టర్‌తో సంప్రదింపులు జరిపారు. అయితే 15 రోజుల వరకు క్రాస్‌బండ్ తొలగించే ప్రసక్తే లేదని కాంట్రాక్టర్ చెప్పటంతో రైతులకు, కాంట్రాక్టర్లకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వేలాది ఎకరాల్లో మురుగునీరు నిలిచిపోయి పైరు చనిపోతోందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న క్రాస్‌బండ్‌ను తొలగించాలని పేర్ని నాని కాంట్రాక్టర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కాంట్రాక్టర్ తాను క్రాస్‌బండ్‌ను తొలగించేది లేదని చెప్పటంతో పొక్లెయిన్‌ను తీసుకువచ్చి క్రాస్‌బండ్‌కు మధ్యలో గండికొట్టారు. పొక్లెయిన్‌కు మట్టి తవ్వటం సాధ్యపడకపోవటంతో పేర్ని నానితో పాటు రైతులు స్వయంగా గండిలోకి దిగి పారలతో మట్టిని తొలగించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తాళ్లపాలెం డ్రెయిన్ ఆయకట్టు పరిధిలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశామని తెలిపారు.
నీరు ఎక్కువ రోజులు పొలాల్లో నిల్వ ఉండిపోవటంతో మొదటి సారి వేసిన పైరు దెబ్బతిందని, మళ్లీ నాట్లు పూర్తి చేశామని, రెండోసారి కూడా పొలాల్లోని పైరు చనిపోయేందుకు సిద్ధంగా ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు పొలాలను ముంచెత్తటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పరిహారం ఇప్పించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. వెఎస్సార్ సీపీ నేత బొర్రా విఠల్, తాళ్లపాలెం సర్పంచి రవిశంకర్, సిరివెళ్లపాలెం మాజీ సర్పంచి బలరాం పాల్గొన్నారు.