నిండని చెరువులు..రైతన్న గుండె గుబేలు
వరుణుడి కరుణ కోసం రైతన్న ఆకాశం వైపు ఎదురు చూడడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. రెండు నెలలుగా వర్షాలు సాధారణ స్థాయి కన్నా తక్కువగా నమోదు కావడంతో భూములన్నీ బీళ్లుగా మారాయి. దీంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చెరువులు నిండకపోవడంతో ఆయకట్టు కూడా ప్రశ్నార్థకంగా మారింది.
- సకాలంలో కురవని వర్షాలు
- అడుగంటిన భూగర్భజలాలు
- నెర్రెలువారిన పంట పొలాలు
- ఆందోళన చెందుతున్న అన్నదాతలు
మహేశ్వరం: వర్షాలు సకాలంలో కురవకపోవడంతో మండల పరిధిలోని పలు చెరువుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఆయకట్టు కింద సాగయ్యే పంట పొలాలు బీళ్లుగా మారుతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో ఉన్న పెద్ద చెరువు, తుక్కుగూడ, మంఖాల్, తుమ్మలూరు, మహేశ్వరం, మన్సాన్‌పల్లి, అమీర్‌పేట్, కల్వకోల్, గొల్లూరు, కోళ్లపడకల్, దుబ్బచర్ల, నాగారం తదిర గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలల్లో చుక్కనీరు లేవు. గతేడాదితో పోల్చుకుంటే.. ఈసారి తొలకరి ముందుగా పలకరించడంలో రైతులు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు.
దీంతో దుక్కులు దున్ని ఎరువులు, విత్తనాలు చల్లుకున్నారు. అయితే మొలకెత్తిన మొక్కజొన్న, పత్తి, వరి, కూరగాయ పంటలు వర్షాలు కురవక ఎండుముఖం పడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు సైతం ఎండిపోయాయి. దీంతో వీటిని నమ్ముకున్న రైతులు వరి సాగుకు దూరమయ్యారు. వర్షాలు అదును దాటి పోతుండడంతో చెరువు ఆయకట్టు కింద వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. నాట్లు వేసుకునే సమయంలో చెరువుల్లో సాగు నీరు లేక పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.
చెరువుల్లో నీరు లేక
ఆయకట్టు కింద వరి సాగు చేద్దామంటే చెరువుల్లో చుక్క నీరు లేదు. బోర్లు అన్నీ ఎండు ముఖం పట్టాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వర్షాధార పంటలు ఎండు ముఖం పట్టాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- శేఖర్, రైతు, కోళ్లపడకల్
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
రైతులు కంది, పెసర, బెబ్బర , ఆము దం, నువ్వులు ఆరుతడి పంటలు వేసుకోవాలి. వాడు ముఖం పడుతున్న పంటలకు యూరియాను నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.
-రుద్రమూర్తి, ఏడీఏ, మహేశ్వరం
చెరువులు నిండుతేనే..
చెరువులు నిండుతేనే బోర్లలో పుష్కలంగా నీరు ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తే భూగర్భజలాలు పెరిగి బోర్లు పుష్కలంగా నీరు పెరుగుతాయి. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి అన్నదాతకు నష్టపరిహారం చెల్లించాలి.
- పుంటికూర శేఖర్‌రెడ్డి, రావిర్యాల