ఉమా.. ఏమి డ్రామా!.. | Devineni uma double standards on Agricultural lands | Sakshi
Sakshi News home page

ఉమా.. ఏమి డ్రామా!..

Published Mon, Dec 8 2014 7:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

ఉమా.. ఏమి డ్రామా!.. - Sakshi

ఉమా.. ఏమి డ్రామా!..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెట్ట పొలాలు లాక్కుని రైతుల పొట్టకొట్టొద్దని రోడ్డెక్కారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకుని పశ్చిమ కృష్ణాలో ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. నాడు పొలాలు ఇవ్వొద్దని ధైర్యం చెప్పిన నాలుకతోనే నేడు పచ్చని పొలాలు ఇవ్వాల్సిందేనని రాజధాని జోన్ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆయనే నాటి నందిగామ ఎమ్మెల్యే.. నేటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఆయనలో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
 
⇒  నాడు మెట్ట భూములు కూడా తీసుకోవద్దని రైతుల తరఫున ఆందోళనలు
⇒   సొంత నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనను సైతం అడ్డుకున్న వైనం
⇒   కంచికచర్ల మండలంలో ఉపాధి అవకాశాలపై ప్రభావం
⇒   నేడు పచ్చని పంటపొలాలు ఇవ్వాలని రైతన్నలపై ఒత్తిడి
⇒   ఎనిమిదేళ్లలో దేవినేని ఉమాలో ఎంత మార్పు !

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘కంచికచర్ల మండలంలో పరిశ్రమల స్థాపన కోసం రైతుల భూములను తీసుకుంటే ఊరుకోం. బాధిత రైతులకు అండగా ఉంటాం. ఆందోళనలు చేస్తాం...’ అంటూ 2006 అక్టోబర్‌లో అప్పటి నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. రైతులతో ఆమరణ దీక్షలు చేయించారు. దీంతో పరిశ్రమలు ఇతర జిల్లాలకు వెళ్లిపోయాయి. ఇప్పుడు దేవినేని ఉమా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు.

ఆయన పదవిలోనే కాదు తీరులోనూ మార్పు వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చినా అడ్డుకున్న ఉమా... ఇప్పుడు అధికార పక్షంలో ఉండటంతో రాజధాని కోసం పచ్చని పొలాలను ఇవ్వాలని పొరుగు జిల్లాకు సైతం వెళ్లి రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఉమాలో ఎంత మార్పు వచ్చిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.  
 
రాస్తారోకో చేశారు...  పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కంచికచర్ల మండలంలోని బత్తినపాడు, పరిటాల, నక్కలంపేట గ్రామాల పరిధిలో రైతుల నుంచి 1,632 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూముల్లో టెక్స్‌టైల్ పార్క్, అపెరల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో నందిగామ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని ఉమా ఈ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించారు.

రైతుల భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులతో ఆమరణ దీక్షలు చేయించారు. గుంటూరు జిల్లాకు చెందిన అప్పటి తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రైతుల పక్షాన కంచికచర్లలో రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆయనపై 2006, అక్టోబరు 15న పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ గొడవల నేపథ్యంలో ఏపీఐఐసీ వారు ఇక్కడ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటును విరమించుకున్నారు. ఆ పార్క్‌ను నెల్లూరు జిల్లాకు తరలించారు.  
 
నాడు ముంపు భూములపై రాద్ధాంతం!
కంచికచర్ల మండలంలో ఏపీఐఐసీ సేకరించాలనుకున్న 1,632 ఎకరాలు ఆహార పంటలు పండేవి కాదు. సుబాబుల్ మాత్రమే సాగుచేసేవారు. కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగితే ఈ భూములు ముంపునకు గురవుతాయి. అటువంటి భూముల్లో పరిశ్రమల ఏర్పాటును అప్పట్లో ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు.  
 
నేడు పచ్చని పంట పొలాలు ఇవ్వాలని ఒత్తిడి

ప్రస్తుతం ఉమా తీరులో పెనుమార్పు వచ్చింది. రాజధాని నిర్మించనున్న తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆరుగాలం పంటలు పండించే భూములను రాజధానికి ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. నెలరోజుల నుంచి ఖాళీ దొరికితే ఆయా గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడుతున్నారు. సభల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కొందరు రైతులను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి హైదరాబాద్‌కు తీసుకెళ్లి తమ భూములు తప్పకుండా ఇస్తామని చెప్పించారు.

కొందరు తమ ఇష్టానుసారమే భూములు ఇస్తామని చెప్పినప్పటికీ, మరికొందరు మాత్రం  మంత్రి బలవంతం కారణంగానే భూములిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 70శాతం మంది రైతులు తమ భూములు రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు వ్యతిరేకంగా ఉన్నారు. రాయపూడి గ్రామంలో రైతులంతా తమ భూములు ఇచ్చేంది లేదంటూ అధికారులను సైతం నిలదీస్తున్నారు. మంత్రులను అడ్డుకుంటున్నారు. అయినా, వారి భూములు తీసుకునేందుకు సామ దాన భేద దండోపాయాలు రైతులపై మంత్రి ఉపయోగిస్తున్నారు.
 
ఉపాధి అవకాశాలపై దెబ్బ

అప్పట్లో కంచికచర్ల మండలంలో టైక్స్‌టైల్ పార్క్‌ను నిర్మించి ఉంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించేవి. ఇప్పుడు ఆ పార్క్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది. ఉపాధి అవకాశాలు కూడా పెరిగేవి. అప్పట్లో ఉమా ప్రతిపక్షంలో ఉన్నందున  తాను రైతుల పక్షాన ఉన్నానని చెప్పేందుకు ఆ విధంగా చేశారు. అయితే నేడు ఆ నీతి ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement