
రైతు ఆత్మహత్యలపై రగడ
- రాజ్యసభలో కార్యక్రమాలను అడ్డుకున్న కాంగ్రెస్, ఎస్పీ
- లోక్‌సభలోనూ దుమారం
న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యలపై సోమవారం పార్లమెంటు అట్టుడికింది. వరి, పత్తి పంటల ప్రభుత్వ సేకరణ ధర భారీగా తగ్గడంతో దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు ఒడిగడ్తున్నారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తా యి. పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తి గందరగోళం సృష్టించాయి. రాజ్యసభలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. పంటలకుదిగుబడి ఖర్చుపై 50% ఎక్కువగా ధర ఇస్తామన్న ప్రధాని మోదీ ఎన్నికల హామీని గుర్తుచేస్తూ .. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
తమ స్థానాల్లోకెళ్లాలంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురి యన్ చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా నినాదాలు చేస్తుండటంతో ఆయన సభను రెండుసార్లు వాయిదా వేశారు. జీరోఅవర్‌లో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు అహ్మద్ పటేల్ లేవనెత్తారు. పత్తి ధర నిరుడు క్వింటాల్‌కు రూ. 7 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 3 వేలకు పడిపోయిందన్నారు. యూపీఏ హయాంలో సరైన ధరకు పత్తిని కొనుగోలు చేయాల్సిందిగా కాటన్ కార్పొరేషన్‌కు ఆదేశించామని, ఇప్పుడు అలాం టి ఆదేశాలేవీ సీసీఐకి ఇవ్వలేదని తెలిపారు.
పత్తి కనీస మద్దతు ధర రూ. 3,750 నుంచి రూ. 4,050 మధ్య ఉంటుందని జౌళి శాఖ మంత్రి చెప్పారని, అది గత సంవత్సరం ఇచ్చిన రూ. 5,900 కన్నా చాలా తక్కువని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ వివరించారు. వ్యవసాయ సంక్షోభం కారణంగా మహారాష్ట్రలోనే దాదాపు 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం సేకరణను 25 శాతానికి తగ్గించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలిచ్చిన కారణంగా.. యూపీ, పంజాబ్, హరియానా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎస్పీసభ్యుడు నరేశ్ అగర్వాల్ పేర్కొన్నారు.
లోక్‌సభలో: కశ్మీర్ వరదల మాదిరిగానే మహారాష్ట్రలో కరవును కూడా జాతీయ విపత్తుగా ప్రకటించాలని లోక్‌సభలో బీజేపీ సభ్యుడు నానాభావ్ పాటోల్ డిమాండ్ చేశారు. విదర్భ ప్రాంతంలో ఒకే రాత్రి 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాదాన్ని ఆయన సభకు వివరించారు. వరదలు, కరవుల వల్ల యూపీ, పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు చెందిన పలువురు సభ్యులు ప్రస్తావించారు. కర్నాటకలోని దాదాపు 12 జిల్లాల రైతుల కరవుతో, మరికొన్ని జిల్లాల రైతులు వరదలతోభారీగా నష్టపోయారని మరో సభ్యుడు ధ్రువనారాయణ తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సీపీఎం సభ్యుడు పీకే బిజు ఆరోపించారు.