లోక్‌సభలో నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులు
న్యూఢిల్లీ: వివాదాస్పద పెగసస్ స్పైవేర్, మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం సైతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన పర్వం యథావిధిగా కొనసాగాయి. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష సభ్యులు వెంటనే వెల్‌లోకి చేరుకొని నినాదాలు చేశారు. పెగసస్‌తోపాటు కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. వెనక్కి వెళ్లి సీట్లల్లో కూర్చోవాలని, సభా వ్యవహారాలకు సహకరించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు.
15 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021’పై చర్చకు అనుమతించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపు మాట్లాడారు. ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు ఉద్దేశించిన ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్‌మెంట్) బిల్లు–2021’పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తర్వాత ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు.
సీరియస్ విషయమని సుప్రీం చెప్పిందిగా..
పెగసస్ స్పైవేర్‌పై వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం లోక్‌సభలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021’ను తీసుకొచ్చిందని, అదే న్యాయస్థానం పెగసస్ అనేది సీరియస్ విషయమని చెప్పిందని అన్నారు. ఇంతలో ఆయన మైక్రోఫోన్‌ను స్పీకర్ స్విచ్చాఫ్ చేశారు. తర్వాత ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్‌మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టినప్పుడు అధిర్ రంజన్ మాట్లాడారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని పునరుద్ఘాటించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ స్పందిస్తూ.. వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలే అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు.
రాజ్యసభలో ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు
ఎగువ సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. పెగసస్ అంశంతోపాటు కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్‌లోకి దూసుకొచ్చి కాగితాలు వెదజల్లి, బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాల కోసం సభ మళ్లీ ప్రారంభమయ్యింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న సురేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతిరోజూ ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఉభయ సభల్లో ఆందోళన సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment